బోండా రీచార్జి...మ్యాటర్ అదేనా ?
తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో ఒకప్పుడు వెలుగు వెలిగిన వారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు.
By: Satya P | 9 Aug 2026 12:00 AM ISTతెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో ఒకప్పుడు వెలుగు వెలిగిన వారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. ఆయన అప్పట్లో అంటే 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ వైపు నుంచి బలమైన వాయిస్ వినిపిస్తూ పెద్ద సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను ధీటుగా ఎదుర్కొనేవారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో కూడా ఆయన ప్రతిపక్షంలో పార్టీ ఉన్నపుడు గట్టిగానే పోరాటాలు చేసేవారు. అయితే 2024 తరువాత మాత్రం ఆయన కొంత సైలెంట్ అయ్యారు అని ప్రచారం సాగింది. ఇక ఈ మధ్యనే దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో బోండా ఉమా చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయ రచ్చకు దారి తీసాయి. దాంతో ఆయన టీడీపీ అధినాయకత్వం నియమించిన త్రీ మెన్ కమిటీ ముందు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
వైసీపీ మీద దూకుడుతో :
ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మీద బోండా ఉమా చేస్తున్న దూకుడు ఒక లెవెల్ లో ఉంది. వైసీపీ నేతలు ఎవరైనా చంద్రబాబుని కానీ లోకేష్ ని కానీ ఏమైనా అంటే చూస్తూ ఊరుకోమని బోండా ఉమా హాట్ వార్నింగ్ నే వైసీపీ నేతలకు ఇచ్చారు. తాను అసలు ఎవరినీ వదిలిపెట్టేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక వైసీపీ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని నిరసన శిబిరాలను నిర్వహిస్తోంది. తన నియోజకవర్గంలో జరుగుతున్న వైసీపీ కార్యక్రమాలను బోండా ఉమా తానే స్వయంగా వచ్చి అడ్డుకున్నారు. దాంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది.
మళ్ళీ పాత బోండాగా :
హైకమాండ్ దృష్టిలో పడేందుకే బోండా ఉమా ఈ విధంగా స్ట్రాంగ్ గానే వైసీపీ మీద విరుచుకుపడుతున్నారని అంటున్నారు. ఆయన ఈ మధ్య చేసిన కొన్ని వ్యాఖ్యల ఫలితంగా హైకమాండ్ దృష్టిలో కొంత ఆగ్రహానికి గురి అయ్యారని అంటున్నారు. అయితే తాను అధినాయకత్వానికి సదా విధేయుడిని అని బోండా ఉమా త్రీ మెన్ కమిటీ ముందు వివరణ ఇచ్చిన తరువాత మీడియా ముఖంగా ప్రకటించారు. ఇపుడు ఆయన తన జోరు పెంచడం ద్వారా తాను చేసిన ప్రకటనల ప్రకారమే ముందుకు సాగుతున్నారని అంటున్నారు. అదే విధంగా పార్టీ కోసం ఎందాకైనా అని బోండా ఉమా స్పష్టం చేయడం ద్వారా టీడీపీలో కొత్త హుషార్ ని తెచ్చారని అంటున్నారు.
రాజధాని ప్రాంతంలో :
ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో ఇంతకాలం టీడీపీకి బలమైన గొంతుక అన్నది తగ్గింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు బోండా ఉమా దానిని భర్తీ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బోండా ఉమా తిరిగి తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో ముందుకు వస్తున్నారు. వైసీపీకి ఘాటుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా క్రిష్ణా జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర మాత్రమే ఎక్కువగా వైసీపీని ఎదుర్కొంటూ వచ్చారు. ఇపుడు ఉమా కూడా జత కావడంతో టీడీపీ సైకిల్ పరుగులు తీయడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ దూకుడు వైసీపీకి చాన్స్ ఇవ్వకుండా బూమరాంగ్ కాకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు. లేకపోతే ప్రత్యర్థికి అస్త్రాలు అందించినట్లు అవుతుందని అంటున్నారు. మొత్తానికి బోండా ఉమా తన మీద ఇటీవల కాలంలో వచ్చిన విమర్శలకు తన పెద్ద నోరుతో తగిన జవాబు చెబుతున్నారు. ఆచరణలో కూడా ఆయన అదే స్పీడ్ తో ముందుకు సాగుతున్నారు.
