వివేకా హత్య కేసు...బొత్స సంచలన వ్యాఖ్యలు
అంటే వివేకా హత్య జరిగినపుడూ టీడీపీ ప్రభుత్వం ఉంది. బాబు సీఎం గా ఉన్నారు. అలాగే ఇపుడూ చంద్రబాబే అధికారంలో ఉన్నారు.
By: Satya P | 9 Aug 2025 7:40 PM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మారు ఏపీలో రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. పులివెందుల జెడ్పీటీసీకి ఉప ఎన్నికల వేళ వివేకా మళ్లీ గుర్తుకు వస్తున్నారు. నా తండ్రిని దారుణంగా హత్య చేశారు అని ఇప్పటికి ఆరేళ్ళు గడచినా దోషులకు శిక్ష పడలేదని ఆయన ఏకైక కుమార్తె సునీత తాజాగా మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో వివేకా హత్య కేసు జనంలోకి మళ్ళీ చర్చగా వచ్చింది. పులివెందుల రావద్దు అని తన తల్లి హెచ్చరించినా వచ్చాను అని కూడా ఆమె అన్నారు. మొత్తం మీద వైసీపీ వైపు వేలెత్తి చూపిస్తూ ఆమె పరోక్షంగానే అనేక విమర్శలు చేశారు. అలాగే తమకే శిక్షగా పరిణామాలు మారాయని వాపోయారు.
డిఫెన్స్ లో వైసీపీ :
వివేకా హత్య కేసు మళ్ళీ జనంలోకి చర్చగా రావడంతో వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టడానికే ఈ ప్లాన్ అని ఆ పార్టీ వారు అంటున్నారు. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ హత్య కేసు గురించి పులివెందులతో పాటు కడప ఎంపీ సీటు పరిధిలో విస్తృతంగా వైఎస్ షర్మిల సునీత కలసి ప్రచారం చేశారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇపుడు మళ్ళీ ఎన్నికల వేళ ఈ హత్య కేసు మీద సునీత మాట్లాడుతున్నారని వారు మండిపడుతున్నారు. చూస్తూంతే వైసీపీని ఇబ్బందులలో పెట్టడానికే ఈ విధంగా చేశారు అని అంటున్నారు.
బొత్స హాట్ కామెంట్స్ :
ఇదిలా ఉంటే వివేకా హత్య మీద వైసీపీ సీనియర్ నేత శాసనమండలి లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసుని మళ్లీ కావాలనే ముందుకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు. నిజానికి చూస్తే కనుక వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. ఆనాడు ఈ హత్య కేసు మీద తెలుగుదేశం ప్రభుత్వమే విచారణ జరిపిందని ఆయన చెప్పుకొచ్చారు.
రాజకీయంగా వాడుకుంటున్నారా :
మరి అనాడు సీబీఐకి ఇవ్వమన్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గద్దె దిగాక వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ తరువాతే సీబీఐకీ ఈ కేసుని అప్పగించడం జరిగిందని అన్నారు. ఇక ఇప్పుడు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలలు దాటిందని అన్నారు. మరి ఈ సమయంలో ఈ కేసు విషయంలో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా ఈ హత్యను వాడుకునేందుకే ప్రయత్నించారు తప్ప దోషులకు శిక్ష పడేలా చేశారా అని ఆయన నిలదీస్తున్నారు.
వైసీపీ వాదన అదేనా :
అంటే వివేకా హత్య జరిగినపుడూ టీడీపీ ప్రభుత్వం ఉంది. బాబు సీఎం గా ఉన్నారు. అలాగే ఇపుడూ చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఒక విధంగా అపుడు మూడు నెలలూ ఇపుడు పదిహేను నెలలు కలిపి ఏణ్ణర్ధ కాలం వారి చేతిలోనే అధికారం ఉంది కదా అని వైసీపీ అంటోంది. మరి ఈ కేసులో పురోగతిని సాధించే విషయంలో టీడీపీ ఎంతవరకూ ప్రయత్నం చేసింది అన్నది కూడా ప్రశ్నిస్తున్నారు ఎంతసేపూ తమ మీదనే ఈ కేసులో నిందలు వేసి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు తప్ప దోషులకు శిక్ష పడేలా ఎందుకు చేయడం లేదని బొత్స వంటి వారు నిలదీస్తున్నారు.
మొత్తానికి సునీత ప్రశ్నలకు ఆవేదనకు ఈ విధంగా సమాధానం వైసీపీ నుంచి వచ్చిందా అన్నదే చర్చగా ఉంది అయితే ఇక్కడ సునీత కాదు జనాలు ఏ విధంగా ఈ కేసు విషయంలో ఆలోచిస్తున్నారు అన్నది కూడా ముఖ్యమని అంటున్నారు. నిజానికి రాజకీయ ప్రముఖుల హత్య కేసులు అన్నీ రాజకీయంగానే ఎక్కువగా చర్చకు వస్తాయి. వైసీపీ కూడా మొదట అంటే 2019లో ఈ కేసు విషయంలో సానుభూతి పొందే ప్రయత్నం చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సరే ఎవరి ఆలోచనలు వ్యూహాలు ఎలా ఉన్నా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన వివేకా హత్య కేసు విషయంలో ఇప్పటికైనా ఒక కొలిక్కి తెచ్చి అసలు వాస్తవాలు జనాలకు తెలియచేయాలన్నది అందరిలోనూ ఉంది. మరి ఆ దిశగా ఫలితం వస్తుందో లేదో చూడాల్సి ఉంది.
