ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడి...12 మంది మృతి
ఆస్ట్రేలియాలో ఆదివారం సాయంత్రం మారణ హోమం జరిగింది. సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఒక సామూహిక దాడిలో ఒక షూటర్‌తో సహా కనీసం 12 మంది మరణించారని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
By: Satya P | 14 Dec 2025 10:02 PM ISTఆస్ట్రేలియాలో ఆదివారం సాయంత్రం మారణ హోమం జరిగింది. సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఒక సామూహిక దాడిలో ఒక షూటర్‌తో సహా కనీసం 12 మంది మరణించారని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ దారుణమైన సంఘటనను ఉగ్రవాద దాడిగా అక్కడి ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన మొదటి షూటర్ ఘటనా స్థలంలోనే మరణించగా రెండవ షూటర్ ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండవ షూటర్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ దారుణ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు సహా ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారని తెలుసోంది.
సామాన్య ప్రజల పైన :
ఇదిలా ఉండగా సిడ్నీలోని బాండి బీచ్‌లో ఒక దుండగుడు సామాన్య ప్రజలపై అత్యంత విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ భయంకరమైన ఘటనలో అక్కడికక్కడే ఏకంగా 12 మంది మరణించగా పెద్ద సంఖ్యలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో ఆస్ట్రేలియా ఉలిక్కి పడింది. ఉగ్ర మూలాలను ఎక్కడ ఉన్నా వెలికి తీసి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
దిగ్భ్రాంతికరమైనదంటూ:
సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్ర దాడిని అస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ దిగ్భ్రాంతికరమైనదిగా అత్యంత బాధాకరమైనదిగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘటన మీద పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఇది అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. యూదుల హనుక్కా పండుగ మొదటి రోజును జరుపుకుంటున్న వేళ వారిని టార్గెట్ గా పెట్టుకుని చేసిన దుశ్చర్యగా ఆయన అన్నారు. ఈ ఘటన పట్ల దేశ ప్రజల తరపున తన సానుభూతిని ప్రధాని తెలిపారు. అలాగే తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మోడీ సంతాపం ప్రకటించారు. ఈ కీలకమైన సందర్భంలో తామంతా ఆస్ట్రేలియా ప్రజలకు సంఘీభావంగా నిలబడతామని మోడీ స్పష్టం చేశారు.
అనేక దేశాల సంఘీభావం :
సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్ర దాడిని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ ఖండించారు. ఈ కాల్పుల దాడితో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన అన్నారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఉగ్రవాద దాడిని ఖండించారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఈ ఘాతుకం తనను ఏ మాత్రం మాటలు లేకుండా చేశాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సెమిటిక్ వ్యతిరేక హింస విస్తరణను ఆపాలని ప్రపంచ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో ఆయన ఈ దాడి మన ఉమ్మడి విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
దారుణమైన ఘటన :
అదే విధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఉగ్రవాద దాడిని ఖండించారు. బాధితులు, గాయపడినవారు తమ వారిని కోల్పోయిన వారి ప్ట్ల ఫ్రాన్స్ తరఫున సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో తన ఆవేదనను సంఘీభావాన్ని తెలిపారు. సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్ర దాడి తీవ్ర బాధాకరమని పేర్కొంటూ యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ బాధితులకువారి కుటుంబాలకు నివాళులర్పించారు. ఇక ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా సంతాపకం ప్రకటించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సైతం హింస, ద్వేషం వంటి వాటికి తావు లేదని అన్నారు.
