బొల్లా - రాజకీయ డొల్ల.. పట్టించుకోని నేతలు ..!
అదే సమయంలో అధికార పక్షంపై విమర్శలు గుప్పించడంలోనూ.. ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలోనూ ముందుంటారు.
By: Garuda Media | 20 Nov 2025 5:00 AM ISTఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొల్లా బ్రహ్మనాయుడి రాజకీయం డొల్లగా మారిందా? ఆయన ఊపు.. ఉత్సాహం అంతా అధికారంలో ఉన్నంతవరకేనా? అంటే .. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. వాస్తవానికి పల్నాడులో నాయకులకు ప్రత్యేకత ఉంటుంది. వారు అధికారంలో ఉన్నా..లేకున్నా ప్రజలకు చేరువగా ఉంటారు. అదే సమయంలో అధికార పక్షంపై విమర్శలు గుప్పించడంలోనూ.. ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలోనూ ముందుంటారు.
కానీ.. బొల్లా వైఖరి మాత్రం దీనికి భిన్నంగా మారిందన్న చర్చ వైసీపీలోనే కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన వాయిస్ వినిపించడం లేదు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బొల్లా విరుచుకుపడేవారు. నియోజ కవర్గంలో తానే సర్వం అన్నట్టుగా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తనను విమర్శించిన వారిపై ఆయన కేసులు పెట్టించారు. వైసీపీకి చెందిన వారిని కూడా వదిలి పెట్టకుండా వేధించారన్న విమర్శలు వచ్చినా.. ఆయన పట్టించుకోలేదు. ఇదే ఆయనకు భారీ మైనస్ అయింది.
ఇక, పార్టీ కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా.. సొంత వ్యవహారాల్లో బాగానే చక్రం తిప్పారన్న వాదన కూడా బొల్లా చుట్టూ గిరికీలు చుట్టింది. అయినా.. మనోడు వినిపించుకోలేదని వైసీపీ నాయకులే చెబుతారు. ఇక, పార్టీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. ఒకటి రెండు సార్లు మాత్రమే ఆయన ప్రజల మధ్యకు వచ్చారు. అంతకుమించి వచ్చేందుకు ఆయన చొరవ తీసుకోలేదు. దీనికి కారణం.. ఏంటన్నది వైసీపీలోనే జరుగుతున్న కీలక చర్చ. వైసీపీ హయాంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఒకటి సున్నపు గనులను యథేచ్ఛగా తొవ్వడం. రెండు.. జగనన్న ఇళ్ల కాలనీ కోసం.. తను ముందుగానే తక్కువ ధరలకు కొనుగోలు చేసిన భూములనుఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇవ్వడం. ఈ రెండు కారణాలతో బొల్లా ఇప్పుడు రాజకీయంగా దూకుడు చూపించలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు.. కార్యకర్తలు కూడా తగ్గిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు తమపైనే కేసులు పెట్టించారని బొల్లాపై కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో బొల్లా రాజకీయం డొల్లగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
