బొత్స కూతురు రాజకీయ ఎంట్రీ..అక్కడే బిగ్ ట్విస్ట్?
ఇపుడు సాగుతున్న ఈ రకమైన ప్రచారం చూస్తూంటే నిజంగా బొత్స కుమార్తె జనసేన నుంచి జెడ్పీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతుందా అని అంతా చర్చించుకుంటున్నారు.
By: Satya P | 24 Aug 2026 2:00 PM ISTవైసీపీ సీనియర్ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ రాజకీయ వారసులు ఎంట్రీ అని అంతా అనుకున్నదే. దానికి తాజాగా బొత్స సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు. తమ కుమార్తె డాక్టర్ అనూష రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని జెడ్పీ చైర్ పర్సన్ గా పోటీ చేస్తారు అని బొత్స స్వయంగా ప్రకటించారు. దాంతో వైసీపీ తరఫున బొత్స కుమార్తె ఎంట్రీ ఇవ్వడం సహజం అని అంతా భావించారు. నిజానికి బొత్స కుమార్తె వైసీపీ తరఫునే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కానీ అక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటోంది అని అంటున్నారు.
వైసీపీ నుంచి కాదా :
తన రాజకీయ వారసురాలిగా కుమార్తె రాజకీయాల్లోకి వస్తుంది అని బొత్స చెప్పారు కానీ వైసీపీ నుంచి అని గట్టిగా చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. దాంతో ఆమె వైసీపీ నుంచి జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్ధిగా పోటీ చేస్తుంది అనుకోవడం సహజం. కానీ ఆమె జనసేన నుంచి పోటీ చేస్తారు అని ఇపుడు విజయనగరం జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జనసేన నాయకులతో చర్చలు కూడా జరుగుతున్నాయని బహిరంగంగానే అంతా చెప్పుకుంటున్నారు.
అదే జరుగుతుందా :
బొత్స కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత వైసీపీలో కీలకంగా ఉంటూ వచ్చారు. ఆయన కుటుంబం బంధువులు సన్నిహితులు అంతా వైసీపీలోనే ఉన్నారు. అయితే బొత్స తమ్ముడు ఒకరు నెల్లిమర్ల నియోజకవర్గంలో మాత్రం జనసేనలో చేరి చురుకుగా వ్యవహరిస్తున్నారు. దాంతో జనసేనలో కూడా బొత్స ఫ్యామిలీకి ఎంట్రీ ఉందని ఆనాడే అనుకున్నారు. ఇపుడు సాగుతున్న ఈ రకమైన ప్రచారం చూస్తూంటే నిజంగా బొత్స కుమార్తె జనసేన నుంచి జెడ్పీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతుందా అని అంతా చర్చించుకుంటున్నారు.
సహజమైన పరిణామమే :
తండ్రి ఒక పార్టీలో కుమార్తె వేరొక పార్టీలో ఉండడం అన్నది రాజకీయాల్లో సహజమైన పరిణామమే అని గుర్తు చేస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో అలా కాదు అక్కడ బలమైన రాజకీయ సామ్రాజ్యాన్ని బొత్స నిర్మించారు. ఆయన కుటుంబ సమేతంగా అంతా ఒకే పార్టీలో ఉంటూ వస్తున్నారు. అలాంటిది సొంత తమ్ముడే పార్టీ మారి జనసేనలో చేరారు అన్నదే ఒక వింతా విశేషం అయితే ఇపుడు కుమార్తె కూడా వైసీపీ గేటు దాటుతుందా అన్నదే చర్చగా ఉంది. అదే కనుక జరిగితే మరి విజయనగరం జిల్లాలో వైసీపీ సంగతి ఏమిటి అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తిగా బొత్స మీద ఆధారపడి విజయనగరం జిల్లాలో వైసీపీ రాజకీయం చేస్తోంది. మరో నాయకుడికి కానీ మరో నాయకత్వానికి కానీ అక్కడ అవకాశం లేకుండా బొత్స చక్రం తిప్పుతున్నారు. దాంతో కుమార్తె జనసేన అంటే ఆయన వైసీపీ రాజకీయాల్లో ఏమి చేయబోతున్నారు అన్న ప్రశ్నలు కూడా వెంటనే వస్తాయని అంటున్నారు.
గ్రీన్ సిగ్నల్ రావాలి :
ఇక జనసేనలో బొత్స కుమార్తె చేరి జెడ్పీ చైర్ పర్సన్ గా పోటీ చేయాలీ అంటే గ్రీన్ సిగ్నల్ రావాలి అని అంటున్నారు అలా కూటమిలోని అన్నిపార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కథ మారిపోయినట్లే అంటున్నారు. బొత్స విషయానికి వస్తే అన్ని పార్టీలతో ఆయన సన్నిహితంగా ఉంటారు అని చెబుతారు. దాంతో పాటు మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇక బొత్స వంటి పొలిటికల్ బిగ్ షాట్ కుమార్తె జనసేనలో చేరుతామంటే ఓకే చెబుతారనే అంటున్నారు. అదే జరిగితే విజయనగరం జిల్లాలో వైసీపీకి పెద్ద దెబ్బ పడినట్లే అని అంటున్నారు.
