Begin typing your search above and press return to search.

విజయనగరంలో చిన్న 'సీను'.. బొత్స ఇంట్లో పెద్ద దుమారమేనా?!

ఆ రోజు అనూష పుట్టిన రోజు సందర్భంగా కేడర్ పోటెత్తారు. ఈ ఉత్సాహంలో తన కుమార్తె త్వరలో జరిగే జడ్పీ ఎన్నికల్లో జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తారని బొత్స ప్రకటించారు.

By:  Tupaki Political Desk   |   4 Sept 2026 1:57 PM IST
విజయనగరంలో చిన్న సీను.. బొత్స ఇంట్లో పెద్ద దుమారమేనా?!
X

స్థానిక ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా విపక్షం వైసీపీలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. స్థానిక ఎన్నికల ప్రకటన వచ్చిన నుంచి ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కీలక నేత బొత్స కుటుంబం రాజకీయ ప్రణాళికలు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో కీలక స్థానంలో ఉన్న బొత్స వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక పకడ్బందీ రాజకీయ వ్యూహం ఉందని బొత్స అనుచరులు అనుమానిస్తున్నారు. బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తన రాజకీయ గురువు, సొంత మేనమామ బొత్సపై జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఇటువంటి ప్రచారాన్ని ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన నుంచి మేనమామ బాటను అనుసరించి ఆయనతో అడుగులు వేసిన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఇప్పుడు సొంత రాజకీయ అజెండాతో ముందుకు వెళుతున్నారని బొత్స అనుచరులు అనుమానిస్తున్నారు. ఇందుకు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ఉదహరిస్తున్నారు. బొత్స రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె డాక్టర్ అనూష రాజకీయ ఆరంగ్రేటంపై గత నెల 12న అధికారిక ప్రకటన వచ్చింది. ఆ రోజు అనూష పుట్టిన రోజు సందర్భంగా కేడర్ పోటెత్తారు. ఈ ఉత్సాహంలో తన కుమార్తె త్వరలో జరిగే జడ్పీ ఎన్నికల్లో జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తారని బొత్స ప్రకటించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఈ నెల 5న (శనివారం) విజయనగరంలో భారీ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయమై తన మేనమామ బొత్సకు ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వలేదనే సమాచారం రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తోందని చెబుతున్నారు.

ఇప్పటివరకు సీనియర్ నేత, మేనమామ బొత్స అడుగు జాడల్లోనే నడిచిన జడ్పీ చైర్న్ మజ్జి శ్రీనివాసరావు ఇప్పుడు స్వతంత్ర రాజకీయాల వైపు చూడటం వల్లే విజయనగరంలో పోటీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జడ్పీ చైర్న్ మజ్జి శ్రీను కుమార్తె సిరి సహస్ర రాజకీయ ఆకాంక్షలతోనే మేనమామ నుంచి వేరుపడేందుకు చిన్న శ్రీను సిద్ధమవుతున్నారని అంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం మేయ‌ర్ పీఠంపై చిన్న శ్రీను కన్నేశారని, ఆ స్థానంలో తన కుమార్తెను నిలిపి గెలిపించుకోవాలని భావిస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. కుమార్తె రాజకీయ ఆరంగ్రేటం సక్సెస్ కావాలనే ఆలోచనతో అధికార కూటమిలోని జనసేన పార్టీతో చిన్న శ్రీను సంప్రదిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం విజయనగరం రాజకీయాలను హీటెక్కిస్తోందని అంటున్నారు.

కాగా, ప్రస్తుతం చిన్న శ్రీను రాజకీయ వ్యవహారాలపై బొత్స వర్గం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. బొత్స కుమార్తె రాజకీయ ప్రవేశంపై ప్రకటన విడుదలైన తర్వాత మజ్జి శ్రీనివాసరావు అనుసరిస్తున్న విధానాలు బొత్స అనుచరులకు రుచించడం లేదని అంటున్నారు. సొంత మేనల్లుడిగా బొత్స ఎంతో ఆదరించి పార్టీలో అన్నివిధాలుగా ప్రోత్సహిస్తే, ఇప్పుడు ఆయన కుమార్తె రాజకీయ ప్రవేశం సమయంలో భిన్న వైఖరి ప్రదర్శించడం తగదని బొత్స అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను రాజకీయ ఎదుగుదలకు బొత్సతోపాటు వైసీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. జడ్పీ చైర్మను పదవితోపాటు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు, ఉత్తరాంధ్ర పార్టీ కో-కన్వీనర్ వంటి పదవులు, గుర్తింపు అంతా బొత్స ప్రోత్సాహం వల్లే అన్న విషయాన్ని మరచిపోవద్దని హితవు పలుకుతున్నారు.

తాను జనసేనలోకి వెళ్లే వ్యవహారం బయటకు రాకుండా చిన్న శ్రీను డైవర్షన్ ప్లాన్ అమలు చేశారన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ నేత బొత్స సత్యనారాయణే పార్టీ మారుతున్నారంటూ ప్రచారం అటువైపు మళ్లించి తన రాజకీయ అడుగులను కప్పిపుచ్చుకునే యత్నం చేశారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా, బొత్సను కాదని చిన్న శ్రీను జనసేనలో చేరితే ఆయన రాజకీయంగా మనుగడ సాధించగలరా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఇచ్చిన బలాన్ని తన వ్యక్తిగత బలమని భ్రమపడి జనసేనలోకి వెళ్లినా.. అక్కడ ఆయనకు ఆశించిన మైలేజ్ రావడం కష్టమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కూటమిలో స్థానిక సీట్లు, నామినేటెడ్ పదవుల కోసం తీవ్ర పోటీ ఉన్న వేళ.. బయటి నుంచి వచ్చే చిన్న శ్రీనును, ఆయన కుమార్తెను జనసేన శ్రేణులు మనస్ఫూర్తిగా అంగీకరిస్తాయా అన్నది చూడాల్సివుందని అంటున్నారు. కూతురి మేయ‌ర్‌ పీఠం కోసం వేస్తున్న ఈ తొందరపాటు అడుగు చిన్న శ్రీను స్వయంకృతాపరాధంగా మారే ప్రమాదముందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కుమార్తె సిరి సహస్ర రాజకీయ భవిష్యత్తు కోసం మజ్జి శ్రీను వేసిన జనసేన పాచిక చివరకు ఆయన స్వంత కెరీర్‌కే ముప్పు తెచ్చేలా ఉందని బొత్స అనుచరులు హెచ్చరిస్తున్నారు.