బాబు మాటే శిరోధార్యం: ఎమ్మెల్యే బొండా
టీడీపీ అధినేత చంద్రబాబు మాటే శిరోధార్యమని, ఆయన ఏం చెప్పినా చేసేందుకు తాను సిద్ధమేనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు.
By: Garuda Media | 28 July 2026 9:38 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు మాటే శిరోధార్యమని, ఆయన ఏం చెప్పినా చేసేందుకు తాను సిద్ధమేనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. తనపై కొందరు సొంత నేతలే పన్నాగాలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. వారే తనపై ట్రోల్స్ చేస్తూ.. లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటానని.. చంద్రబాబు ఏం చెప్పినా అదే చేస్తానని.. .పార్టీ నిబంధనలకు నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల బొండా ఉమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులతో కలిసి వేదిక పంచుకున్నారని తెలిసి.. బొండా ఉమా నుంచి వివరణ కోరాలని మంత్రి నిమ్మల రామానాయుడు, పార్టీఏపీ చీఫ్ పల్లాశ్రీనివాసరావులను ఆదేశించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విచారణకు బొండా ఉమా వచ్చారు. సుదీర్ఘంగా గంటన్నరపాటు.. ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బొండా.. తాను ఏతప్పూ చేయలేదన్నారు. వైసీపీ నాయకులతో కలవాలా? వద్దా? అనే విషయంలో పార్టీక్లారిటీ ఇస్తే.. ఆమేరకు నడుచుకుంటామని చెప్పారు.
తాను వెళ్లింది ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు మాత్రమేనని.. బొండా చెప్పారు.. వైసీపీ నాయకులు ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయలేదని.. కాపు సామాజిక వర్గం నాయకులే ఈ కార్యక్రమాన్నినిర్వహించారని అందుకే తాను వెళ్లానన్నారు. అక్కడ అప్పటికే ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో తాను మాట్లాడానని.. కుటుంబ విషయాలు మాత్రమే తమ మధ్య చర్చకు వచ్చాయని తెలిపారు. ఇంతకు మించి తాము ఏమీ మాట్లాడలేదన్నారు. కానీ, దీనిని కొందరు తమ పార్టీ నాయకులే ఉద్దేశపూర్వకంగా ట్రోల్స్ చేశారని బొండా ఉమా ఆరోపించారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నట్టు తెలిపారు.
నివేదిక ఇస్తాం..
అనంతరం.. పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు బొండా ఉమా నుంచి వివరణ తీసుకున్నట్టు చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నామని.. పార్టీ అధినేతకు నివేదిక రూపంలో అందిస్తామన్నారు. ప్రత్యర్థి పార్టీలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత పదేపదే చెబుతున్నారని తెలిపారు. ప్రత్యర్థి పార్టీ కూటమి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతోందని.. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అందరూ కలసి కట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యర్థి పార్టీ నేతలతో కలివిడిగా ఉండి కార్యక్రమాల్లో వేదికలు పంచుకోవడం ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వబోదని ఆయన పేర్కొన్నారు.
