Begin typing your search above and press return to search.

బేలగా బొత్స...చిన్న శ్రీను బలవంతుడేగా ?

బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయం ఈనాటిది కాదు, మూడున్నర దశాబ్దాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు.

By:  Satya P   |   12 Sept 2026 7:28 PM IST
బేలగా బొత్స...చిన్న శ్రీను బలవంతుడేగా ?
X

బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయం ఈనాటిది కాదు, మూడున్నర దశాబ్దాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. ఆ మీదట నాలుగు దశాబ్దాల పైన అనుబంధం పరోక్షంగా చూసుకుంటే ఉంది. ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ఇలా ఎన్నో కీలక పదవులు నిర్వహించిన బొత్స ఇపుడు కూడా కీలకమైన పదవిలోనే ఉన్నారు. శాసనమండలిలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదాలో ఉన్నారు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు, ఆయన మాట అంటే ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల దాకా వినే వారు అనుచరులు అనేక మంది ఉన్నారు. మరి అంతటి నాయకుడు బేలగా మారి డీలా పడిపోతే ఎలా. ఇదే వైసీపీలో ప్రస్తుతం సాగుతున్న చర్చగా ఉంది.

కన్నీరుతో సందేశం :

తరచూ బొత్స వైసీపీ సమావేశాలలో బొత్స సత్యనారాయణ కంటతడి పెడుతున్నారు. నిన్నటికి నిన్న గరివిడిలో జరిగిన సమావేశంలో ఆయన కంట నీరు పెట్టుకుంటే అంతా ఓదార్చారు. ఇక తాజాగా విజయనగరంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో బొత్స మరోసారి కంట తడి పెట్టారు, ఈసారి కూడా పార్టీ వారు ఆయనను ఓదార్చారు. అయితే బొత్స కంట నీరు పెడుతూండడంతో క్యాడర్ కూడా దీని మీద ఒకటికి పది సార్లు ఆలోచిస్తోంది. బొత్స వంటి రాజకీయ దిట్ట ఇంత బేలగా మారిపోతే వైసీపీకి నిజంగా ఇబ్బందులు ఉన్నాయా అని చర్చించుకోవడం జరుగుతోంది. బొత్స కన్నీరు భావోద్వేగం కంటే కూడా వేరే విధమైన సంకేతాన్ని అందిస్తోంది అని అంటున్నారు.

పెద్ద శ్రీనుని చేస్తున్నారు :

చిన్న శ్రీను అని మామూలుగా అంతా పిలుచుకున్నా ఆయన విజయనగరం జిల్లా రాజకీయాల వరకూ పెద్ద శ్రీను అన్నది తెలిసిందే. ఆయన బలమేంటో తెలిసే టీడీపీ ఆయన్ని పార్టీలో చేర్చుకుంది. మరి సొంత మేనల్లుడి బలం బొత్సకు కూడా తెలియక ఉంటుందా అని అంటున్నారు. అందుకే ఆయన చిన్న శ్రీను పేరు వినిపించినప్పుడల్ల కంట నీరు పెడుతున్నారు అని చెబుతున్నారు. రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న వారు బొత్స. ప్రత్యర్ధి ఎంతటి బలవంతుడు అయినా ఆయన ఏమీ కాదనే నిబ్బరంగా ఉండాలి. ఆయనను ఎంత తక్కువగా బయటకు చూస్తే అంత మేలు అన్నది రాజకీయ సూత్రం. ఇవన్నీ బొత్సకు తెలియవు అని ఎవరూ అనుకోలేరు కదా. అన్నీ తెలిసి ఆయన కంట నీరు పెడుతున్నారు అంటే కేవలం రాజకీయమే కాదు, కుటుంబ బంధం కూడా ఉండొచ్చు. కానీ రాజకీయ వేదికల మీద కన్నీరు పెడితే అది రాజకీయంగానే సందేశాన్ని పంపిస్తుంది అని అంటున్నారు. దాంతో చిన్న శ్రీను బలవంతుడే సుమా అన్నది కూడా సంకేతాలను ఇస్తుందని అంటున్నారు.

నైతిక స్థైర్యం కూడా :

ఒక పార్టీలో అత్యంత కీలక నాయకుడు, ప్రభావ వంతమైన నాయకుడు పార్టీని వీడితే సహజంగా పార్టీలో అలజడి ఉంటుంది. దానిని ఎలా అధిగమించాలని ప్రతీ ఒక్కరూ ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి టైం లో మనకు ఏమీ కాదు పార్టీ ఇంకా బాగుంటుంది అని బొత్స లాంటి వారు ధైర్యం చెప్పేలా ఉండాలి. కానీ పెద్దాయనే కన్నీరు పెడితే క్యాడర్ లో నైతిక స్థైర్యం దెబ్బ తింటుందని అంటున్నారు. మొత్తానికి బొత్స తరచూ భావోద్వేగం చెందడం కన్నీళ్ళు కార్చడం వైసీపీ కంటే చిన్న శ్రీను బలవంతుడు అన్న సందేశాన్ని బయటకు పంపిస్తోంది అని విశ్లేషిస్తున్నారు.