Begin typing your search above and press return to search.

బొత్స కుమార్తెని ఇపుడు పోటీకి దించుతారా ?

అయితే ఇపుడు చిన్న శ్రీను వైసీపీని వీడిపోయారు. ఆయన చేరింది కూడా అధికార పార్టీలో. అందునా టీడీపీలో. దాంతో వైసీపీలో చిన్న శ్రీనుకు ఉన్న బలంలో సగమైనా ఆయన వెంట నడుస్తుంది అన్న చర్చ సాగుతోంది.

By:  Satya P   |   11 Sept 2026 7:28 AM IST
బొత్స కుమార్తెని ఇపుడు పోటీకి దించుతారా ?
X

విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికల్లో జెడ్పీ పీఠం మీద గురి పెట్టారు. అయితే అంతలోనే సొంత కుటుంబంలోనే రాజకీయ దుమారం చెలరేగింది. నమ్మిన బంటుగా ఉన్న సొంత మేనల్లుడు చిన్న శ్రీను పార్టీని వీడిపోయారు. నిజానికి ఈ పరిణామం జరగకపోయి ఉంటే విజయనగరం జెడ్పీ చైర్మన్ విషయంలో వైసీపీకి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. ఎందుకంటే రూరల్ బేస్ లో వైసీపీకి మంచి ఓటు షేర్ ఉంది. అలాగే బొత్స ఫ్యామిలీకి కూడా జిల్లాలో గట్టి పట్టు ఉంది. దాంతో విజయం కచ్చితం అనే తమ కుమార్తె అనూషని ఆయన చాలా ధైర్యంగా విజయనగరం జెడ్పీ చైర్మన్ రేసులో ఆదికి ముందే ప్రకటించారు. దాని వెనక ఆయన ఆత్మ విశ్వాసం నాడు కనిపించింది. ప్రత్యక్ష ఎన్నికలు అయినా పరోక్ష ఎన్నికలు అయినా వైసీపీ విజయం ఖాయమని కూడా బొత్స గట్టిగా ధీమాతో ఉన్నారు అని చెబుతారు.

నిట్ట నిలువు చీలిక :

అయితే ఇపుడు చిన్న శ్రీను వైసీపీని వీడిపోయారు. ఆయన చేరింది కూడా అధికార పార్టీలో. అందునా టీడీపీలో. దాంతో వైసీపీలో చిన్న శ్రీనుకు ఉన్న బలంలో సగమైనా ఆయన వెంట నడుస్తుంది అన్న చర్చ సాగుతోంది. దానికి తోడు అధికార పార్టీ అండదండలు కూడా ఆయనకు దొరుకుతాయని అంటున్నారు. ఈ క్రమంలో చిన్న్న శ్రీనుని తమ వైపునకు తిప్పుకున్న టీడీపీలో గెలుపు ఆశలు రెట్టింపు అయ్యాయని అంటున్నారు. ఇక వైసీపీ అయితే డీలా పడినట్లే కనిపిస్తోంది. బొత్స వరకూ చూస్తే ఆయనకు ఈ పరిణామాలు వ్యక్తిగతంగా నష్టమే కాదు, పార్టీ పరంగా కూడా పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

కుమార్తె రాజకీయం ఎలా :

ఈ నేపథ్యంలో ఇపుడు బొత్స కుమార్తె అనూష రాజకీయం ఏ తీరున సాగుతుంది అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కుమార్తెని బొత్స పోటీకి పెడతారా లేదా అన్నది కూడా మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఒకవేళ పోటీకి పెట్టకపోతే ముందే ఓటమిని అంగీకరించినట్లు కాదా అని కూడా అంటున్నారు. బొత్స స్వయంగా తానుగా తన కుమార్తె అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. ఇపుడు వెనక్కి వెళ్తే ఆయన ఇమేజ్ కి కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అలా కాదని పోటీకి నిలిపితే కుమార్తె రాజకీయ భవిష్యత్తుని రిస్క్ లో పెట్టి ఎన్నికల జూదం ఆడినట్లే అని అంటున్నారు. తొలిసారి పోటీ అంటే గెలిచి తీరాలి, లేకపోతే బొత్స వారసురాలి రాజకీయ జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. దాంతో ఇపుడు బొత్స ఎటూ తేల్చుకోలేరనే అంటున్నారు.

పోటీలో ఉండకపోతే :

అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర విజయనగరం జెడ్పీ చైర్మన్ కి పోటీ పడుతుందని అంటున్నారు. టీడీపీలో కూడా అనేక మంది ఆశావహులు ఉన్నారు. ఒకవేళ ఆమె కనుక పోటీలో లేకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా చర్చకు వస్తోంది. ఆమె పోటీలో లేకుండా చిన్న శ్రీను టీడీపీకి మద్దతు ఇస్తే అపుడు ఆయన వర్గంగా వైసీపీ నుంచి టీడీపీలో ఎవరైనా చేరితే వారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా కీలకమైన ప్రశ్న. అదే సమయంలో బొత్స కుమార్తె పోటీలో ఉంటే వారు ఈ వైపునకు మొగ్గు చూపుతారా అన్నది కూడా ఉంది. ఏది ఏమైనా విజయనగరం జిల్లా రాజకీయాల్లో చిన్న శ్రీను గేమ్ చేంజర్ గా మారిపోయారని అంటున్నారు. ఆయన వ్యూహలు వేసే అడుగుల బట్టే వైసీపీ రాజకీయం బొత్స ప్రతి వ్యూహాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.