Begin typing your search above and press return to search.

పూజ చేస్తున్న వారిపై బాంబుల వర్షం.. బంగ్లాలో ప్రభుత్వం మారినా హిందువులపై ఆగని దాడులు

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా మైనార్టీలైన హిందువులపై దాడులు ఆగడం లేదు.

By:  A.N.Kumar   |   8 March 2026 11:13 PM IST
పూజ చేస్తున్న వారిపై బాంబుల వర్షం.. బంగ్లాలో ప్రభుత్వం మారినా హిందువులపై ఆగని దాడులు
X

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా మైనార్టీలైన హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోమిల్లా జిల్లాలో పూజ నిర్వహిస్తున్న హిందువుల బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులతో దాడి చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. ఒక పూజారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానిక సమాచారం ప్రకారం.. కోమిల్లా ప్రాంతంలోని ఒక ఆలయంలో శనివారం సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న కొంతమంది దుండగులు అకస్మాత్తుగా బాంబులు విసిరి అక్కడి నుంచి పరారయ్యారు. బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం ఉలిక్కిపడింది. అక్కడ ఉన్న భక్తులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ దాడిలో పూజారి కేశవ్ చక్రవర్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ, సామాజిక ఉద్రిక్తతల నేపథ్యంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని అక్కడి మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యకు గురైన ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సంఘటనకు సంబంధించి వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, కొన్ని ప్రాంతాల్లో మతపరమైన ఉద్రిక్తతలు కూడా చెలరేగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో హిందూ దేవాలయాలు, వారి ఇళ్లు, దుకాణాలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గత కొద్ది వారాల్లోనే అనేక ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో దేవాలయాలను ధ్వంసం చేయడం, ఇళ్లకు నిప్పంటించడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు పదుల సంఖ్యలో హిందువులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని మైనారిటీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని, మతపరమైన ఉద్రిక్తతలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

అయితే వరుసగా జరుగుతున్న దాడులతో హిందూ సమాజంలో భయం నెలకొంది. పూజలు, ఉత్సవాలు నిర్వహించడానికే భయపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోమిల్లా ప్రాంతంలో భద్రతను పెంచిన పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.