ఆ కార్ల యజమానులకు కీలక సూచన.. బయటే పార్క్ చేయాలి!
అందుకు గల కీలక కారణం... స్టార్టర్ లో సమస్య కారణంగా షార్ట్ సర్క్యూట్ వచ్చి మంటలు చెలరేగే ప్రమాదం ఉందట. ఈ నేపథ్యంలోనే అధికారులు తాజా అలర్ట్ జారీ చేశారు.
By: Raja Ch | 29 Sept 2025 8:00 AM ISTసాధారణంగా కార్లు కొన్నవారు అపార్ట్మెంట్ లో అయితే సెల్లార్ లో, ఇళ్లు ఉంటే కాంపౌండ్ లో, ప్లేస్ లేని వారు ఇంటి ముందు రోడ్డు పక్కన పార్క్ చేసుకోవడం సహజం! అయితే... తాజాగా ఓ కార్ల యజమానులకు మాత్రం ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇందులో భాగంగా.. ఆ మోడల్ కార్లను ఇంటి బయటే పార్క్ చేయాలని సూచించింది. అందుకు కారణం ఏమిటనేది ఇప్పుడు చూద్దామ్..!
అవును... ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కార్లకు సంబంధించి అమెరికన్ యజమానులకు అక్కడి జాతీయ రహదారుల ట్రాఫిక్ భద్రతా విభాగం (ఎన్.హెచ్.టి.ఎస్.ఏ) కీలక సూచన చేసింది. ఇందులో భాగంగా... ఈ కార్లను గ్యారేజీల్లో పార్కింగ్ చేయొద్దని, వాటిని ఇంటి బయట లేదా నివాసానికి దూరంగా పార్కింగ్ చేసుకోవాలని సుమారు 2 లక్షల మంది యజమానులకు సూచించింది.
అందుకు గల కీలక కారణం... స్టార్టర్ లో సమస్య కారణంగా షార్ట్ సర్క్యూట్ వచ్చి మంటలు చెలరేగే ప్రమాదం ఉందట. ఈ నేపథ్యంలోనే అధికారులు తాజా అలర్ట్ జారీ చేశారు.
వాస్తవానికి అమెరికాలో 2019-22 మధ్య కాలంలో తయారైన కొన్ని వాహనాల ఇంజిన్ లో స్టార్టర్ రిలే తుప్పు పట్టి విపరీతంగా వేడెక్కే అవకాశం ఉందని.. తద్వారా షార్ట్ సర్క్యూట్ కు కారణమయ్యే ప్రమాదం ఉందని బీఎండబ్ల్యూ గుర్తించింది. దీంతో.. సుమారు 1,96,355 కార్లను ఆ సంస్థ రీకాల్ చేస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన బీఎండబ్ల్యూ సంస్థ.. ఆ కార్ల స్టార్టర్ లను డీలర్లు ఉచితంగా మారుస్తారని, విడిభాగాల లభ్యత కారణంగా ఈ ప్రక్రియ దశలవారీగా కొనసాగనుందని తెలిపింది. ఈ సందర్భంగా... ఏయే మోడల్ వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయనే విషయాన్ని ఎన్.హెచ్.టీ.ఎస్.ఏ వెబ్ సైట్ లోనూ తెలుసుకోవచ్చని తెలిపింది.
