చిన్నశ్రీను పార్టీ మారతారని బొత్సకు ముందే తెలుసా?!
విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను టీడీపీలో చేరడం అత్యంత రహస్యంగా సాగిందన్న ప్రచారం బొత్స వ్యాఖ్యలతో మరో మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు.
By: Tupaki Political Desk | 11 Sept 2026 4:54 PM ISTవిజయనగరం జడ్పీ చైర్మన్, తన మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మార్పుపై సీనియర్ నేత, మండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న శ్రీను వ్యవహారంపై తనకు చాలా కాలంగా అనుమానం ఉందని బొత్స చెప్పడంపై విస్తృత చర్చ జరుగుతోంది. తన నియోజకవర్గంలో తాను చెప్పినట్లు కూడా పనులు జరగలేదని బొత్స ఆవేదన వ్యక్తం చేయడం కూడా సంచలనంగా మారింది. చిన్న శ్రీను పార్టీ మారిన అనంతరం బొత్స గురువారం సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను విషయమై సీనియర్ నేత పలు ఆసక్తికర సమాచారాన్ని వెల్లడించారు.
విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను టీడీపీలో చేరడం అత్యంత రహస్యంగా సాగిందన్న ప్రచారం బొత్స వ్యాఖ్యలతో మరో మలుపు తిరిగినట్లుగా భావిస్తున్నారు. చిన్న శ్రీను పార్టీలో ఉన్నప్పటికీ తనకు వ్యతిరేకంగా స్వతంత్రంగా నడుచుకోవడాన్ని బొత్స 8 నెలల క్రితమే గ్రహించినట్లు స్పష్టం చేశారు. ఈ విషయమై అవగాహన వచ్చిన తర్వాత చిన్న శ్రీనుతో ఎదురవబోయే సవాల్ ను తట్టుకోడానికి కుమార్తెను రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు. దీంతో బొత్స కుటుంబంలో అంతర్గతంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను సీనియర్ నేత స్వయంగా బయటపెట్టినట్లైందని అంటున్నారు.
బొత్స చెప్పిన ప్రకారం ఆయన కుమార్తె అనూషను జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంపై సిట్టింగ్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను నొచ్చుకున్నారని జరిగిన ప్రచారం కరెక్టు కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు ఆశించి చిన్న శ్రీను చాలా కాలంగా పార్టీ మార్పుపై వ్యూహాత్మకంగా అడుగులు వేశారని బొత్స వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే చిన్న శ్రీను మాత్రం తాను కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినయ్యే పార్టీ మారానని చెప్పడం విశేషమంటున్నారు.
మరోవైపు కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చిన్న శ్రీనును ముందుగా టీడీపీలోకి పంపి, తర్వాత బొత్స కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీలో చేరతారని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమకు పార్టీ మారే ఉద్దేశం ఏదీ లేదని బొత్స కుమార్తె అనూష స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతలను చిన్న శ్రీనుకు అప్పగించి చేసిన పొరపాటును మళ్లీ పునరావృతం చేయకూడదని బొత్స భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరి జోక్యం లేకుండా ఇక నుంచి తాను స్వయంగా చీపురుపల్లి వ్యవహారాలను పర్యవేక్షిస్తానని బొత్స చెప్పుకొచ్చారు. దీంతో చిన్న శ్రీను పార్టీ మారిన తర్వాత వైసీపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా జిల్లా పార్టీ వ్యవహారాలపై బొత్స మరింత యాక్టివ్ అవడం ఆ పార్టీకి సానుకూలంగా మారుతుందా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.
