Begin typing your search above and press return to search.

బొత్సలో ప్రస్టేషన్... జూనియర్ లీడర్ సెగ గట్టిగానే తగిలిందా?

వైసీపీ సీనియర్ లీడర్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ ప్రస్టేషన్ ఫీల్ అవుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   8 Oct 2025 12:00 AM IST
బొత్సలో ప్రస్టేషన్... జూనియర్ లీడర్ సెగ గట్టిగానే తగిలిందా?
X

వైసీపీ సీనియర్ లీడర్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ ప్రస్టేషన్ ఫీల్ అవుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన స్వస్థలంలో రాజకీయంగా ఎదురైన అవమానాన్ని ఆయన భరించలేకపోతున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయనగరం అమ్మవారి పండుగ సందర్భంగా డీసీసీబీ భవనంపై శిబిరం ఏర్పాటుకు అధికారులు అనుమతించకపోవడాన్ని బొత్స తేలిగ్గా తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. 30 ఏళ్లుగా ఎదురులేని చోట.. తనను అడుగు పెట్టనీయకుండా చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న బొత్స.. అధికార పార్టీకి చెందిన యువనేత, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున చరిత్ర బయటపెడతానని హెచ్చరించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

30 ఏళ్లుగా విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా బొత్స డీసీసీబీ బ్యాంకు భవనంపై ప్రత్యేక శిబిరం నిర్వహిస్తుంటారు. విజయనగరం రాజులకు దీటుగా తన పరివారంతో అక్కడ కూర్చుని ఉత్సవాలు తిలకించడం బొత్సకు రివాజుగా మారింది. అయితే ఈ ఏడాది డీసీసీబీపై చైర్మన్ నాగార్జున శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి కారణం ఓ విధంగా బొత్స అనుచరుల దూకుడే కారణమని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఉత్సవాల సందర్భంగా డీసీసీబీ శిబిరం నిర్వహించాలని చైర్మన్ నాగార్జునకు లేకపోయినా, డీసీసీబీ తన సొంత జాగీరులా కనీస అనుమతి తీసుకోకుండా బొత్స టూర్ షెడ్యూల్ లో డీసీసీబీపై శిబిరం నిర్వహిస్తారని పేర్కొనడం వివాదానికి దారితీసిందని అంటున్నారు.

డీసీసీబీ చైర్మనుగా తన అనుమతి లేకుండా, విపక్ష నేతకు డీసీసీబీ భవనంపై ప్రైవేటు కార్యక్రమం నిర్వహణకు ఎలా అనుమతిస్తారని ఆగ్రహించిన నాగార్జున సీనియర్ నేత బొత్సకు ఝలక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో 30 ఏళ్లుగా తాను నిర్వహిస్తున్న శిబిరాన్ని అడ్డుకోడాన్ని సహించలేని బొత్స డీసీసీబీ చైర్మన్ నాగార్జునను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా మాట్లాడారని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతగా చెప్పుకునే బొత్స.. ఓ చిన్న విషయాన్ని తీసుకుని ఇప్పుడిప్పుడే రాజకీయాలు చేస్తున్న నాగార్జునపై తీవ్ర స్థాయిలో దండెత్తడం చూస్తే.. బొత్స బాగా ఫీల్ అయినట్లే కనిపిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి బొత్సలో ఎప్పుడూ ఇలాంటి ప్రస్టేషన్ చూడలేదని, రాష్ట్రస్థాయిలో విమర్శలు, ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కూడా ఆయన హుందాగానే మాట్లాడేవారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కానీ, విజయనగరం ఎపిసోడ్ లో నాగార్జునను టార్గెట్ చేస్తూ ఆయన పర్మిషన్ ఇస్తే చరిత్ర బయట పెడతానని చెప్పడం యువనేతను భయపెట్టేలా మాట్లాడటమే అంటున్నారు. అయితే సీనియర్ నేత బొత్స హెచ్చరికలను ఏ మాత్రం లెక్క చేయని యువ నేత నాగార్జున మరింత దూకుడు చూపినట్లు చెబుతున్నారు. బొత్స తన చరిత్ర బయట పెడితే తాను బొత్స కుటుంబ వ్యవహారంపై మాట్లాడాల్సి వస్తుందని నాగార్జున ఎదురుదాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఎపిసోడ్ లో బొత్స, ఆయన అనుచరులు అనావసర రాద్ధాంతం చేసి గోటితో పోయేదాన్ని పెద్దది చేసుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.