Begin typing your search above and press return to search.

బొత్సకు జగన్ విశేష ప్రాధాన్యం...అయిదు జిల్లాలు చేతికి !

వైసీపీలో జగన్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

By:  Satya P   |   14 Sept 2026 9:09 AM IST
బొత్సకు జగన్ విశేష ప్రాధాన్యం...అయిదు జిల్లాలు చేతికి !
X

వైసీపీలో జగన్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 2015లో బొత్స వైసీపీలో చేరినది లగాయితూ గత పదకొండేళ్ళుగా బొత్సకు వైసీపీలో ప్రాముఖ్యత పెరిగిందే తప్ప తగ్గడం లేదు. 2019 నుంచి 2024 వరకూ సాగిన జగన్ ప్రభుత్వంలో అయిదేళ్ళ మంత్రిగా కొనసాగిన అతి తక్కువ మందిలో బొత్స కూడా ఒకరు. ఆయన 2024లో ఓడిన తరువాత కూడా ఎమ్మెల్సీగా చేసి శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చేశారు. ఇక ఇప్పుడు చూస్తే విజయనగరం జిల్లాలో బొత్స సొంత మేనల్లుడు చిన్న శ్రీను ఏకంగా పార్టీకి గుడ్ బై కొట్టేసి వెళ్ళిపోయారు. ఒక విధంగా బొత్స సొంత ఇలాకాలో ఇది రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి గానే చూస్తున్నారు. అదే సమయంలో జగన్ వద్ద బొత్స పలుకుబడి తగ్గిపోతుందని కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే దానికి భిన్నంగా జగన్ అమాంతం బొత్స ప్రాధాన్యతను పెంచేస్తూ ఏకంగా అయిదు జిల్లాలు ఆయన చేతిలో పెట్టడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

గోదావరి పగ్గాలు :

ఇదిలా ఉంటే బొత్స సత్యనారాయణను రీజనల్ కో ఆర్డినేటర్ గా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలను కూడా అప్పగించారు. గతంలో ఇందులో కొన్ని జిల్లాల బాధ్యతలు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఇచ్చారు. ఇపుడు వీటిని బొత్సకే అప్పగించారు. అలా గోదావరి జిల్లాలలో బొత్స సారథ్యాన్ని పెంచారు. ఇక్కడ జనసేన గట్టిగా ఉండడంతో పాటు బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉండడం వంటి సమీకరణలను బేరీజు వేసుకున్న మీదటనే బొత్సకు కీలక బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల కాలంలో చూస్తే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణించడంతో గోదావరి జిల్లాలలో వైసీపీకి మరింతగా స్ట్రాంగ్ ఫేస్ ఆ వర్గంలో కావాల్సి ఉందని అంటున్నారు. అందుకే బొత్సను ముందు పెట్టారని అంటున్నారు.

మరో బంధువుకు చోటు :

అంతే కాదు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నిన్నటిదాకా బొత్స సొంత మేనల్లుడు చిన్న శ్రీను ఉండేవారు. ఆయన పార్టీ వీడాక ఇపుడు బొత్స మరో బంధువు అయిన బెల్లాన చంద్రశేఖర్ కే జిల్లా పగ్గాలు అప్పగించడం ద్వారా విజయనగరం జిల్లా బొత్స కనుసన్నలలోనే సాగుతుందని స్పష్టం చేశారు అని సందేశం పంపించారు అని అంటున్నారు. కేవలం విజయనగరం మాత్రమే కాదు ఉత్తరాంధ్రా అంతటా బొత్స రాజకీయ పలుకుబడిని పెంచుతూ వైసీపీ ఆమోదముద్ర వేసింది అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో సగం దాకా జిల్లాలలో బొత్స మాటే రాజకీయంగా వైసీపీలో నెగ్గే పరిస్థితిని అధినేత జగన్ కల్పించారు అని అంటున్నారు.

పెద్దిరెడ్డి సైతం :

ఇక రాయలసీమ వ్యాప్తంగా మంచి పట్టు ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయా జిల్లాలను జగన్ అప్పగిస్తూ ఆయనకు రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యలు ఇచ్చారని అంటున్నారు. కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా నియమితులయ్యారు. ఇక జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాకే పరిమితం చేశారు. ఆయన గతంలో ఉమ్మడి క్రిష్ణా జిల్లా బాధ్యతలను కూడా చూశారు. అయితే ఇపుడు ఆయన పవర్ ని తగ్గించారు అని అంటున్నారు. మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని ఉమ్మడి కృష్ణా ప్రకాశం జిల్లాలకు ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు.