టీడీపీ నేతలే ఆశ్యర్యపడేలా.. వైసీపీ నేతలపై ఎమ్మెల్యే బొండా విమర్శలు!!
వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Political Desk | 9 Aug 2026 11:20 AM ISTవైసీపీ కీలక నేతలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మాటలతో విరుచుకుపడుతున్నారు. సాధారణ రాజకీయ విమర్శలు మాదిరిగా కాకుండా వాడు... వీడు.. అంటూ ఏకవచనంతో ఎమ్మెల్యే బొండా చేసిన మాటల దాడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఇలా విరుచుకుపడటం ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. రెండు రోజుల ముందు డీఎస్సీపై వైసీపీ నిర్వహించిన రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద ఉమా సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు హల్ చల్ సృష్టించగా, ఆ మరునాడు వైసీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాశ్ పై ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బొండా ఉమా వైసీపీకి చెందిన నలుగురు నేతలపై పేరుపేరునా మాటల దాడి చేశారని అంటున్నారు. కొన్ని వ్యక్తిగత విమర్శలతో ఎమ్మెల్యే ఉమా ఫైర్ అయిన తీరుపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరానికి చెందిన ముగ్గురు నేతలతోపాటు కాపు నేతగా ఇటీవల తాను వేదిక పంచుకున్న అంబటి రాంబాబుపైనా ఎమ్మెల్యే ఉమా దూషణలకు దిగడం చర్చనీయాంశం అవుతోందని అంటున్నారు. ఆకస్మాత్తుగా బొండా ఉమా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
ఇటీవల గుంటూరులో జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన ఎమ్మెల్యే బొండా టీడీపీ అధిష్టానం, కార్యకర్తల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే కాకుండా, పార్టీపై చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఆయనను పిలిపించి అధిష్టానం వివరణ తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీలో తన ఇమేజ్ డ్యామేజ్ అయిందనే భావనకు వచ్చిన ఎమ్మెల్యే బొండా ఉమా నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైసీపీ నేతలపై ఎదురుదాడి మొదలు పెట్టారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా తనను వివాదాస్పదం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నుంచి మొదలుపెట్టి తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన వెలంపల్లి శ్రీనివాసరావుతోపాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా తనకు వారికి ఎలాంటి అవగాహన లేదని, తాను నికార్సైన తెలుగుదేశం సైనికుడిగా చెప్పుకోడానికి ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటికి తన పక్కన కూర్చునే స్థాయి లేదని వ్యాఖ్యానించడమే కాకుండా, రాయలేని భాషలో విమర్శలు గుప్పించడాన్ని పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. ఇక మరో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తనపై ఇటీవల చేసిన విమర్శలను తాజాగా తెరపైకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఉమా పరువు నష్టం కేసు నమోదు చేస్తానని హెచ్చరించడమే కాకుండా, తక్షణం పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఇందులో భాగమే అంటున్నారు.
ఇక మల్లాది విష్ణు వ్యాపారాలు, గతంలో ఆయనకు చెందిన ఒక వ్యాపార సంస్థలో జరిగిన ప్రమాదంపైనా బొండా ఉమా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మల్లాది విష్ణు సామాజికవర్గాన్ని రాజకీయాల్లోకి తీసుకువస్తూ వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా ఎమ్మెల్యే ఉమా తీవ్రంగా ఫైర్ అయ్యారు. మల్లాది విష్ణు సామాజిక వర్గం వారు అలాంటి వ్యాపారాలు చేయొచ్చా.. చికెన్ సీకులు, మటన్ స్టార్టర్స్ విక్రయించవచ్చా? అంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా తాను రాజకీయాల్లోకి రాకముందు బీసెంట్ రోడ్ లో మల్లాది విష్ణు ఏం చేసేవారో తెలుసా అంటూ విమర్శల దాడి కొనసాగించారు. ఇదే రేంజ్ లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పైనా ఎమ్మెల్యే ఉమా ఫైర్ అయ్యారు. దేవినేని అవినాశ్ సరిగా మాట్లాడలేరంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఎమ్మెల్యే ఉమా మాటలదాడి చేయడమే రాజకీయవర్గాలను విస్మయానికి గురిచేస్తోందని అంటున్నారు. ఉన్నట్టుండి ఎమ్మెల్యే బొండా ఫుల్ రీచార్జి కావడానికి కారణాలు ఏమైవుంటాయనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.
