బోయింగ్ విమాన ప్రమాదం.. భారతీయ ఫ్యామిలీకి వందల కోట్లు పరిహారం!
అవును... 2019లో ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ బోయింగ్ విమానం ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 15 Nov 2025 6:00 PM ISTబోయింగ్ విమాన ప్రమాద ఘటనలో ఓ భారతీయ కుటుంబానికి కోర్టులో ఊహించని స్థాయిలో అన్నట్లుగా ఊరట లభించిందనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో.. భారతీయ కుటుంబానికి సుమారు రూ.317 కోట్లు చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు విమాన తయారీ సంస్థను ఆదేశించింది. ఆరేళ్ల పాటు (2019 నుంచి) ఈ న్యాయపోరాటం సాగింది.
అవును... 2019లో ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ బోయింగ్ విమానం ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విమానం ఇథియోపియాలోని బోలే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాల నుంచి డజన్ల కొదీ వ్యాజ్యాలు కోర్టులో దాఖలయ్యాయి.
ఆ ఘటనలో భారతీయ పౌరురాలైన శిఖాగార్గ్ మరణించారు. అప్పుడు ఐక్యరాజ్యసమితిలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న ఆమె.. యూఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబీకి వెళ్తున్నారు. 2019 మార్చిలో ఈ ఘటన జరగగా.. ప్రమాదానికి గురైన విమానం మోడల్ డిజైన్ లో పలు లోపాలు ఉన్నాయని, ప్రమాదాల ప్రజలను హెచ్చరించడంలో విఫలమైందని శిఖ కుటుంబం దావా వేసింది.
వీటిలో శిఖ కుటుంబం వేసిన దావాపై తాజాగా తీర్పు వెలువడింది. పరిహారంతో పాటు అన్ని ఖర్చులు కలిపి ఆమె కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.317 కోట్లు) చెల్లించాలని షికాగోలోని ఫెడరల్ జ్యూరీ తీర్పు ఇచ్చింది.
ఐదు నెలలకు మరో ప్రమాదం!:
2019 మార్చిలో ఈ విమాన ప్రమాద ఘటన జరగ్గా... ఇది జరిగిన ఐదు నెలలకు ముందే ఇండోనేషియాలో మరో విమానం ప్రమాదానికి గురైంది. దీంతో.. బోయింగ్ పై పలు కేసులు దాఖలయ్యాయి. వీటికి సంబంధించిన కేసుల్లో పరిష్కారం ఇచ్చి, చాలా వరకూ బోయింగ్ పరిష్కరించుకుంది. ఈ రెండు వరుస ప్రమాదాల తర్వాత వరల్డ్ వైడ్ గా ఉన్న 737 మ్యాక్స్ విమానాల కార్యకలాపాలను బోయింగ్ నిలిపివేసింది! 2020 డిసెంబర్ లో మళ్లీ కార్యక్రమాలను ప్రారంబించింది.
బోయింగ్ కీలక ప్రకటన!:
ఈ రెండు ప్రమాదాలకు సంబంధించి ఇటీవల ఒక ప్రకటనలో బోయింగ్ స్పందించింది. ఇందులో భాగంగా... రెండు ప్రమాదాలలో మరణించిన 346 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతిపై బోయింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా... ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పూర్తిగా, న్యాయంగా పరిహారం చెల్లించడానికి తాము ముందస్తుగా నిబద్ధతతో ఉన్నామని వెల్లడించింది.
