బోండా ఒక్కడిదేనా అలజడి...ఇంకా ఉన్నారా ?
కాపుల్లో అలజడి అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తాజాగా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో చేసిన హాట్ కామెంట్స్ రాజకీయ అలజడినే పుట్టించాయి.
By: Satya P | 28 July 2026 9:09 AM ISTకాపుల్లో అలజడి అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తాజాగా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో చేసిన హాట్ కామెంట్స్ రాజకీయ అలజడినే పుట్టించాయి. ప్రత్యేకించి టీడీపీలో అయితే మరింతగా అవి ప్రకంపనలు రేపుతున్నాయి. కాపులలో అలజడి అని బొండా అన్నా దానికి రాజకీయ విశ్లేషకులు వేరే విధంగా అన్వయిస్తున్నారు. బోండాలోనే అలజడి ఉందని అంటున్నారు. ఆయన బాధను కాపుల మొత్తం బాధగా చేశారు అని కూడా అంటున్న వారు ఉన్నారు. ఆ మాటకు వస్తే కాపులలో టీడీపీ కాపులు వేరయ్యా అన్నట్లుగా ఈ అలజడి ఆ పార్టీ కాపులలో ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. సరే ఫైర్ బ్రాండ్ కాబట్టి బోండా స్పీడ్ పెంచారు, పెద్ద నోరు చేశారు అని అనుకుంటే మిగిలిన వారిలో అలజడి ఉందా ఉంటే వారి సంగతేంటని చర్చ మొదలైంది.
బ్యాక్ బెంచ్ అనుకుంటూ :
ఏపీలో టీడీపీకి 2024లో అధికారం దక్కింది. కానీ అది 2014 నుంచి 2019 దాకా ఉన్నంత సుఖంగా లేదని తమ్ముళ్ళు అంటున్నారు. ఎలా అంటే ఈసారి ఇతర పార్టీలతో కలసి టీడీపీ అధికారం పంచుకుంది. ఆ మేరకు ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ సీట్ల దగ్గర నుంచి ఆ మీదట కేబినెట్ మంత్రి పదవుల దాకా కోత పడింది అన్నది అయితే ఉంది. ఇక జనసేనను ఎక్కువగా కాపు సామాజిక వర్గం అభిమానిస్తుంది అన్నది ఉంది. దాంతో జనసేన కోటా వాటా ఇచ్చేశాక టీడీపీలో కాపులకు బ్యాక్ బెంచ్ ని చూపిస్తున్నారు అన్న అసంతృప్తి అయితే చాలా మందిలో ఉందని ప్రచారం సాగుతోంది. గతంలో మంత్రి పదవులు ఆ సామాజిక వర్గం నుంచి చేపట్టి ఈసారి చాన్స్ దక్కని వారి నుంచి కొత్తగా మంత్రి పదవులు అందుకుందామని ఆశపడిన వారి వరకూ అందరూ కూడా ఈ పరిణామాలతో నీరసపడి ఉన్నారని ప్రచారం అయితే సాగుతోంది.
ఇదే తొలిసారి కాదు :
ఇక బోండా ఈ తరహా వ్యాఖ్యలు చేసింది ఇదే తొలిసారి కాదు అని గుర్తు చేస్తున్నారు. ఈ మధ్యనే టీడీపీ కూటమి రెండేళ్ళ పండుగ విజయోత్సవాలలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు అని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే బోండా ఉమా అసంతృప్తి కాపులలో అలజడిగా మారిందని అంటున్నారు. ఇక ఆయనతో పాటుగా మరి కొంతమంది కూడా ఉండే ఉంటారు అని అంటున్నారు.
పదవులు దక్కవనే :
టీడీపీ వరకూ చూస్తే సమీకరణలు సామాజికంగా రాజకీయంగా సరిపోతున్నాయి. కానీ టీడీపీలో ఉన్న వారికి మాత్రం ఎక్కడా మింగుడు పడడం లేదు, తమ వరకూ పదవులు రావడం లేదనే వారి ఆవేదనగా చెబుతున్నారు. గతంలో అయితే టీడీపీ ప్రధానంగా కాపులకు పెద్ద పీట వేసేది అని గుర్తు చేస్తున్నారు. విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు, అలాగే శ్రీకాకుళం నుంచి కిమిడి కళా వెంకట్రావు, తూర్పు గోదావరి జిల్లా నుంచి నిమ్మకాయల చిన రాజప్ప వంటి వారు మంత్రులు అయ్యారు. ఇపుడు చూస్తే సీన్ మారింది. కాపుల అండ ఉన్న జనసేన మిత్రపక్షం అయింది. దాంతో టీడీపీ హైకమాండ్ ఆ మేరకు బేఫికర్ గా ఉండొచ్చు కానీ అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కాపులు అయితే నలిగిపోతున్నారు అని అంటున్నారు. అందుకే మంత్రి పదవి కావాలన్నా లేక ఇతర అందలాలు దక్కాలన్నా టీడీపీలో అయ్యే పనేనా అన్న చర్చ మొదలైందని అదే కాపుల అలజడిగా రూపాంతరం చెందుతోంది అని అంటున్నారు. మరి చూడాలి ఈ అలజడి తీరం దాటకుండా అక్కడే ఆగుతుందా లేక తాకుతుందా అన్నది అని అంటున్నారు.
