జనసేన నుంచి తప్పుకున్న బొలిశెట్టి
బొలిశెట్టి సత్యనారాయణ జనసేనలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
By: Satya P | 3 Feb 2026 10:18 PM ISTబొలిశెట్టి సత్యనారాయణ జనసేనలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీనియర్ నేత అయిన బొలిశెట్టి తాను జనసేన పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి లేఖ రాశారు. తనకు ఉన్న పర్యావరణ ఉద్యమ బాధ్యతల వల్ల తాను తప్పుకుంటున్నట్లుగా బొలిశెట్టి పేర్కొనడం విశేషం.
తాత్కాలికమే అంటూ :
తాను జనసేన బాధ్యతల నుంచి తప్పుకోవడం తాత్కాలికమే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను కాలుష్య సమస్యల మీద పోరాడుతూంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన సభ్యుడిగా కొనసాగడం నైతికంగా తప్పు అని భావించి పార్టీకి తాత్కాలికంగా దూరం అవుతున్నట్లుగా ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాలో కాలుష్య సమస్యల మీద 2020 లో బొలిశెట్టి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేనలో పర్యావరణ మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు. ఒక విధంగా తమ పార్టీ అధినేత మీదనే పోరాటం అన్నట్లుగా అవుతుందని భావించే పార్టీకి దూరం జరిగినట్లుగా బొలిశెట్టి చెబుతున్నారు.
కూటమికి ఇబ్బంది అని :
తాను పర్యావరణ సమస్యల గురించి ప్రస్తావిస్తున్నపుడు కూటమికి ఇబ్బంది అవుతుందని భావిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెబుతున్నారు. తాను వేసిన కేసులో ప్రభుత్వం పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతి వాదులుగా ఉన్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. న్యాయ ప్రక్రియ నిష్పాక్షికంగా సాగాలని ఆయన కోరుకుంటున్నారు. అదే విధంగా కూటమిని రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక తాను వేసిన పిల్ లో తుది తీర్పు వచ్చేంత వరకూ పార్టీ బాధ్యతలకి దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే మురుగు నీరు, పారిశ్రామిక కాలుష్యం సమస్యల మీద తన న్యాయ పోరాటం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుందని బొలిశెట్టి చెప్పడం విశేషం.
జనసేన లక్ష్యం కోసం :
తాను పార్టీకి దూరంగా ఉన్నా కూడా జనసేన ఆశయాల సాధన కోసం తన వంతుగా కృషి చేస్తాను అని ఆయన స్పష్టం గా చెబుతున్నారు. ఇక డాక్టర్ రాజేంద్ర సింగ్ వంటి ఎందరో ప్రముఖులతో కలసి తన మన నుడి మన నది పేరిట కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి దూరంగా ఉండడం ఒక నైతిక విరామంగా ఆయన చెప్పారు. రాజకీయాల్లో పారదర్శకత పర్యావరణ హితానికి ఎంతో ముఖ్యమని ఆయన అంటున్నారు.
అసంతృప్తితోనేనా :
ఇదిలా ఉంటే బొలిశెట్టి ఇటీవల ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు. అందులో కూటమిలో జనసేనకు తీరని అన్యాయం జరుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక గత ఇరవై నెలల కాలంలో కూడా జనసేన అధికారంలో ఉన్నా ఏ విధమైన మేలు పెద్దగా పార్టీ నేతలకు క్యాడర్ కి దక్కలేదన్న బాధ ఆయనలో ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక బొలిశెట్టి పార్టీకి దూరం కావడం అన్నది ఆ పార్టీకి ఇబ్బందికరమే అని అంటున్నారు. చూడాలి మరి దీని మీద జనసేన పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో.
