Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డిపై ఎదురుదాడి.. మాజీ ఎంపీ ఆరోపణలపై బొత్స ఫైర్

ఆదివారం విశాఖలో మీడియాతో బొత్స మాట్లాడారు. ఈ సందర్భంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖపై చర్చ జరిగింది.

By:  Tupaki Political Desk   |   31 Aug 2026 8:02 AM IST
విజయసాయిరెడ్డిపై ఎదురుదాడి.. మాజీ ఎంపీ ఆరోపణలపై బొత్స ఫైర్
X

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై విపక్షం వైసీపీ గట్టిగా ఎదురుదాడి చేస్తోంది. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై మౌనంగా ఉంటే రాజకీయంగా నష్టమని వైసీపీ అంచనాకు వచ్చినట్లు కనిపిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వరుసగా మీడియా ముందుకు వచ్చారు. విజయసాయిరెడ్డి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై సజ్జల పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వగా, బొత్స మాత్రం విజయసాయిరెడ్డి ఆరోపణలకు పెద్దగా విలువ లేదంటూనే ఆయన వ్యాఖ్యలను టైం వేస్టుగా అభివర్ణించారు.

జనసేనలో చేరుతారా?

ఆదివారం విశాఖలో మీడియాతో బొత్స మాట్లాడారు. ఈ సందర్భంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖపై చర్చ జరిగింది. ఉత్తరాంధ్ర నుంచి ఒక నేత పార్టీ మారతారంటూ విజయసాయిరెడ్డి తన లేఖలో ప్రస్తావించారని, ఆ నాయకుడు మీరేనంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అంటూ విలేఖరులు బొత్స దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై నవ్వుతూ స్పందించిన బొత్స మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి పనిలేదని, ఆయన ఖాళీగా ఉంటూ ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఖాళీగా ఉన్నారని, ఇద్దరు కలిసి ఇలాంటివి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంతో తనకు అవసరం లేదని, సోషల్ మీడియాకు తాను దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. దీంతో బొత్స పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం ఉట్టి ఊహాగానాలే అంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

మరో కేఏ పాల్

ఇక విజయసాయిరెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే మాజీ మంత్రి బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంతకు ముందు కేఏ పాల్ ఉండేవారు.. ఇప్పుడు ఈయన (విజయసాయిరెడ్డి)వచ్చారంటూ నవ్వులు పూయించారు. బొత్స వ్యాఖ్యలతో విజయసాయిరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపలేరని, కేవలం మాటలు, మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతారని తేల్చిచెప్పినట్లు అయిందని అంటున్నారు. విజయసాయిరెడ్డి ఆరోపణలపై స్పందించి ప్రజా సమస్యలను వదిలేయలేనని బొత్స వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ మాటలను పట్టించుకోవడం అంటే సమయం వృథా అన్నట్లు భావించాలని స్పష్టం చేశారు.

మొత్తానికి వైసీపీలో తాజా పరిణామాలు గమనిస్తే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో ఆ పార్టీ ఉలిక్కిపడినట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నడూ లేనట్లు వైసీపీ సీనియర్ నేతలు ఒకేసారి ఎదురుదాడికి దిగడం చూస్తుంటే విజయసాయిరెడ్డి ఆరోపణలు పార్టీకి నష్టం చేసేవిగా ఉన్నాయని అధిష్టానం భావించినట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఏడాదిన్నర క్రితం పార్టీ నుంచి వెళ్లిపోయిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు వైసీపీపైన ఆ పార్టీ సీనియర్లపైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఆయన విషయంలో కాస్త మెతకగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు వ్యూహం మార్చినట్లు భావిస్తున్నారు. మాజీ ఎంపీని ఉపేక్షిస్తే ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ప్రజలను గందరగోళానికి గురిచేసి లేనిపోని అనుమానాలకు తావిచ్చేలా చేసినట్లు అవుతుందనే అభిప్రాయంతోనే వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.