అందుకే కళ్ళు మూసుకున్నాం... చిన్న శ్రీనుపై బొత్స !
బొత్స ఉత్తరాంధ్ర భాషలో మాట్లాడుతూ పార్టీ అన్నాక ఇలాంటివి సహజం అన్నారు. ఒకరిద్దరు నాయకులు బయటకు వెళ్ళినంత మాత్రాన ఏమవుతుందని ప్రశ్నించారు.
By: Satya P | 4 Oct 2026 1:00 PM ISTవిజయనగరం జిల్లాలో స్థానిక ఎన్నికల రాజకీయం కంటే కూడా వైసీపీలో చిన్న శ్రీను ప్రకంపనలు తదనంతర పరిణామాలే ఎక్కువ హీట్ ని పుట్టిస్తున్నాయి. చిన్న శ్రీను పార్టీని వీడి నెల రోజులు అవుతున్నా ఆ ప్రభావం వైసీపీని స్థిమితం లేకుండా చేస్తోంది. తాజాగా చిన్న శ్రీను వియ్యంకుడు బడ్డుకొండ అప్పలనాయుడు సస్పెండ్ అయ్యారు. దాంతో ఆగ్రహించిన ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరిన్ని వికెట్లు పడబోతున్నాయని చిన్న శ్రీను వర్గం ఒక వైపు సంకేతాలు ఇస్తోంది. విజయనగరం జిల్లా వైసీపీ అంటేనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నంతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాల మీద బొత్స తనదైన శైలిలో స్పందించారు. ఎస్ కోట నియోజకవర్గంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స మాట్లాడుతూ పార్టీని వీడిన వారిది దోపిడీయే అజెండా అని హాట్ కామెంట్స్ చేశారు.
పోతే ఏటవుతాది :
బొత్స ఉత్తరాంధ్ర భాషలో మాట్లాడుతూ పార్టీ అన్నాక ఇలాంటివి సహజం అన్నారు. ఒకరిద్దరు నాయకులు బయటకు వెళ్ళినంత మాత్రాన ఏమవుతుందని ప్రశ్నించారు. పార్టీ ఎప్పటికీ శాశ్వతం అన్నారు. వైసీపీకి జనంలో ఆదరణ ఉందని ప్రజలు పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. అందువల్ల నాయకులు వెళ్తే పార్టీకి ఏమీ కాదని చెప్పారు. స్వార్ధంతో స్వలాభంతోనే కొందరు పార్టీని వీడిపోతున్నారు అని ఆయన మండిపడ్డారు. నాయకులు వెళ్ళినంత మాత్రాన కార్యకర్తలకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని బొత్స చెప్పారు.
ప్రేమ ఎక్కువైపోయి :
చిన్న శ్రీను పార్టీని వీడడం మీద బొత్స వ్యాఖ్యానిస్తూ అభిమానం ప్రేమ ఉన్న చోట కళ్ళు మూసుకుని పోతాయని వ్యాఖ్యానించారు. అందువల్లనే ఇన్నాళ్ళూ కొన్ని విషయాలని పట్టించుకోలేదని అన్నారు. అది తమ అవివేకం కూడా కావచ్చు లేదా అశ్రద్ధ కూడా కావచ్చు అని బొత్స తన మీదనే సెటైర్లు వేసుకున్నారు. ఆనాడు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలాంటివి జరిగాయని, ఇలా ఫిరాయిస్తున్న వారి అసలు ఉద్దేశ్యాలు కూడా ఆలస్యంగానే అర్థం అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటామని కార్యకర్తలకే పెద్ద పీట వేస్తామని ఆయన చెప్పారు.
కష్టపడిన వారికే :
ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో కష్టపడతారో వారికే ప్రాధాన్యత ఉంటుందని బొత్స అన్నారు. తాను క్యాడర్ కి అండగా ఉంటాను అని ఆయన హామీ ఇచ్చారు. ఏపీలో కూటమి పాలన తీరు మీద కూడా ఆయన నిప్పులు చెరిగారు. తన మొత్తం రాజకీయ జీవితంలో ఈ తరహా దోపిడీ పాలన చూడలేదని బొత్స మండిపడ్డారు. ప్రజలతో కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద వైసీపీ ఉద్యమిస్తుందని బొత్స స్పష్టం చేశారు.
బొత్స చెప్పిందేంటి :
ఇవన్నీ పక్కన పెడితే బొత్స చెప్పిందేంటి అన్నది వైసీపీలో చర్చ సాగుతోంది. సొంత మేనల్లుడు కాబట్టే చూసీ చూడనట్లుగా వ్యవహరించామని ఇపుడు ఆయన పశ్చాతాపం పడుతున్నారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. బొత్సకు చిన్న శ్రీను పార్టీని వీడడం వంటి పరిణామం అయితే ఇబ్బందికరంగా మారిందనే అంటున్నారు. పోయే వారు పోతారు అని తేలికగా అంటున్నా జిల్లా రాజకీయాల్లో వైసీపీకి అలాగే బొత్స ఆధిపత్యానికి ఒక సవాల్ గానే ఈ పరిణామాలు ఉండబోతున్నాయని కూడా విశ్లేషిస్తున్నారు.
