Begin typing your search above and press return to search.

వైసీపీకి బొత్స ఫ్యామిలీయే దిక్కా ?

ఆ రెండు జిల్లాలలో వైసీపీకి బలమైన నాయకత్వం అంటే సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

By:  Satya P   |   15 Oct 2026 5:00 AM IST
వైసీపీకి బొత్స ఫ్యామిలీయే దిక్కా ?
X

ఆ రెండు జిల్లాలలో వైసీపీకి బలమైన నాయకత్వం అంటే సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నిక ఏదైనా పదవులు ఏవైనా తొలి ప్రాధాన్యత బొత్స ఫ్యామిలీకే దక్కుతోంది. దాంతో బొత్స కుటుంబం తప్పించి వైసీపీకి వేరే దిక్కు లేదా అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా సాగుతోంది. ఇంతలా బొత్స ఫ్యామిలీ మీద ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఆధారపడడం భవిష్యత్తు రాజకీయానికి ఏ మాత్రం మేలు చేసే పరిణామం కాదని అంటున్నారు. నిజానికి బొత్స ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయాల్లో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన చొరవ అండ దండ పార్టీకి కావాల్సిందే. అదే సమయంలో ఆల్టర్నేషన్ లీడర్ షిప్ ని కూడా అభివృద్ధి చేసుకోవాలన్న మాట వినిపిస్తోంది.

విశాఖ మేయర్ సీటుకి :

ఇక చూస్తే విశాఖ మేయర్ సీటు జనరల్ మహిళగా రిజర్వ్ అయింది. ఈ సీటుకు పోటీకి వైసీపీలో ఎవరు ఉన్నారు అంటే మొదటిగా బయటకు వచ్చిన పేరు మాజీ ఎంపీ బొత్స సతీమణి అయిన బొత్స ఝాన్సీ లక్ష్మి. ఆమెను మేయర్ అభ్యర్ధిగా బరిలోకి నిలబెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆమెది విశాఖ జిల్లా కావడంతో పక్కా లోకల్ కార్డు ఉపయోగపడుతుందని లెక్క వేస్తున్నారు. అలాగే ఆమె గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేశారు. దాంతో ఆమెకు బాగానే ఓట్లు లభించాయి. దాంతో ఆమెకు మేయర్ సీటు ఇస్తే అర్ధ బలం అంగబలం అంతా సమకూరుతుందని భావిస్తూ ఈ ప్రతిపాదన చేశారు. అయితే మేయర్ గా పోటీ చేసేందుకు బొత్స ఝాన్సీ లక్ష్మి ఆసక్తిని చూపించడం లేదని అంటున్నారు.

జెడ్పీ చైర్మన్ కూడా :

మరో వైపు చూస్తే విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవికి పోటీ అంటే కూడా బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష పేరునే అధినాయకత్వం పరిశీలిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఆమె పేరుని చాలా కాలం క్రితమే బొత్స ప్రకటించారు. అయితే ఆ తరువాత రాజకీయం మొత్తం మారిపోయింది. విజయనగరం జిల్లాలో చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. దాంతో ఇప్పుడు ఆయన రాజకీయ పలుకుబడి ప్రభావంతో వైసీపీ బలం సగానికి సగం తగ్గిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బొత్స కుటుంబం పోటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. అయినా సరే వైసీపీ హైకమాండ్ అయితే బొత్స అనూష వైపు మొగ్గు చూపుతోందని అంటున్నారు. చిత్రమేంటంటే ఈ మధ్యనే ఆమెను భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా ప్రకటించారు. ఆమె ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇపుడు మళ్లీ ఆమెనే జెడ్పీ చైర్మన్ రేసులోకి తీసుకుని వస్తున్నారు. దీంతో వైసీపీలో మరో నేత లేరా అన్న చర్చ సాగుతోంది.

కొత్త నాయకత్వం కోసం :

టీడీపీ విషయానికి వస్తే ఎంతో మంది కొత్త నాయకులను తయారు చేసుకుంటోంది అని గుర్తు చేస్తున్నారు. వైసీపీ మాత్రం సీనియర్ నేతలు వారి కుటుంబాల చుట్టే తిరుగుతోందని ఎత్తి చూపుతున్నారు. రాజకీయాల్లో అవకాశాలు ఇస్తేనే క్యాడర్ అయినా లీడర్ అయినా పనిచేస్తారు. అలా కాదూ కూడదు అంటే జంపింగ్స్ చేస్తూ ఉంటారు. వైసీపీ ఈ విషయాన్ని గ్రహించి సరైన వ్యక్తులను సమర్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని అంటున్నారు. అలా చేస్తే రానున్న కాలంలో వైసీపీకి అది శ్రీరామ రక్షగా ఉంటుందని చెబుతున్నారు.