Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా బ్రిటన్ ఎంపీ కామెంట్లు.. పీఓకే భారత్ లో కలవనుందా?

కశ్మీర్‌ అంశం భారత్‌కు అంతర్గత వ్యవహారమే అని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వచ్చింది.

By:  Tupaki Political Desk   |   5 Jan 2026 3:00 PM IST
ఆసక్తికరంగా బ్రిటన్ ఎంపీ కామెంట్లు.. పీఓకే భారత్ లో కలవనుందా?
X

కశ్మీర్‌ అంశం భారత్‌కు అంతర్గత వ్యవహారమే అని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వచ్చింది. కానీ అదే కశ్మీర్‌పై, అది కూడా పాక్‌ ఆక్రమిత ప్రాంతాలపై, విదేశీ పార్లమెంట్‌ సభ్యుడు నేరుగా భారత్‌కు మద్దతుగా మాట్లాడితే అది సాధారణ వ్యాఖ్యగా ఉండదు. జైపుర్‌ వేదికగా బ్రిటన్‌ ఎంపీ బాక్ బ్లాక్‌మన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అదే స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. ‘పీవోకే సహా మొత్తం జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలి’ అన్న ఆయన మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయమా, లేక అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న దృక్పథానికి సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బ్లాక్‌మన్‌ వ్యాఖ్యల్లో స్పష్టత..

బ్లాక్‌మన్‌ వ్యాఖ్యల్లో స్పష్టత ఉంది.. పాకిస్థాన్‌ జమ్మూ కశ్మీర్‌ను అక్రమంగా ఆక్రమించిందని, అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఈ విషయం తనకు కొత్త కాదని, గతంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని చెప్పారు. ముఖ్యంగా జమ్ము అండ్ కశ్మీర్ అంశంలో పాశ్చాత్య దేశాల నుంచి ఇంత స్పష్టమైన స్వరం రావడం అరుదు. సాధారణంగా ‘ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’ అనే డిప్లొమాటిక్‌ భాష వాడే నేతలు, ఈసారి మాత్రం భారత్‌ వైపు స్పష్టంగా ఉండడం ప్రపంచ వేదికపై చర్చను పెంచింది.

గతంలో చేస్తేనే బాగుండేదన్న ఎంపీ

ఆర్టికల్‌ 370 రద్దు విషయంపై బ్లాక్‌మన్‌ చేసిన వ్యాఖ్యలు మరింత పొలిటికల్ హీట్ పెంచాయి. అది 2019లో కాకుండా, 1990 ప్రారంభంలోనే జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కశ్మీరీ పండితుల వలసలు జరగకముందే ఆ నిర్ణయం తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కేవలం చట్టపరమైన వ్యాఖ్య కాదు.. కశ్మీర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న హింస, వలసలు, భద్రతా సమస్యలపై ఒక విదేశీ నేత చేసిన నైతిక విశ్లేషణగా చూడాలి. పీవోకే అంశంలో ఆయన మరింత కఠినంగా మాట్లాడారు. పాకిస్థాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్)లో పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అది కేవలం భారత్‌కే కాదు, ప్రాంతీయ స్థిరత్వానికే ముప్పు అని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఒక ‘రాజకీయ సాధనం’గా వాడడం ఎంత ప్రమాదకరమో యూరప్‌ కూడా అనుభవించిందని గుర్తు చేస్తూ, పాక్‌ చర్యలు అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఉండాల్సిందేనని బ్లాక్‌మన్‌ సూచించారు. ఇది భారత్‌ చాలాకాలంగా చెబుతున్న వాదనకు అంతర్జాతీయ మద్దతు లభిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

పహెల్గామ్ పై కామెంట్లు..

ఇటీవల పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ‘కశ్మీర్‌లో శాంతి తిరిగి వస్తోంది అనుకున్న సమయంలో ఈ దాడి జరిగింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఉగ్రవాదం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదన్న హెచ్చరికగా ఆయన మాటలు వినిపించాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే కాల్పుల విరమణ ఒప్పందాలే ప్రశ్నార్థకమవుతాయని పాకిస్థాన్‌కు ఆయన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం భారత్‌ వాదన కాదు, అంతర్జాతీయంగా కూడా అదే ఆందోళన ఉందని సూచిస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ వ్యాఖ్యలు అధికారిక బ్రిటన్‌ ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయా? లేదా అన్నది. బ్లాక్‌మన్‌ వ్యక్తిగతంగా భారత్‌కు సానుకూలంగా ఉన్న నేతగా ఇప్పటికే పొందారు. అయినప్పటికీ, ఆయన వంటి పార్లమెంట్‌ సభ్యులు బహిరంగంగా ఇలా మాట్లాడడం బ్రిటన్‌లోనూ రాజకీయ చర్చను రేపే అవకాశం కనిపిస్తుంది. కశ్మీర్‌ అంశం ఇక కేవలం భారత్‌–పాక్‌ మధ్య ద్వైపాక్షిక సమస్యగా మాత్రమే మిగలకపోవచ్చన్న సంకేతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి.

డిప్లొమాటిక్ గా వ్యాఖ్యలు..

భారత్‌ కోణంలో చూస్తే, ఈ వ్యాఖ్యలు డిప్లొమాటిక్‌గా ఉపయోగపడే అవకాశముంది. పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) విషయంలో భారత్‌ ఎప్పటి నుంచో అదే స్థానం తీసుకుంటూ వస్తోంది. కానీ అంతర్జాతీయ వేదికలపై ఈ అంశం సున్నితమైనదే. ఇప్పుడు విదేశీ నేతల నుంచి కూడా అదే స్వరం వినిపించడం న్యూఢిల్లీకి వ్యూహాత్మక బలం ఇస్తుంది. అయితే, అదే సమయంలో భారత్‌ తన సంప్రదాయ దౌత్య విధానాన్ని కొనసాగిస్తూ.., ఈ అంశాన్ని భావోద్వేగాలకన్నా స్థిరమైన వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చివరికి బ్లాక్‌మన్‌ వ్యాఖ్యలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. కశ్మీర్‌ అంశం ప్రపంచ రాజకీయాల్లో మళ్లీ చర్చకు వస్తోంది. ఉగ్రవాదం, సరిహద్దు భద్రత, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలు కలిసొచ్చినప్పుడు, అంతర్జాతీయ స్వరాలు కూడా మారతాయి. ఈ మార్పు భారత్‌కు ఎంతవరకు ప్రయోజనకరంగా మారుతుందన్నది, ఇప్పుడు న్యూఢిల్లీ తీసుకునే రాజకీయ–దౌత్య నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.