బొత్స ఫుల్ క్లారిటీతోనే ఉన్నారట !
ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ కీలక నాయకుడు, బీసీ వర్గంలో బలమైన నేత అయిన బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం నాలుగు దశాబ్దాలు పై దాటింది.
By: Satya P | 6 Sept 2026 9:58 AM ISTఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ కీలక నాయకుడు, బీసీ వర్గంలో బలమైన నేత అయిన బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం నాలుగు దశాబ్దాలు పై దాటింది. ఆయన ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. జస్ట్ మిస్ కానీ ముఖ్యమంత్రి కావాల్సిన వారు అని కూడా చెబుతారు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఆయన విభజన ఏపీలో రాజకీయంగా నెగ్గాలంటే తగ్గాలని భావించి వైసీపీలో చేరారు. అలా తన బలాని పలుకుబడిని ఉత్తరాంధ్రా జిల్లాలలో కాపాడుకుంటూ 2019 నుంచి 2024 దాకా అయిదేళ్ల పాటు పూర్తి కాలం మంత్రిగా జగన్ కేబినెట్ లో పనిచేశారు. 2024 ఎన్నికల్లో ఓడిన వెంటనే ఆయనకు శాసనమండలిలో కేబినెట్ హోదాతో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవి దక్కింది. ఈ నేపధ్యంలో బొత్స సత్యనారాయణ రాజకీయం మీద పలు చర్చలు ఊహాగానాలు బయల్దేరాయి. ఆయన వైసీపీకి దూరం అవుతారని జనసేనలో చేరిపోతారని కూడా పెద్ద ఎత్తున పుకార్లుగా గాసిప్పులుగా షికారు చేశాయి. ఈ పుకార్లు ప్రచారం వెనుక సొంత పార్టీ వాళ్ళే ఉన్నారని తెలుస్తుంది.
వారసుల కోసమే :
అయితే బొత్స సత్యనారాయణ తన రాజకీయ జీవితానికి విరామం ప్రకటించకుండా కొనసాగుతున్నారు అంటే వారసుల కోసమే అని అంటున్నారు. తన కుమారుడు కుమార్తెల భవిష్యత్తు రాజకీయానికి బాటలు వేయాలని ఆయన చూస్తున్నారు. ఈ క్రమంలో కుమార్తె అనూషను విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్ గా బరిలోకి దింపుతున్నట్లుగా ప్రకటించారు. అలాగే 2029 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి నుంచి కుమారుడు సందీప్ ని పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆ మీదట తన రాజకీయం ఏమిటన్నది ఆలోచిస్తారని చెబుతున్నారు.
వైసీపీలోనే అంటూ :
ఇక బొత్స విషయం చూసుకుంటే ఆయన వైసీపీ నుంచి దూరం కారని అంటున్నారు. జగన్ తో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. జిల్లా మొత్తంలో తన వారికి అనుచరులకు ఇప్పటికి రెండు ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకున్న ఆయన 2029లోనూ అదే విధంగా తన వారికి టికెట్లు తెచ్చుకుని మరోసారి జిల్లాలో వైసీపీని గెలిపించాలని చూస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన బొత్స ఆ పార్టీని వీడడం ఇష్టం లేకపోయినా ఏపీలో కాంగ్రెస్ కకావికలు కావడంతోనే తప్పనిసరిగానే మారాల్సి వచ్చింది అని సన్నిహితులు చెబుతున్నారు. ఇపుడు వైసీపీలో అంతా బాగున్న వేళ మరో పార్టీలో మారాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. అందుకే బొత్స పార్టీ మార్పు మీద వస్తున్నవన్నీ ఊహాగానాలే గిట్టని వారు చేస్తున్న ప్రచారం అని అంటున్నారు.
అవసరమైతే అదే నిర్ణయం :
ఇక వైసీపీ తరఫున రాజకీయాలు చేస్తూ 2029 ఎన్నికలనే టార్గెట్ గా పెట్టుకున్నారని అంటున్నారు. రాజకీయంగా అప్పటికి అంతా సానుకూలం అవుతుందని వైసీపీకి విజయావకాశాలు ఉంటాయని కూడా బొత్స అనుచర వర్గం నమ్ముతోంది అని అంటున్నారు. అంతే తప్ప మరోసారి పార్టీ మారడం వంటివి చేయరని అంటున్నారు. అవసరం అయితే రాజకీయంగా విరామం తీసుకోవడానికి కూడా సిద్ధపడతారు అని అంటున్నారు. ఇప్పటికే కొంతవరకూ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన వారసుల కోసం వైసీపీలో తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడం కోసమే రానున్న కాలంలో పనిచేస్తారు అని స్పష్టత ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే బొత్స పార్టీ మార్పు అన్నది మాత్రం తప్పుడు ప్రచారంగా ఆయన అనుచరుల నుంచి వస్తున్న మాటగా ఉంది.
