Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే బొండా సంచలన వ్యాఖ్యలు.. తిరుగుబాటుకు సంకేతమా?!

రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గమైన కాపుల్లో ఒక రకమైన అలజడి ప్రారంభమైందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొండా ఉమమహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   25 July 2026 10:32 PM IST
ఎమ్మెల్యే బొండా సంచలన వ్యాఖ్యలు.. తిరుగుబాటుకు సంకేతమా?!
X

రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గమైన కాపుల్లో ఒక రకమైన అలజడి ప్రారంభమైందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొండా ఉమమహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. గుంటూరులో జరిగిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో బొండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ చేసిన పోరాటాలను, నాటి రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. కాపుల కోసం ఏ క్షణంలోనైనా ప్రాణాలర్పించేందుకు సిద్ధపడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని, కాపు రిజర్వేషన్లు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం ఆయన అనేక ఉద్యమాలు నడిపారని కొనియాడారు. చివరి శ్వాస వరకు ఆయన నీతిగా జీవించారని ప్రశంసించారు. అయితే దాదాపు కోటి మంది ఉన్న కాపులలో అలజడి ఉందని అధికార పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు అంతకుమించి అలజడి సృష్టిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత తాము అసెంబ్లీలో అడుగుపెట్టిన తరుణంలోనే కాపు ఉద్యమం పురుడు పోసుకుందని బొండా ఉమా తెలిపారు. ఆ సమయంలో తాము అధికారంలో ఉన్నామని, కాపుల సమస్యలపై ముద్రగడ ప్రభుత్వానికి వరుస లేఖలు రాశారని గుర్తు చేశారు. రిజర్వేషన్లు, ఉద్యోగుల పోస్టింగ్‌లు, రాజకీయ అంశాలకు సంబంధించి ఆ లేఖల్లో ఎన్నో డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. ముద్రగడ రాసిన ఆ లేఖల్లోని అంశాలపై ప్రభుత్వం ఆలోచించాలని, వాటి సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీ వేయాలని నాడు తాము టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ముద్రగడను నేరుగా పిలిచి చర్చలు జరిపితే బాగుంటుందని తాము అధిష్టానానికి సూచించినట్లు స్పష్టం చేశారు.

అయితే, సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు ముద్రగడ గురించి ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయనకు కాపుల్లో అంతగా పట్టులేదంటూ తప్పుదోవ పట్టించారని బొండా ఉమా ఆరోపించారు. దీనివల్ల ముద్రగడ రాసిన లేఖలు ప్రయోజనం లేకుండా పోయాయన్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాపు నేతలంతా ముద్రగడ వెనుక నడిచారని, తుని సభ తదితర పరిణామాలు అందరికీ తెలిసిందేనని అన్నారు. గ్రామస్థాయి వరకు ఉద్యమాన్ని తీసుకువెళ్లిన ముద్రగడ, 'కంచాలు కొట్టాలంటూ' పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా కాపులంతా ఆచరించారని గుర్తు చేశారు. ముద్రగడ ఉద్యమ తీవ్రత వల్లే 2019 ఎన్నికల్లో తాము అధికారం కోల్పోవాల్సి వచ్చిందని ఆయన విశ్లేషించారు.

"కాపులు ఏ వైపు నిలిస్తే, రాష్ట్రంలో అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాలో కోటి మందికి పైగా బలిజ, కాపు, తూర్పుకాపు, ఒంటరి సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాలే ప్రభుత్వాల ఏర్పాటును నిర్ణయిస్తాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాపుల్లో అలజడి మొదలైంది. ఈ అలజడిని పట్టిపించుకోవాల్సిన అవసరం ఉంది." అంటూ ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాపుల న్యాయమైన డిమాండ్లను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బొండా ఉమా హామీ ఇచ్చారు.

రాష్ట్ర జనాభాలో 25 శాతంగా ఉన్న కాపు, బలిజ తదితర అనుబంధ కులాలకు దామాషా ప్రకారం బడ్జెట్ నిధులు, రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర సంక్షేమ పథకాలు దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన బలంగా వాదించారు. సొంత పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఒక సీనియర్ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గంలో నెలకొన్న అసంతృప్తి, అలజడి గురించి బహిరంగంగా మాట్లాడటం, వారి డిమాండ్లకు మద్దతుగా నిలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.