Begin typing your search above and press return to search.

నన్ను ఎవరూ ఆపలేరు.. జగన్ కోసమే పనిచేస్తా.. బోరుగడ్డ మరో వీడియో

వైసీపీ సానుభూతిపరుడిగా చెప్పుకుంటున్న బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా మరో వీడియో విడుదల చేశారు.

By:  Tupaki Political Desk   |   6 Aug 2026 1:39 PM IST
నన్ను ఎవరూ ఆపలేరు.. జగన్ కోసమే పనిచేస్తా.. బోరుగడ్డ మరో వీడియో
X

వైసీపీ పార్టీలో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం కలకలం రేగుతోంది. రెండు రోజుల క్రితం మాజీ సీఎం జగన్ నివాసం ముందు ధర్నాకు దిగిన బోరుగడ్డ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్లు ఇంటర్వ్యూలు ఇస్తూ కాకపుట్టిస్తున్నారు. పార్టీ కార్యాలయంలోకి తనను రానీయడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలపై ఆరోపణలు చేసిన బోరుగడ్డ తాజా వీడియోలో పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో పార్టీలో తనను ఎవరూ ఆపలేరని, ఎవరూ ఊహించని అంత ఎత్తుకు ఎదుగుతానని తేల్చిచెప్పారు. తనకు మాజీ సీఎం, పార్టీ అధినేత జగన్ రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ సానుభూతిపరుడిగా చెప్పుకుంటున్న బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డిపై మరోమారు ఫైర్ అయ్యారు. అదేవిధంగా సోషల్ మీడియాలో తనపై కొందరు మాట్లాడుతున్నారని, ఈ వీడియో ద్వారా వారికి క్లారిటీ ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ‘‘నేను ఒకటే చెబుతున్నా, నా పార్టీ వైసీపీ, వైసీపిలోనే ఉంటా. ఎవరూ టచ్ చేయని రేంజ్ కి ఎదుగుతా. ప్రజాదరణ కలిగిన వ్యక్తిని నేను, దళిత జాతిలో అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిని. రిపబ్లికన్ పార్టీ స్టేట్ ప్రెసిడెంటుగా ఉంటూ రాష్ట్రంలో ప్రతి పల్లె, ప్రతి వాడ తిరిగాను. ఇప్పుడు వైసీపీలో ఉన్నాను. వైసీపీ కోసమే పనిచేస్తాను. జగనన్నను సీఎం చేయడమే నా లక్ష్యం’’ అంటూ బోరుగడ్డ ఆ వీడియోలో స్పష్టం చేశారు.

తాను పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డితో మాట్లాడిన వీడియో రెండు రోజుల క్రితం విడుదల చేశానని, అది రెండు నెలల క్రితం విడుదల చేసిన వీడియో అంటూ బోరుగడ్డ వివరించారు. ఈ వీడియో విడుదల చేసిన తర్వాత కారుమూరి వెంకట్ రెడ్డి ఏవేవో మాట్లాడుతున్నారు. పాపం ఆయన ముఖం చూస్తే బాధేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు కూడా తన గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని, అన్ని విషయాలు జగన్ సార్ తగ్గర తేల్చుకుందామని సవాల్ విసిరారు. పార్టీలో మీకు ఎంత హక్కు ఉందో నాకూ అంతే హక్కు ఉంది. మీకన్నా ఒక అడుగు ఎక్కువే నాకు హక్కు ఉంది అంటూ బోరుగడ్డ తేల్చిచెప్పారు.

‘‘నేను జగన్ సార్ దగ్గర చూసుకుంటాను, జగన్ సార్ తో మాట్లాడుకుంటాను. వైయస్సార్సీపీ పార్టీలోనే ఉంటాను, వైయస్సార్సీపీ పార్టీలో తొందరలో చేరబోతున్నా. నేను ఏ తప్పు చేయలే. భారతమ్మ గురించి ఏదైతే మాట్లాడి, భారతమ్మ క్యారెక్టర్ ను అవమానించారో, జగన్ రెడ్డి పుట్టక కోసం మాట్లాడి అవమానించారో అందుకే ప్రతిఘటించా, కాస్త ఎక్కువ మాట్లాడింది వాస్తవం. అందుకే తొమ్మిది నెలలు జైలులో ఉన్నాను అయినా పార్టీలో ఎవరూ పట్టించుకోలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నా మీద బురద జల్లుతున్నకారుమూరి వెంకటరెడ్డి నేను జైలుకెళ్తే సంతోషించానని చెబుతున్నాడు. ఆయన లెక్క తేలుస్తాను. జగన్ సార్ ని త్వరలో కలుస్తాను. జగన్ సార్ నాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది అంటూ బోరుగడ్డ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘దేశంలో దమ్ము, ధైర్యం ఉన్న నాయకుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒకరు. ఆయన కోసమే పనిచేస్తా, నా ఊపిరి ఉన్నంత వరకు జగనన్న కుటుంబంతోనే ఉంటా.. మీరు ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా నన్ను ఎవ్వరూ ఆపలేరు పార్టీలోకి రాకుండా ఆపలేరు, త్వరలోనే పార్టీలోకి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాను, ఖచ్చితంగా అన్నని మళ్ళీ సీఎంను చేస్తాను.’’ అంటూ బోరుగడ్డ ఆ వీడియలో స్పష్టం చేశారు. చివరిలో తనకు అన్యాయం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. జగన్ నా రాజకీయ గురువు, పార్టీ నాకు తల్లి లాంటిది. జై జగన్ అంటూ వీడియోను ముగించారు. బోరుగడ్డ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.