Begin typing your search above and press return to search.

బొత్స ఫ్యామిలీలో వారసుల వార్.. రెండు జిల్లాలు.. ఆరు సీట్లలో బొత్స ఫ్యామిలీ?

వైసీపీ సీనియర్ నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ఇంట్లో వారసుల రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   24 Nov 2025 8:00 AM IST
బొత్స  ఫ్యామిలీలో వారసుల వార్.. రెండు జిల్లాలు.. ఆరు సీట్లలో బొత్స ఫ్యామిలీ?
X

వైసీపీ సీనియర్ నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ఇంట్లో వారసుల రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బొత్స కుమారుడు, కుమార్తెతోపాటు ఆయన సోదరుల పిల్లలు, మేనల్లుడు కుమార్తె ఇలా దాదాపు ఒక అరడజను మంది వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఒకరు ఆశిస్తున్న సీటులో పోటీకి మరొకరు ప్రయత్నాలు చేస్తుండటం, ఇప్పటి నుంచే తమ మనోగతాన్ని ఇంట్లో పెద్దలకు తెలియజేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుండటంతో బొత్స ఫ్యామిలీ పాలిటిక్స్ ఇంట్రస్టింగుగా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ బొత్స ఫ్యామిలీ కోసం విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆరు సీట్లు వదులు కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు.

ఉత్తరాంధ్రలో కీలక రాజకీయ నాయకుడిగా బొత్స చక్రం తిప్పుతున్నారు. 2004 నుంచి బొత్స రాజకీయాలకు ఎదురులేకుండా పోయాయి. అప్పట్లో తొలిసారి మంత్రి అయిన బొత్స.. దాదాపు పదేళ్లు అమాత్యుడిగా కొనసాగారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయడంతోపాటు ఒకానొక సమయంలో సీఎం పదవికి పోటీదారుగా ప్రచారంలోకి వచ్చారు. అయితే కాలం కలిసి రాకపోవడంతో బొత్స.. మంత్రి పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత అనివార్య పరిస్థితుల్లో వైసీపీలోకి వచ్చిన బొత్స ఆ పార్టీలోనూ ఎదురులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు. అదేవిధంగా ఆయన కుటుంబంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలుగా భార్య ఎంపీగా ఒకే సమయంలో పదవులను చేపట్టి విజయనగరం జిల్లాను తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

2009లో బొత్స చీపురుపల్లి నుంచి ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య గజపతినగరం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అదే ఏడాది బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి విజయనగరం ఎంపీగా విజయం సాధించారు. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బొత్స బంధువు బడుకొండ అప్పలనాయుడు శాసనసభ్యుడిగా గెలిచారు. ఇదేవిధంగా 2019లో ఝాన్సీలక్ష్మి తప్ప మిగిలిన వారు ఆయా స్థానాల నుంచి మళ్లీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక 2021లో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను విజయనగరం జడ్పీ చైర్మన్ పదవిని అధిష్టించారు. ఇలా బొత్స ఫ్యామిలీ కోసం ఎప్పుడూ నాలుగు పదవులు రిజర్వు చేయాల్సిన పరిస్థితి వస్తోందని అంటున్నారు. అయితే ఈ సారి ఈ సంఖ్య ఆరుకు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

బొత్స కుమారుడు సందీప్, కుమార్తె అనూష, బొత్స సోదరుడు లక్ష్మణరావు కుమారుడు శ్రీను, బొత్స మేనల్లుడు చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స బదులుగా ఆయన కుమారుడు పోటీ చేయాలని భావించారు. కానీ, తీవ్ర పోటీ ఉండటంతో బొత్సనే పోటీకి పెట్టారు. అయితే ఈ సారి ఈ స్థానాన్ని బొత్స కుమార్తె అనూష ఆశిస్తున్నారు. ఆమె తాజాగా చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటనలకు తెరతీశారు. ఇదే స్థానం నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న బొత్స కుమారుడు సందీప్ చెల్లెలు నుంచి పోటీ ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు చీపురుపల్లిపైనే ఆశలు పెట్టుకుని రాజకీయం చేస్తున్న జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనును వైసీపీ అధిష్టానం విశాఖ జిల్లా భీమిలి ఇన్చార్జిగా నియమించింది. దీంతో ఈ సారి ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.

ఇప్పటివరకు చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల నుంచి బొత్స కుటుంబ సభ్యులు పోటీ చేస్తుండగా, విజయనగరం లేదా విశాఖ పార్లమెంటు సీటును ఆ కుటుంబానికి ఇస్తున్నారు. ఇక తాజాగా భీమిలి కూడా బొత్స ఫ్యామిలీ లిస్టులోనే చేరింది. అదేసమయంలో వారసుల ఎంట్రీతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న బొత్స.. విజయనగరం పార్లమెంటు, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాలను కూడా కోరుకుంటున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఎచ్చెర్ల నియోజకవర్గ నేతలు ఎప్పటి నుంచో బొత్స కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ సారి కుటుంబంలో పోటీ పెరగడంతో బొత్స కూడా ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేయాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల నుంచి యథావిధిగా బొత్స, అప్పలనరసయ్య, బడుకొండ అప్పలనాయుడు పోటీకి ఇబ్బంది లేదని, అదేవిధంగా విశాఖ పార్లమెంటు సీటు కూడా తమ కుటుంబానికే వస్తుందని బొత్స తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట..

అయితే వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి తన స్థానంలో కుమార్తె అనూషను బరిలోకి దింపి.. కుమారుడు సందీప్ ను విజయనగరం పార్లమెంటు స్థానంలో పోటీచేయించాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఆయన విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారట.. అదేవిధంగా ప్రస్తుతం జనసేనలోకి వెళ్లిన సోదరుడు లక్ష్మణరావును తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చి, ఆయన కుమారుడికి ఎచ్చెర్ల అప్పగించాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే లక్ష్మణరావు కుమారుడు నెల్లిమర్ల సీటు కావాలని ఎప్పటి నుంచో కుటుంబంలో పేచీ పెడుతున్నాడు. ఈ స్థానం దక్కలేదనే గత ఎన్నికల్లో ఆయన జనసేన గెలుపునకు పనిచేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో బొత్స నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. కుటుంబం ఐకమత్యంగా ఉందని చాటుకునేందుకు నెల్లిమర్ల తమ్ముడికి అప్పగించి.. అక్కడ మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడును ఈ సారి వెనక్కి తగ్గిస్తారని అంటున్నారు. అదే సమయంలో ఆయన కోడలు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహాస్రకు ఎచ్చెర్ల టికెట్ తో సర్దుబాటు చేయాలని బొత్స ఆలోచనగా చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి భారీ సంఖ్యలో పోటీకి దిగనున్నట్లు చెబుతున్నారు. చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్లతోపాటు అదనంగా ఎచ్చెర్ల, భీమిలి అసెంబ్లీ స్థానాలు, విజయనగరం, విశాఖపట్నం పార్లమెంటు స్థానాల నుంచి బొత్స కుటుంబసభ్యులే పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే ఒకే కుటుంబానికి ఆరు లేదా ఏడు సీట్లు ఇవ్వాలంటే కుదురుతుందా? అనేది కూడా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే ఆయా స్థానాల్లో బొత్స కుటుంబ సభ్యులు తప్ప, అంతకు మించిన సమర్థులైన నేతలు అందుబాటులో లేరన్న ఆలోచన పార్టీ అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేస్తోందని అంటున్నారు. మొత్తానికి బొత్స కుటుంబ రాజకీయం ఉత్తరాంధ్రలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.