Begin typing your search above and press return to search.

బొత్స కోటలు బీటలు ?

ఉత్తరాంధ్రా స్థాయిలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. ఆయన అంతగా ఎదగడానికి ఆయన అనుచరగణం బంధుగణం కారణం.

By:  Satya P   |   8 Sept 2026 8:26 PM IST
బొత్స కోటలు బీటలు ?
X

ఉత్తరాంధ్రా స్థాయిలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. ఆయన అంతగా ఎదగడానికి ఆయన అనుచరగణం బంధుగణం కారణం. ఆయన చుట్టూ వారంతా అల్లుకుని ఉన్నారు. విజయనగరం జిల్లా గురించి చెప్పాలంటే గతంలో రాజుల కోటగా ఉండేది. పూసపాటి రాజులే మొత్తానికి మొత్తం చక్రం తిప్పేవారు. అయితే బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం జిల్లాలో బొత్స రాజకీయంగా బలపడ్డాక పట్టు బిగించారు. ఆయన జిల్లా మొత్తం గత కొన్ని దశాబ్దాలుగా శాసిస్తూ వస్తున్నారు. ఆయనకు జిల్లా స్థాయిలో సొంత వారే గట్టి బందోబస్తుగా ఉంటూ వచ్చారు. వారిలో ప్రముఖ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను. నిజానికి చిన్న శ్రీను తన సొంత మేనమామ బొత్స నీడలో ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. ఆయనను 2021లో జిల్లా పరిషత్తు చైర్మన్ గా ఏరి కోరి బొత్స ఎంపిక చేశారు. దాంతో పాటు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చిన్న శ్రీను పనిచేస్తున్నారు. అయితే ఇపుడు చిన్న శ్రీను బొత్స రాజకీయ కోట నుంచి బయటకు వచ్చేశారు. తనకంటూ సొంత రాజకీయాన్ని నిర్మించుకునే పనిలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.

పట్టు సాధించిన వైనం :

ఇదిలా ఉంటే బొత్స సత్యనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉంటూ వచ్చిన వేళ జిల్లా రాజకీయాలను మొత్తం నడిపింది చిన్న శ్రీను అన్నది తెలిసిందే. చిన్న శ్రీను మాట్లాడితే బొత్స మాట్లాడినట్లే అన్నంతగా అంతా చెప్పుకుంటారు. ఇక దిగువ స్థాయి క్యాడర్ తో నేరుగా పరిచయాలు నాయకులతో కలసి మెలసి ఉన్న తీరు ఇవన్నీ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా మజ్జి శ్రీనుని మార్చాయని అంటున్నారు. మేనమామ బొత్సకు చిన్న శ్రీనుకు మధ్య గతంలో అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే బొత్స తన వారసులను తెర మీదకు తీసుకుని రావాలని భావించారో నాటి నుంచే విభేదాలు మొదలయ్యాయి అంటున్నారు. ఇక జిల్లాలో చిన్న శ్రీనుకు ఒక బలమైన వర్గం కూడా ఉందని చెబుతారు.

సవాల్ చేసే స్థాయిలోనే :

విజయనగరం జిల్లాలో బొత్సను సవాల్ చేసే స్థాయిలో మజ్జి శ్రీను రాజకీయం మెల్లగా సాగుతూ వచ్చింది. వైసీపీలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బొత్స బంధువు కూడా అయిన బడుకొండ అప్పలనాయుడు కుటుంబంతో మజ్జి శ్రీను వియ్యం అందుకున్న తర్వాత నుంచే బొత్సకు పోటీగా ఒక వర్గం తయారవుతోంది అన్న చర్చ మొదలైంది. అది ఇంకాస్త ముందుకు రావడం వెనక మజ్జి శ్రీను కుమార్తె సహస్ర సిరి కారణం అని అంటున్నారు. తనతో పాటు తన కుమార్తె కూడా రాజకీయంగా రాణించాలని మజ్జి శ్రీను బలంగా కోరుకుంటున్నారు. జిల్లా రాజకీయాల్లో తన పట్టుని నిరూపించుకునేందుకు ఆయన ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ వస్తున్నా బొత్స కారణంగా అనుకున్నంతగా సాగడం లేదని అంటున్నారు.

ఫోకస్ పెట్టిన బొత్స :

ఇక ఇటీవల కాలంలో బొత్స జిల్లా రాజకీయాల మీద పూర్తి ఫోకస్ పెట్టారు. ఆయన మొత్తం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులతో నేరుగా సమావేశాలు అవుతున్నారు. మరో వైపు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న చిన్న శ్రీను దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలో తన రాజకీయ వారసులుగా కుమారుడు డాక్టర్ సందీప్ అలాగే కుమార్తె అనూషలను ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నంలో బొత్స ఉన్నారు. ఈ పరిణామాలతో తాము ఎపుడూ బొత్స నీడ కిందనే ఉండిపోతున్నామన్న ఆవేదన చిన్న శ్రీను వర్గంలో ఉంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు అని చెబుతున్నారు.

మామా అల్లుడు సవాల్ :

విజయనగరం జిల్లాలో బొత్స పట్టు చాలానే ఉంది. అయితే ఇపుడు చిన్న శ్రీను కూడా పోటీగా రాజకీయం చేయడానికి రెడీ అవుతున్నారు. దాంతో పాటు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నారు. ఈ పరిణామంతో బొత్సకు సొంత మేనల్లుడి నుంచే పెను సవాల్ ఎదురు కానుంది అని అంటున్నారు. ఇక బొత్స బంధుగణం అనుచరగణం అంతా చిన్న శ్రీనుకి కూడా దగ్గర వారే అవుతారు. అలాగే పార్టీలో అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్న చిన్న శ్రీను పార్టీని వీడిపోతూ తన వెంట పెద్ద సైన్యమే తీసుకుని వెళ్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం బొత్స కోటకు అతి పెద్ద బీటలు వారినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.