Begin typing your search above and press return to search.

బొత్స నోరు విప్పాల్సిందేనా ?

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ లో పుట్టిన నాయకుడు, ఆ పార్టీ నుంచే ఆయన జిల్లా కేంద్ర సహకరా బ్యాంక్ అధ్యక్ష పదవిని సుదీర్ఘ కాలం చేపట్టారు.

By:  Satya P   |   28 Aug 2026 11:00 AM IST
బొత్స నోరు విప్పాల్సిందేనా ?
X

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ లో పుట్టిన నాయకుడు, ఆ పార్టీ నుంచే ఆయన జిల్లా కేంద్ర సహకరా బ్యాంక్ అధ్యక్ష పదవిని సుదీర్ఘ కాలం చేపట్టారు. అలాగే ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. కాంగ్రెస్ తర్వాత బొత్స ఎంచుకున్న పార్టీ వైసీపీ. 2014 ఎన్నికల తరువాత బొత్స వైసీపీలోకి వస్తే జగన్ కూడా సమాదరించారు. ఆయన 2019లో గెలిచారు. అయిదేళ్ల పాటు జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇక 2024 లో ఓటమి పాలు కాగానే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా జగన్ చాన్స్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ అయ్యాక శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ హోదాతో కట్టబెట్టారు. ఈ రోజున వైసీపీలో కేబినెట్ ర్యాంక్ పదవి ఉన్నది ఒక్క బొత్సకు మాత్రమే. ఇలా వైసీపీ అధినాయకత్వం బొత్సకు పెద్దపీట వేస్తే బొత్స సైతం అధినాయకత్వం పట్ల పూర్తి అభిమానంతో వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అంకిత భావంతో పనిచేస్తున్నారు.

జనసేనలోకి వెళ్తున్నారా :

ఈ ప్రచారం ఇపుడు ఒక్కసారిగా ఊపందుకుంది. విజయనగరం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రాలోనూ గట్టిగా వినిపిస్తోంది. బొత్స తన బంధుగణంతో పాటు తన సన్నిహిత సహచరులందరితో కలసి జనసేన తీర్థం తీసుకోబోతున్నారు అని కూడా ఈ ప్రచారం సాగుతోంది. దానికి కారణం ఉంది. బొత్స కుమార్తె అనూష స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటీ చేస్తుందని స్వయంగా ఆయనే ప్రకటించడం. విజయనగరంలో బొత్స కుటుంబానికి గట్టి పట్టు ఉంది. కానీ కూటమిగా మూడు పార్టీలు వస్తే తట్టుకుని నిలిచి గెలవడం సాధ్యమేనా అన్నది ఒక సందేహంగా ఉందిట. అంతే కాదు అధికార బలంతో అంగబలంతో దూకుడుగా వచ్చే కూటమి ముందు బొత్స కుటుంబ బలం కానీ వైసీపీ బలం కానీ సరిపోతుందా అన్నది కూడా చర్చగా ఉంది అని అంటున్నారు. దాంతో పాటుగా తన వారసులను తొలి ఎన్నికల్లోనే ఓటమి రుచి చూపించడం కంటే గెలుపు గ్యారంటీ అనిపించేలా చూసుకోవాలన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు. అందుకే ఈ రకమైన ప్రచారం ఇపుడు వచ్చింది అని అంటున్నారు.

మెగా బంధాల వెనక :

ఇక బొత్సకు మెగా కుటుంబంతో చాలా కాలంగా గట్టి బంధం ఉంది. సామాజిక వర్గం పరంగానూ చూసినా ఈ బంధం బలీయమైనదే అనిపించక మానదు, అందరికీ గుర్తుండే ఉంటుంది గతంలో ఒకసారి అసెంబ్లీ ప్రాంగణంలో బొత్స ఉంటే ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చినపుడు బొత్స ఆయన వద్దకు వెళ్ళి కరచాలనం చేసి మాట్లాడారు. అదే సమయంలో బొత్స పక్కన ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం దూరంగా మౌనంగా ఉండిపోయారు. ఇదంతా మర్యాదపూర్వకంగా పలకరింపు అని చెప్పినా అప్పట్లో దీని మీదనే చర్చించుకున్న వారు తలో విధంగా మాట్లాడుకున్నారు.

సోదరుడు జనసేనలోనే :

ఇక చూస్తే బొత్స సొంత తమ్ముడు లక్ష్మణ రావు 2024 ఎన్నికల కంటే ముందే జనసేన లోకి వెళ్ళిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ దెబ్బ తినడానికి ఈ పరిణామం కూడా కారణం అని అంటున్నారు. మరి సోదరుడిని బొత్స వారించలేదా అని అప్పట్లో కూడా చర్చ సాగింది. అయితే రాజకీయాల్లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా బొత్స శిబిరం దీనిని స్పందించింది అని కూడా చెబుతున్నారు. ఇక ఇపుడు చూస్తే ఏకంగా బొత్స తో సహా మొత్తం బంధు మిత్రుల సమూహం అంతా జనసేనలోకి వెళ్ళిపోతుంది అన్న ప్రచారం గట్టిగా సాగడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.

అసంతృప్తి ఉందా :

బొత్సకు వైసీపీ అధినాయకత్వం మీద అసంతృప్తి ఉందా అన్నది కూడా ఒక ప్రశ్నగా ముందుకు వస్తోంది. శాసన మండలిలో బొత్స ధీటుగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా వైసీపీ హైకమాండ్ కి అది పెద్దగా సంతృప్తిని ఇవ్వడం లేదని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. దాంతో పాటు బొత్సకు ఇంకా ఇవ్వాల్సిన రాజకీయ ప్రాధాన్యత వైసీపీలో ఇవ్వలేదని కూడా ఆయన వర్గం అంటోంది అని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా బొత్స వంటి బిగ్ షాట్ వైసీపీని వీడి జనసేనలోకి వెళ్తారా అన్నదే ఇపుడు అందరిలో కలుగుతున్న సందేహం.

ఆయన నోరు విప్పితేనే :

ఈ ప్రశ్నలకు సందేహాలకు జవాబు రావాలీ అంటే బొత్స స్వయంగా నోరు విప్పి మాట్లాడాలి అని అంటున్నారు. అయితే వేడిగా వాడిగా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూంటే కనీస మాత్రంగా బొత్స శిబిరం వైపు నుంచి స్పందన రావడం లేదు అంటే ఇది నిజమని భావించాలా లేక కాదని లైట్ తీసుకోవాలా అన్నదే వైసీపీ శ్రేణులకు కూడా అర్థం కావడం లేదుట. మరి నిజంగా బొత్స ఆలోచనలు అలాగే ఉంటే మౌనమే జవాబు అనుకోవచ్చా అన్నది కీలక ప్రశ్న. చూడాలి మరి ఈ ప్రచారంలో పస ఎంతో. ఇది ఒట్టి గాసిప్ నా లేక భవిష్యత్తు రాజకీయానికి టీజర్ నా అన్నదే ఆలోచించాల్సి ఉంది.