Begin typing your search above and press return to search.

బొత్స కుమార్తె .....కీలక పదవి మీదనే గురి

ఇదిలా ఉంటే బొత్స తన కుమార్తె రాజకీయ అరంగేట్రం మీద తీవ్రంగానే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

By:  Satya P   |   8 Dec 2025 11:30 PM IST
బొత్స కుమార్తె .....కీలక పదవి మీదనే గురి
X

ఉత్తరాంధ్ర జిల్లాలలో సీనియర్ మోస్ట్ నాయకుడు బీసీ నేత అయిన బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వం మీద రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఆయన రాజకీయాలను ముందుకు తీసుకుని వెళ్ళేది కుమారుడు డాక్టర్ సందీప్ నా లేక కుమార్తె డాక్టర్ బొత్స అనూష నా అన్నది అయితే తెలియడం లేదు. కుమారుడు చూస్తే ఇటీవల కాలంలో పెద్దగా అలికిడి చేయడం లేదు, కానీ అనూష మాత్రం బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లి లో హడావుడి చేస్తున్నారు. ఆమె ప్రజలతో కలసి పలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక వైసీపీ వైద్య కళాశాలలని ప్రైవేట్ పరం చేయవద్దు అని కోరుతూ కోటి సంతకాల సేకరణ కోసం ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ నేతలతో పాటు బొత్స అనూష కూడా పాల్గొంటున్నారు. అయితే ఆమె ఎక్కువగా చీపురుపల్లి నియోజకవర్గంలోని మొరకముడిదాంలో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజలతోనే కలసి తిరుగుతున్నారు. దాంతో ఆమె రాజకీయ ఆలోచనలు ఏమిటి అన్నది చర్చగా ఉంది.

కంచుకోట నుంచి :

ఇదిలా ఉంటే బొత్స తన కుమార్తె రాజకీయ అరంగేట్రం మీద తీవ్రంగానే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. కుమార్తెని వైసీపీకి కంచుకోట అయిన మెరకముడిదాం మండలం నుంచి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీలో దించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక మండల వ్యవస్థ 1987లో ఏర్పడిన నాటి నుంచి ఒకటి రెండు సందర్భాలలో తప్పించి అక్కడ కాంగ్రెస్ తరువాత వైసీపీ గెలుస్తూ వచ్చాయి. ఎపుడు ఏ ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గంలో మెజారిటీ వైసీపీదే కావడం విశేషం. ఈ నేపధ్యంలో అన్నీ ఆలోచించిన మీదటనే కుమార్తెని ఇక్కడ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని బొత్స చూస్తున్నారు అని అంటున్నారు.

బంధుగణం కూడా :

మెరకముడిదాంలో బొత్స అనుచర గణమే కాదు, బంధు గణం కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో వారంతా బొత్స కుమార్తె డాక్టర్ అనూష రాజకీయాన్ని స్వాగతిస్తున్నారు. దానికి తగినట్లుగానే అనూష కూడా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. 2026 లో జరిగే స్థానిక ఎన్నికల్లో అనూష నేరుగా రంగంలోకి దిగి ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఆమె కీలక పదవి కోసమే ఈ కసరత్తు చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

జెడ్పీ పీఠం మీద కన్ను :

బొత్స కుటుంబం జెడ్పీ పీఠం మీద కన్ను వేసింది అని అంటున్నారు. వైసీపీకి విజయనగరం జిల్లాలో రూరల్ బేస్ లో మంచి పట్టు ఉంది. దాంతో గతంలోనూ ఈ పీఠాన్ని కైవశం చేసుకుంది. ప్రస్తుతం బొత్స కుటుంబం నుంచే ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చైర్మన్ గా ఉంటున్నారు. అంతకు ముందు బొత్స సతీమణి ఈ కీలక పదవి చేపట్టి అనంతరం ఎంపీగా కూడా నెగ్గారు. దాంతో కుమార్తెని కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయాలని బొత్స చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగా సమయం ఉంది. దాంతో స్థానిక ఎన్నికల్లో గెలిచి కీలక పదవిలో కొనసాగితే 2029 నాటికి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఆమె పోటీ చేయవచ్చు అన్న మాట ఉంది. మొత్తానికి తండ్రి అడుగు జాడలలో ఆయన సూచనలు మేరకు డాక్టర్ అనూష జెడ్పీటీసీగా రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.