కుమార్తె రాజకీయ ఎంట్రీ - బొత్స సంచలన ప్రకటన
విజయనగరం జిల్లాలో 1980 దశకంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారి విజయనగరం జిల్లా సెంట్రల్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవిని అందుకున్నారు ఆయన.
By: Satya P | 20 Aug 2026 9:10 AM ISTవైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా బొత్స సత్యనారాయణ ఉన్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో 1980 దశకంలో రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారి విజయనగరం జిల్లా సెంట్రల్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవిని అందుకున్నారు ఆయన. జిల్లాలో సీనియర్ అయిన సాంబశివరాజు శిష్యుడిగా బొత్స కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. మొదట్లో ఎన్నికల్లో పోటీకి టికెట్ దక్కలేదు తరువాత మాత్రం ఆయనే టికెట్లు ఇచ్చే స్థాయిని అందుకున్నారు. తొలిసారి ఎంపీగా బొబ్బిలి నుంచి బరిలో దిగి గెలిచిన బొత్స వైఎస్సార్ కి ముఖ్య అనుచరుడిగా ఉంటూ జిల్లాలో తన హవా చాటారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పదేళ్ళ పాలనలో మంత్రిగా పీసీసీ చీఫ్ గా పనిచేసిన బొత్స విభజన ఏపీలో కూడా ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారు. ఆ విధంగా ఆయన వైసీపీలో చేరి 2019 నుంచి 2024 మధ్యన అయిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. అంతే కాదు ప్రస్తుతం కేబినెట్ ర్యాంక్ తో శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగుతున్నారు.
రాజకీయ బంధు గణం :
బొత్సది రాజకీయంగా అతి పెద్ద కుటుంబం అనే చెప్పాలి. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి బొబ్బిలి ఎంపీగా 2007లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. అలాగే 2009లో కొత్తగా ఏర్పాటు అయిన విజయనగరం ఎంపీ సీటుకి ఆమె పోటీ చేసి గెలిచారు. బొత్స తమ్ముడు అప్పల నరసయ్య 2009, 2019లలో విజయనగరం జిల్లా గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయంగా కొనసాగుతున్నారు. బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నారు. మరో బంధువు బెల్లాన చంద్రశేఖర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేసి 2019లో విజయనగరం ఎంపీగా వైసీపీ తరఫున గెలిచారు ఇక బొత్స బంధుగణం అంతా రాజకీయంగా పదవులు అందుకున్న వారే. ఇపుడు బొత్స కుటుంబం నుంచి కొత్త తరం రాజకీయాల్లోకి వస్తోంది.
వారసురాలు రెడీ :
బొత్స కుమార్తె డాక్టర్ అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. ఏపీలో స్థానిక ఎన్నికలకు నగారా మోగుతున్న వేళ బొత్స తమ కుమార్తె రాజకీయం గురించి సంచలన ప్రకటన చేశారు. తన కుమార్తె విజయనగరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాజకీయంగా ఆమె చురుకుగా తిరుగుతున్నారు. వైసీపీ తరఫున పోరాటాలలో పాల్గొంటున్నారు. అదే విధంగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకుని పార్టీ నాయకులతో అడుగులు వేస్తున్నారు. బొత్స నుంచే రాజకీయ పాఠాలను కూడా ఆమె నేర్చుకున్నారు.
ప్రత్యక్ష ఎన్నికల్లోనే :
జెడ్పీ చైర్మన్ ప్రత్యక్ష ఎన్నికల విధానంలో జరుగుతాయి అని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడితో పాటు బొత్స కుమార్తె అన్న ట్యాగ్ లైన్ తో అనూష బరిలోకి దిగుతున్నారు అని అంటున్నారు. జెడ్పీటీసీలతో సంబంధం లేకుండా నేరుగా ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి బొత్స ఆయన రాజకీయ వ్యూహాలతో కుమార్తెని గెలిపించేందుకు సిద్ధంగా ఉంటారు అని అంటున్నారు. ఇక గత రెండున్నర దశాబ్దాలుగా విజయనగరం జెడ్పీ పీఠం బొత్స కుటుంబం చేతిలోనే ఉంది. ఆయన సతీమణి మొదట చైర్మన్ అయ్యారు. ఆ తవాత బెల్లాన చంద్రశేఖర్, ఇక మజ్జి శ్రీనివాస్ ఇలా వారి ఫ్యామిలీయే అక్కడ రాజ్యం చేస్తోంది. ఇపుడు అచ్చి వచ్చిన ఆ పీఠం మీద కుమార్తెని కూర్చోబెట్టాలని బొత్స చూస్తున్నారు. దాంతో విజయనగరం జిల్లా రాజకీయాలు హీటెక్కడం ఖాయమని అంటున్నారు.
