Begin typing your search above and press return to search.

బాధ్యతను బానలో ముంచేసి.. అమెరికాలో బోనాల బారాత్.. తర్వాత పరిస్థితిదీ..

అమెరికాలోని ఇల్లినాయిస్ నాపర్‌విల్లే నగరంలో తాజాగా జరిగిన బోనాల ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.

By:  A.N.Kumar   |   10 Aug 2026 7:45 PM IST
బాధ్యతను బానలో ముంచేసి.. అమెరికాలో బోనాల బారాత్.. తర్వాత పరిస్థితిదీ..
X

మన సంప్రదాయాలను ప్రపంచం నలుమూలలా చాటిచెప్పడం వరకు ఓకే... కానీ వేడుక అయిపోయాక నాసా లెవల్లో చెత్తను వదిలేసి రావడం ఏ రకమైన సంస్కృతో ఎవరికీ అర్థం కావడం లేదు! అమెరికాలోని ఇల్లినాయిస్ నాపర్‌విల్లే నగరంలో తాజాగా జరిగిన బోనాల ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.

మన వాళ్లు అమెరికా వెళ్లినా మన ఊరి మాస్ సంబరాలను మర్చిపోరు. అమ్మవారికి బోనం ఎత్తడం, పోతురాజుల డాన్సులు, డప్పు చప్పుళ్లతో రచ్చ చేయడం వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ అసలు కథ వేడుక ముగిశాక మొదలైంది. సంబరాలు పూర్తయ్యాక ఆ ప్రదేశాన్ని చూస్తే... ఏదో తుఫాను వచ్చి వెళ్లినట్లు తయారైంది. తిన్న విస్తళ్లు, తాగేసి పడేసిన గ్లాసులు, వాడేసిన ప్లేట్లతో ఆ పార్కు కాస్తా అచ్చం మన ఊరి డస్ట్ బిన్‌ను తలపించింది. “సంస్కృతిని కాపాడటంలో చూపించిన ఉత్సాహంలో కనీసం పదో వంతు... ఆ చెత్తను డస్ట్ బిన్‌లో వేయడంలో చూపిస్తే బాగుండేది” అని నెటిజన్లు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

'సెలబ్రేషన్' లోడు... 'సివిక్ సెన్స్' నిల్!

అక్కడితో ఆగితేగా వేడుకల్లో భాగంగా కొందరు మహాశయులు మద్యం మత్తులో ఊగిపోయాడని.. స్థానికులు వచ్చి "అయ్యా.. కాస్త పరిశుభ్రత పాటించండి ఈ చెత్తను ఏరుకోండి" అని దండం పెట్టి వేడుకున్నా కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. "మేము పండుగ చేసుకుంటాం... చెత్తను మీరే శుభ్రం చేసుకోండి" అన్నట్లు కొందరు విద్యార్థులు ఉల్టా రివర్స్ అయ్యారని సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

విదేశాల్లో మన సంస్కృతిని, బోనాలను ప్రచారం చేయడం సంతోషమే! కానీ ఇలాంటి విన్యాసాల వల్ల "భారతీయులకు పరిశుభ్రత అంటే పడదు" అనే ముద్ర వేయించుకోవడం ఎంతవరకు సబబు? పండుగ చేసుకోవడం ఎంత ముందో... కార్యక్రమం అయ్యాక ఆ ప్రదేశాన్ని యథావిధిగా ఉంచడం కూడా అంతే ముఖ్యం..

అమెరికాలో డాలర్లు సంపాదించడం.. అక్కడ సెటిల్ అవ్వడం గొప్పే... కానీ అక్కడ పౌర బాధ్యతలు పాటించకపోతే మన బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుంది. "మన సంస్కృతికి జై కొడదాం... కానీ చెత్తను మాత్రం డస్ట్ బిన్ లోనే వేద్దాం" అనే కనీస జ్ఞానాన్ని ఇకనైనా గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిది.