గంటా గూటికే బొత్స గురి...వారసురాలి రాజకీయ సిరి !
విజయనగరం జిల్లాతో పాటు విశాఖ జిల్లాను ఏకకాలంలో తన రాజకీయ పలుకుబడితో ముందుకు నడిపిస్తున్న వైసీపీ మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏరి కోరి టీడీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గూటికే గురి పెట్టేశారు అని అంటున్నారు.
By: Satya P | 22 Sept 2026 8:09 AM ISTవిజయనగరం జిల్లాతో పాటు విశాఖ జిల్లాను ఏకకాలంలో తన రాజకీయ పలుకుబడితో ముందుకు నడిపిస్తున్న వైసీపీ మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏరి కోరి టీడీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గూటికే గురి పెట్టేశారు అని అంటున్నారు. గంటాకు భీమిలీలో ఉన్న పట్టు ఎలాంటిదో అందరికీ తెలిసిందే. 2014లో ఆయన తొలిసారి పోటీ చేసినపుడు 45 వేల దాకా భారీ మెజారిటీ వస్తే 2024లో అది కాస్తా రెట్టింపు అయి 90 వేలకు చేరుకుని ఏపీలోనే టాప్ త్రీలో ఒకటిగా నిలిచింది. ఇక గంటా రాజకీయ వ్యూహాలు పదును తేరి ఉంటాయి. ఆయన ఓటమి ఎరగని వీరుడు. టీడీపీలో ఎంతో మంది ఓటమిని చూశారు, కానీ గంటా మాత్రం అదేంటో ఎరగని నాయకుడు అయ్యారు అంటే అది ఆయన ఘనతగానే చూస్తారు.
భీమిలీ రాజకీయం :
ఇక భీమునిపట్నం విశాఖకు ఆనుకుని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. ఒకనాడు అంతా రాజుల ఏలుబడిలో కొనసాగిన పాలిటిక్స్ కాస్తా 2004లో తీరు మార్చుకుని సామాజిక సమీకరణ బాట పట్టింది. నాటి నుంచి గత అయిదు ఎన్నికల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలు అవుతున్నారు అంటే ఆ సామాజిక వర్గం బలం ఎంతటితో అర్ధం అవుతుంది. ఏపెలోనే పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి అయిన భీమిలీలో మూడున్నర లక్షల మంది పై దాకా ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా కాపులు ఉన్నారు. వీరు జనాభాలో సగానికి పైగా ఉంటే ఆ తరువాత స్థానంలో యాదవులు ఉన్నారు. ఇక మత్స్యకారులు ఇతర బీసీ వర్గాలు కీలకంగా ఉన్నారు. భీమిలీలో అతి తక్కువ సామాజిక వర్గంగా క్షత్రియులు ఉన్నా కూడా రాజకీయాలో వారు చక్రం తిప్పడం వల్లనే అది సాధ్యపడింది. ఇప్పుడు మాత్రం సామాజిక సమీకరణలే కీలక పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పక తప్పదు.
బొత్సకు సైతం :
ఇక భీమిలీతో బొత్స కుటుంబానికి సంబంధం ఏమిటి అంటే ఈ నియోజకవర్గం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉంది. దాంతో కొన్ని మండలాలు అనేక గ్రామాలు విజయనగరం పొరుగున ఉంటాయి. పైగా భీమిలీలో బలమైన సామాజిక వర్గానికి చెందినది కావడం బొత్స కుటుంబానికి మరో అడ్వాంటేజ్ గా ఉండబోతోంది. ఇక రాజకీయ వ్యూహాలలో గంటాకు ధీటు అయిన నాయకుడిగా బొత్సను చూడాల్సి ఉంది. ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయం. పైపెచ్చు లోకల్ కార్డుని తీస్తే అది కూడా పొలిటికల్ గా వర్కౌట్ అయ్యే చాన్స్ ఉంది. దాంతోనే బొత్స తన రాజకీయ వారసురాలు అయిన కుమార్తె బొత్స అనూషను భీమిలీ వైసీపీ ఇంచార్జిని చేశారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీకి కంచుకోట కానీ మూడు ఎన్నికల్లో ఓటమి చెందిన విషయం కూడా ఉంది. అది కూడా బొత్స ఫ్యామిలీలో ఆశలను పెంచుతోంది.
గట్టిగా పట్టుబడితే :
ఇక 2024 ఎన్నికలు అయితే కూటమి ప్రభంజనం ఉంటుంది. అలా కాకుండా 2029 ఎన్నికలు యాంటీ ఇంకెంబెన్సీ తో జరుగుతాయి. అది కచ్చితంగా వైసీపీకి కలసి వస్తుందని బొత్స వర్గం అంచనా వేస్తోంది. మరో వైపు చూస్తే ఎన్నికల నాటికి రాజకీయ సామాజిక సమీకరణలలో భారీ మార్పులు ఉంటాయని ఊహిస్తోంది. గంటా పోటీ చేసిన సీటులో వరసగా రెండవసారి నిలబడిన దాఖలాలు లేవు. దాంతో ఆయన నిలబడితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొంత వ్యతిరేక ఉంటుందని భావిస్తున్నారు. ఆయన బదులు కుమారుడు నిలబడితే తమకు లాభమే అని వైసీపీ లెక్క వేసుకుంటోంది. ఇలా అన్ని రకాలైన అంచనాలు వేసుకుని మరీ బొత్స తన కుమార్తెని భీమిలీ నుంచి రంగంలోకి దింపుతున్నారు అని అంటున్నారు.
