బొత్స ఫ్యామిలీకి భారీ షాక్.. నామినేషన్ తిరస్కరణ !
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం చూసిన బొత్స సత్యనారాయణ కుటుంబంలో తొలిసారిగా నామినేషన్ తిరస్కరణకు గురి అయింది.
By: Satya P | 24 Oct 2026 11:53 PM ISTనాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం చూసిన బొత్స సత్యనారాయణ కుటుంబంలో తొలిసారిగా నామినేషన్ తిరస్కరణకు గురి అయింది. ఇది నిజంగా షాకింగ్ పరిణామం అని అంటున్నారు. బొత్స తమ్ముడు కుమారుడు అయిన చైతన్య నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పూసపాటిరేగ మండలం నుంచి జెడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే జనసేన అభ్యర్థి ఫిర్యాదుతో ఆయన నామినేషన్ ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పరిణామం అయితే విజయనగరం జిల్లా వైసీపీ వర్గాలలో చర్చగా ఉంది.
నాలుగింట ఒకటి మిస్ :
ఇదిలా ఉంటే బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు జెడ్పీటీసీ పదవులకు పోటీ పడుతూ నామినేషన్లను చివరి రోజు అయిన శుక్రవారం దాఖలు చేశారు. అందులో చైతన్య నామినేషన్ ఇపుడు ఇన్వాలిడ్ అయింది. దానికి కారణం చైతన్య ఓటు అన్నది పూసపాటిరేగ మండలంలో లేకపోవడం. ఆయన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత దానిని పూసపాటిరేగకు మార్చుకున్నారని జనసేన అభ్యర్థి కోట్ల రేవతి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి బొత్స చైతన్య నామినేషన్ ను తిరస్కరించారు.
ఆ ముగ్గురిదీ ఓకే :
ఇదిలా ఉంటే బొత్స కుటుంబం నుంచి తొలిసారి పోటీకి దిగిన చైతన్య నామినేషన్ తిరస్కరణకు గురి కావడం వైసీపీకి కూడా దెబ్బ అని అంటున్నారు. అక్కడ వైసీపీకి అభ్యర్ధి ఎవరు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. మరో వైపు చూస్తే బొత్స చెల్లెలు లక్ష్మి గుర్ల మండలం నుంచి కోడలు పూజిత గరివిడి నుంచి, కుమార్తె బొత్స అనూష గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మూడు నామినేషన్లు ఓకేగా ఉన్నాయని చెబుతున్నారు.
పట్టు నిరూపించుకోవాలని :
ఇక విజయనగరం జిల్లాలో తన రాజకీయ పట్టుని నిరూపించుకోవాలని బొత్స ఏకంగా నలుగురు కుటుంబ సభ్యులను ఈసారి బరిలోకి దింపారు. విజయనగరం జెడ్పీ పీఠం పై ఆయన గురి పెట్టారు. పైగా చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళడంతో బొత్స జిల్లా రాజకీయాల మీద తన పట్టు పోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. దాంతో కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అయితే వైసీపీకి జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదని అందుకే బొత్స కుటుంబంలోని వారినే పోటీకి దింపారు అని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు పక్కన పెడితే తమ్ముడు కొడుకు చైతన్య నామినేషన్ ఇన్వాలిడ్ కావడం బొత్సకు తొలి షాక్ అని అంటున్నారు. మరి రానున్న రోజులలో జిల్లా పరిషత్తు రాజకీయాల్లో వైసీపీని గెలిపించేందుకు బొత్స ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తారు అన్నది చూడాల్సి ఉంది.
