సభలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి లొల్లి.. !
బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే. అయితే.. ఆయన ఇతర నాయకులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఆది నుంచి వినిపిస్తున్నదే.
By: Garuda Media | 24 Sept 2025 9:01 PM ISTబొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లి గూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే. అయితే.. ఆయన ఇతర నాయకులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఆది నుంచి వినిపిస్తున్నదే. స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా బొలి శెట్టి వ్యవహారం ఉంది. గతంలోనూ.. ఇప్పుడు కూడా.. ఆయన కూటమి పాలనపైనా.. నాయకులపైన కూ డా విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. టీడీపీ నేతలపై కూడా ఆయన విమర్శలు పెరుగుతున్నాయి. అయితే. ఇది రాజకీయాల్లో బాగానే ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వ పరంగా ముందుకు సాగాలని అనుకున్నప్పుడు.. కొంత మేరకు ఇబ్బంది అయితే ఉంటుంది.
ఈ విషయాన్ని బొలిశెట్టి గ్రహించలేక పోతున్నారా? అనేది చర్చ. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కూటమి సర్కారును ప్రశ్నిస్తున్నారన్న కోణంలో తీవ్ర విమర్శలే గుప్పించారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, ఎక్కడ చూసినా.. గుంతలే కనిపిస్తున్నాయని అన్నారు. అయితే.. ఇక్కడితో కూడా ఆయన ఆగలేదు. ఇంతకు మించి అన్నట్టుగా.. మన కన్నా.. గత ప్రభుత్వమే మంచిది అన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారని నోరు జారారు.
వాస్తవానికి గత ప్రభుత్వంపై ప్రస్తుత నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. అసెంబ్లీలో అయితే.. మరింత ఎక్కువగానే ఇది కనిపిస్తోంది. దీంతో వైసీపీని సభలో ఏకేస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు రాజకీయం గా చర్చకు వచ్చాయి. ఆయన ఉద్దేశం ఏంటి? అన్నట్టుగా టీడీపీ నాయకులు సైతం మొహమొహాలు చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ.. బొలిశెట్టి గతం నుంచి ఇదే తరహాలో విమర్శలు చేయడంపైనా చర్చించుకున్నారు.
ఎందుకీ అసంతృప్తి..!
సహజంగానే నాయకులకుఎమ్మెల్యే కావాలని.. తర్వాత మంత్రి పదవులు దక్కించుకోవాలని ఉంటుంది. అలానే బొలిశెట్టికి కూడా నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఎక్కువగా ఆరాటపడుతున్నారనే వాదన ఉంది. అయితే.. స్థానికంగా టీడీపీ బలంగా ఉండడంతోపాటు.. బీజేపీ కూడా అదేవిధంగా హవా సాగిస్తోంది. దీంతో బొలిశెట్టి తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ పరిణామాలతోనే ఆయన అదుపు తప్పుతున్నా రన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమానికి నాలుగు రోజుల ముందు కూడా.. బొలిశెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కానీ, అప్పట్లోనూ ఆయనను అదుపుచేసే ప్రయత్నం చేయలేదు. ఇక, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
