Begin typing your search above and press return to search.

సీఎం స్టాలిన్, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు!

ఇటీవల కాలంలో విమానాశ్రయాలకు, పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, ఈ-మెయిల్స్ ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   28 July 2025 1:33 PM IST
సీఎం స్టాలిన్, హీరో  విజయ్  ఇంటికి బాంబు బెదిరింపులు!
X

ఇటీవల కాలంలో విమానాశ్రయాలకు, పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, ఈ-మెయిల్స్ ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కొన్ని వందల ఈ-మెయిల్స్, కాల్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిలో బాంబు పెట్టినట్లు కాల్ వచ్చింది. దీంతో.. అధికారులు అప్రమత్తమవ్వగా.. మరో హీరో కమ్ పొలిటీషియన్ ఇంటికీ బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం ఏర్పడింది.

అవును... తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సినిమా హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ నివాసాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో... చెన్నై పోలీసు కంట్రోల్‌ రూమ్‌ కి ఆదివారం తెల్లవారుజామున ఫోన్‌ చేసిన ఓ యువకుడు.. ముఖ్యమంత్రి ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పి, వెంటనే ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు అళ్వార్‌ పేటలో ఉన్న ముఖ్యమంత్రి నివాసంలో బాంబు స్క్వాడ్‌ తో తనిఖీ చేశారు.

ఇదే సమయంలో జాగిలాలనూ రంగంలోకి దింపారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే... ముఖ్యమంత్రి నివాసంలో ఎలాంటి పేలుడు వస్తువులు లభించలేదని.. వచ్చింది ఫేక్ కాల్ అని తెలిపారు! ఈ క్రమంలో... బెదిరింపులకి పాల్పడిన వ్యక్తి పేరు విఘ్నేష్‌ అని గుర్తించిన అధికారులు.. ఫోన్‌ చేసిన నెంబరు ఆధారంగా అరెస్టు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్‌ నివాసంలోనూ బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీంతో తమిళనాడు పోలీసులు పరుగులు తీశారు. స్టాలిన్ నివాసం తో పాటు విజయ్‌ నివాసంలోనూ భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. భద్రతను పెంచారు. అయితే.. వచ్చింది తప్పుడు సమాచారం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

కాగా... గతంలో రజనీకాంత్, అజిత్‌ వంటి స్టార్స్‌ కూడా ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సీఎం స్టాలిన్, టీవీకే విజయ్ నివాసాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత వచ్చిన సమాచారంపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.