Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర పెద్దదిక్కుకు కష్టాలు.. సొంత నియోజకవర్గానికే పరిమితమవ్వక తప్పదా?

ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి, మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   23 Sept 2026 3:06 PM IST
ఉత్తరాంధ్ర పెద్దదిక్కుకు కష్టాలు.. సొంత నియోజకవర్గానికే పరిమితమవ్వక తప్పదా?
X

ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి, మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బొత్స తాజా రాజకీయ పరిణామాలతో సొంత నియోజకవర్గానికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నాళ్లు తన తరుఫున రాజకీయ వ్యవహారాలు అన్నీ పర్యవేక్షించిన మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను అనూహ్యంగా పార్టీ ఫిరాయించడంతో బొత్స కంగుతినాల్సివచ్చిందని అంటున్నారు. చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో సొంత నియోజకవర్గం చీపురుపల్లి వ్యవహారాలలో అనిశ్చితి నెలకుందని, దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగాలని బొత్స నిర్ణయించుకున్నారని అంటున్నారు.

జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను రాజీనామా తర్వాత పార్టీ నుంచి ఇంకెవరు చేజారిపోకుండా బొత్స అప్రమత్తమయ్యారని అంటున్నారు. తాను రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండటంతో జిల్లాతో పాటు సొంత నియోజకవర్గం వ్యవహారాలను చిన్న శ్రీనుకే అప్పగించారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా పరిణమించిందని బొత్స భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఇకపై తాను చీపురుపల్లిలోనే ఉంటానని, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తనకే నేరుగా ఫోన్ చేయాలని బొత్స చెబుతుండటంపై కార్యకర్తల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు తమకు అందుబాటులో లేకుండా బిజీబిజీగా తిరిగిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఇచ్చిన ఝలక్ తో క్షేత్రస్థాయి రాజకీయాలను స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు.

1999 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు చూపిన బొత్స ఇప్పుడు ఎక్కువగా సొంత నియోజకవర్గానికి పరిమితం అయిపోవాల్సిన పరిస్థితులు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. 2015లో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరినప్పటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని సింగల్ హ్యాండ్ తో నడిపిన ఆయన ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారని తాము ఊహించలేదని కార్యకర్తలు చెబుతున్నారు. డీసీసీబీ చైర్మన్ గా, ఎంపీగా విజయనగరం జిల్లాలో చక్రం తిప్పిన బొత్స 2004లో మంత్రి అయిన తర్వాత రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగరు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోవడం, కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడంతో బొత్స 2015లో వైసీపీలో చేరాల్సివచ్చిందని అంటున్నారు.

ఇక వైసీపీలో చేరిన తర్వాత కూడా బొత్సకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగించడమే కాకుండా, ఉత్తరాంధ్ర పగ్గాలు అప్పగించారు. దీంతో సొంత నియోజకవర్గం, జిల్లా బాధ్యతలు మేనల్లుడు చిన్నశ్రీనుకు బొత్స అప్పగించాల్సివచ్చిందని, దీనివల్ల కేడర్ కు బొత్సకు మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చిన్న శ్రీను నిష్క్రమణ తర్వాత ఈ విషయం గ్రహించిన బొత్స నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిలా ఆయన తిరిగి దిగువస్థాయి నుంచి కార్యకర్తలతో సంబంధాలు పునరుద్ధరించు కునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.