బొత్స వర్సెస్ అచ్చెన్న...నిబద్ధత అంటే ఇదే కదా !
శాసన మండలిలో వర్షాకాల సమావేశాల సందర్భంగా తొలి రోజే సమర నినాదాలు వినిపించాయి. అటూ ఇటూ కూడా నాయకులు మాటల తూటాలను పేల్చారు.
By: Satya P | 18 Aug 2026 9:21 AM ISTశాసన మండలిలో వర్షాకాల సమావేశాల సందర్భంగా తొలి రోజే సమర నినాదాలు వినిపించాయి. అటూ ఇటూ కూడా నాయకులు మాటల తూటాలను పేల్చారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. అవి హద్దులు దాటేసి మరీ వ్యక్తిగత స్థాయికి కూడా తాకాయి. ఆ ఇద్దరూ తక్కువ వారు ఏమీ కాదు, దశాబ్దాలుగా రాజకీయ అనుభవం సంపాదించిన వారు. ఒకరు ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన వారు. ఎన్నో సార్లు మంత్రి పదవులు చేపట్టి రాణించిన వారు, వైసీపీకి చెందిన బీసీ నేత. విజయనగరం జిల్లా మీద పూర్తి పట్టు కలిగి ఉత్తరాంధ్రా రాజకీయాలను శాసించే నాయకుడు బొత్స సత్యనారాయణ.
సమ ఉజ్జీలుగానే :
ఇక రెండవ వారు కింజరాపు అచ్చెన్నాయుడు. ఈయన కూడా దిగ్గజ బీసీ నేత. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఔపాసన పెట్టి ఒడిసి పట్టుకున్న నాయకుడు. ఏపీ టీడీపీకి కొన్నేళ్ళ పాటు అధ్యక్షుడిగా పనిచేసిన వారు. ఈ ఇద్దరూ మంచి వ్యూహకర్తలే. దూకుడుగా రాజకీయం చేసే వారే ఒక్క మాటలో చెప్పుకోవాలీ అంటే సమ ఉజ్జీలు అయిన నేతలే. ఢీ అంటే ఢీ కొట్టే రాజకీయం ఈ ఇద్దరిదీ. బొత్స తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అయితే అచ్చెన్నాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ ఇద్దరి మధ్య మరో సారూప్యత ఉంది. ఇద్దరివీ రాజకీయ కుటుంబాలు. ఎంతో మంది ఆ కుటుంబాల నుంచి వచ్చి రాజకీయ పదవులు చేపట్టారు.
తగ్గేది లేదంటూ :
ఈ ఇద్దరూ పార్టీ కోసం ఎందాకైనా అని అంటారు. ఇద్దరూ అధినాయకత్వానికి ఎంతో నమ్మకం కలిగిన వారుగా ఉన్నారు. ఈ ఇద్దరికే తొలి అవకాశాలు ఇవ్వాలని ఆయా పార్టీల అధినాయకులు ఎందుకు అనుకుంటారు అంటే అంకితభావంతో నిజాయతీతో పనిచేస్తారు కాబట్టి అని అంటారు. విపక్షంలో ఉన్నపుడు అచ్చెన్నకు పార్టీ పదవి ఇచ్చి మరీ బాబు ప్రోత్సహించారు. ఇక జగన్ అయితే బొత్స చీపురుపల్లిలో ఓడితే విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిపించి మరీ లీడర్ ఆఫ్ అపొజిషన్ గా చేసి శాసనమండలికి పంపించారు. దాంతో తమ అధినాయకత్వాలు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో వాటి కోసం ఎక్కడా తగ్గకుండా ఈ ఇద్దరు నేతలు శాసనమండలిలో రాజకీయ సమరమే సాగిస్తున్నారు అని అంటున్నారు.
బొత్స నొచ్చుకున్నారు :
అయితే బొత్స సత్యనారాయణ తాజాగా జరిగిన మండలి సమావేశాలలో తొలి రోజునే నొచ్చుకున్నారు. తనను పట్టుకుని దద్దమ్మ అని అచ్చెన్నాయుడు అనడం పట్ల ఆయన తీవ్రంగా కలత చెందారు. అంతే కాదు తన మొత్తం రాజకీయ జీవితంలో అలాంటి వ్యక్తిగత విమర్శలను ఎన్నడూ చూడని బొత్స ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే తేరుకుని ఆవేశంతో అచ్చెన్న మీద కూడా కౌంటర్లు వేశారు. ఆబోతు అని ఆయనను సంభోదించారు. అచ్చెన్న కూడా ఈ మాటకు హర్ట్ అయినట్లుగా కనిపించింది. అయితే పక్క పక్క జిల్లాలు అయిన ఈ ఇద్దరు నేతల మధ్య ఎలాంటి రాజకీయ వైరం లేదు, ఇద్దరూ రెండు పార్టీలు రెండు సిద్ధాంతాలు రెండు రకాల భావోద్వేగాలతో సభా సమరం చేస్తున్నారు.
అచ్చెన్న హర్ట్ అయ్యారు :
అధినాయకత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చే క్రమంలో నూరు శాతం కృషి చేస్తున్నారు. ఈ తరహా సన్నివేశాలు చూసిన వారు అంతా ఘనమైన నాయకులు, ఎంతో అనుభవం కలిగిన వారు, పైపెచ్చు బీసీ నేతలు. ఇలా వ్యక్తిగత విమర్శలు దిగడం అయితే ఏ మాత్రం బాగాలేదనే అంటున్నారు. రాజకీయ సిద్ధాంతాల మేరకు విభేదించుకోవడం సబబే కానీ అది హద్దులు దాటితే వారే కాదు వెనక వున్న అభిమానులు అలాగే సామాజిక వర్గాలు అనుచరులు అందరూ నొచ్చుకుంటారు అని అంటున్నారు. పైగా శాసన మండలి అంటే పెద్దల సభ. అక్కడ హుందాగానే చర్చలు ఉండాలని అంటున్నారు. మరి దీనిని పాటిస్తేనే వారి అనుభవానికి ఎంతో విలువ గౌరవం అని అంటున్నారు.
