బొత్స మీద తీవ్ర ఒత్తిడి ?
ఇదిలా ఉంటే బొత్స విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో 2024లో ఎన్నిక అయ్యారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబర్ వరకూ ఉంది. అంటే మరో ఏణ్ణర్ధ కాలం అన్న మాట.
By: Satya P | 8 March 2026 6:00 AM ISTవైసీపీలో సీనియర్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ మధ్యనే హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారని ప్రచారం సాగింది. . బొత్స సత్యనారాయణ నిజానికి తన ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కౌన్సిల్ సమావేశాలకు రారని అంతా అనుకున్నారు. కానీ బొత్స మాత్రం హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన శాసన మండలి సమావేశాల చివరి రోజున హాజరై అందరినీ ఆశ్చర్యపరచారు
ఇబ్బంది పడుతూనే :
ఇక కౌన్సిల్ సమావేశాలలో బొత్స ఒక సందర్భంలో మాట్లాడుతూ తూలిపడబోయారు. ఆ వెనక బెంచ్ లో ఉన్న వైసీపీ సభ్యుడు ఆయనను గట్టిగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా బొత్స అన్న మాటలు అందరిలో చర్చకు తావిస్తున్నాయి. ఒక వైపు ఆరోగ్యం సహకరించకపోయినా తాను సభకు వస్తున్నాను అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం వారు అవసరాల కోసం తాను సభకు హాజరవుతున్నాను అన్నారు ప్రభుత్వం తాము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అయితే బొత్స తూలడంతో ఆయనకు వెంటనే వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. బీపీ సమస్యల వల్లనే ఆయన అలా ఇబ్బంది పడ్డారని కూడా తెలిసింది.
ఏణ్ణర్థం పదవీకాలం :
ఇదిలా ఉంటే బొత్స విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో 2024లో ఎన్నిక అయ్యారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబర్ వరకూ ఉంది. అంటే మరో ఏణ్ణర్ధ కాలం అన్న మాట. ఇక బొత్సకు కేబినెట్ ర్యాంక్ తో ఈ పదవి దక్కింది. ఆయన మీద పార్టీ కూడా పెద్ద బాధ్యతలనే పెట్టింది. దాంతో బొత్స సమర్ధంగా నిర్వహిస్తున్నారు. అసెంబ్లీకి ఎటూ వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంతో కౌన్సిల్ మీదనే వైసీపీ పూర్తిగా ఆధారపడింది. అన్నీ ఆలోచించి బొత్స వంటి సీనియర్ కి వైసీపీ ఈ పోస్టుని ఇచ్చింది. ఆయన కూడా తన అనుభవంతో దానికి న్యాయం చేస్తున్నారు.
రాజకీయంగా సైతం :
ఇక బొత్సది రాజకీయ కుటుంబం. ఆయన బంధువులు కుటుంబ సభ్యులు అంతా రాజకీయాల్లో ఉన్నారు బొత్స వారందరికీ పెద్ద దిక్కుగా ఉన్నారు. 2029 ఎన్నికలు అన్నవి వైసీపీతో పాటు బొత్సకు కూడా ఎంతో కీలకమైనవిగా చెబుతున్నారు. ఆయన తన కుమార్తెని కుమారుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. అలాగే పార్టీ కోరిన మేరకు విజయనగరంలో వైసీపీకి మెజారిటీ సీట్లు దక్కించాల్సి ఉంది. దాంతో బొత్స అన్ని విధాలుగా ఒత్తిళ్లకు గురి అవుతున్నారని అంటున్నారు.
విశ్రాంతి అవసరంగా :
ఇపుడున్న పరిస్థితుల్లో బొత్సకు విశ్రాంతి అవసరం అని అంటున్నారు. అయితే రాజకీయంగా ఆయన ఇంకా సెట్ చేయాల్సిన పనులు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆయన చురుకుగా రాజకీయాల్లో ఉండాల్సిన అనివార్యత ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మూడేళ్ళు మాత్రం ఆయన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి దూకుడుగానే రాజకీయాల్లో ఉండేందుకు సిద్ధపడుతున్నారు అని చెబుతున్నారు.
