సిక్ లీవ్ కావాలా? అయితే 'లైవ్ లొకేషన్' పంపండి.. బాస్ వింత కండిషన్
ఆఫీసులో ఒంట్లో బాగోలేక సెలవు అడిగితే సాధారణంగా మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారు. కానీ ఒక బాస్ మాత్రం ఏకంగా 'లైవ్ లొకేషన్' షేర్ చేయాలని కండిషన్ పెట్టాడు.
By: A.N.Kumar | 5 Jan 2026 6:00 PM ISTఆఫీసులో ఒంట్లో బాగోలేక సెలవు అడిగితే సాధారణంగా మెడికల్ సర్టిఫికేట్ అడుగుతారు. కానీ ఒక బాస్ మాత్రం ఏకంగా 'లైవ్ లొకేషన్' షేర్ చేయాలని కండిషన్ పెట్టాడు. భారతీయ కార్పొరేట్ రంగంలో వేళ్లూనుకున్న 'టాక్సిక్' వర్క్ కల్చర్‌కు అద్దం పడుతున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది.
అసలేం జరిగింది?
రెడిట్ వేదికగా ఇండియన్ మార్కెట్ కమ్యూనిటీలో ఒక ఉద్యోగి షేర్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ ఈ చర్చకు దారితీసింది. అనారోగ్యం కారణంగా సెలవు కోరిన ఉద్యోగికి సదరు మేనేజర్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. "నీ సిక్ లీవ్ అప్రూవ్ కావాలంటే, నువ్వు ఎక్కడ ఉన్నావో లైవ్ లొకేషన్ షేర్ చేయాలి.. ఇది మా హెచ్ఆర్ (హెచ్ఆర్) పాలసీ" అని మేనేజర్ పేర్కొన్నాడు. నిజంగానే అనారోగ్యంతో ఉన్నాడా లేక సెలవు పెట్టి బయట తిరుగుతున్నాడా అని నిఘా పెట్టడమే ఈ డిమాండ్ వెనుక ఉన్న ఉద్దేశం అని స్పష్టమవుతోంది.
మండిపడుతున్న నెటిజన్లు
ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు సదరు సంస్థపై, మేనేజర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఒక ఉద్యోగి వ్యక్తిగత జీవితంలోకి గోప్యతలోకి ఇది పచ్చిగా చొరబడటమే అని విమర్శిస్తున్నారు. ఉద్యోగులను అడుగడుగునా అనుమానించే ఇలాంటి మైక్రో మేనేజ్‌మెంట్ వల్ల పని సామర్థ్యం తగ్గుతుందని మండిపడుతున్నారు. "మనం పని చేస్తున్నామా లేక బానిసలుగా బతుకుతున్నామా?" అంటూ కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
గణాంకాలు చెబుతున్న భయంకర నిజాలు
ఈ ఒక్క ఘటన మాత్రమే కాదు.. భారత్‌లో పని ఒత్తిడి, మేనేజ్‌మెంట్ తీరుపై గతంలో వచ్చిన నివేదికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 2022లో ఎస్.హెచ్.ఆర్ఎం గ్లోబల్ కల్చర్ నిర్వహించిన సర్వే ప్రకారం, భారత్‌లో సుమారు 45 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకి వెళ్లడానికే భయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడి విషపూరిత వాతావరణమే.2023 ఐఎల్ఓ నివేదిక ప్రకారం, ఆసియాలోనే భారత్ అత్యధిక పని గంటలు కలిగిన దేశం. ఇక్కడ 50.5 శాతం మంది ఉద్యోగులు వారానికి 49 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నారు. మితిమీరిన పని భారం వల్ల భారత్‌లో 'బర్నౌట్' స్థాయి ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
కేవలం లాభాలనే పరమావధిగా చూస్తూ ఉద్యోగిని ఒక యంత్రంలా భావించే సంస్థలు దీర్ఘకాలంలో మనలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నమ్మకం, గౌరవం లేని చోట ప్రతిభావంతులైన ఉద్యోగులు ఉండరని.. ఇది సంస్థల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ 'లైవ్ లొకేషన్' ఉదంతం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు.. ఇది వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అపనమ్మకానికి నిదర్శనం. ఇప్పటికైనా కార్పొరేట్ శక్తులు మేల్కొని, పని సంస్కృతిలో మానవీయ కోణాన్ని జోడిస్తాయో లేదో వేచి చూడాలి.
