Begin typing your search above and press return to search.

బ్లేడ్ ని కడుపులో పెట్టేసి కుట్టేసి...ఇదేంట్రా బాబూ...!

ఇదిలా ఉండగా ఏపీలోని కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడును లోపలే పెట్టి కుట్టేసిన ఘటన వెలుగు చూసింది.

By:  Satya P   |   1 Dec 2025 5:00 AM IST
బ్లేడ్ ని కడుపులో పెట్టేసి కుట్టేసి...ఇదేంట్రా బాబూ...!
X

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ డైనమిక్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఈ శాఖ బాధ్యతలు తీసుకున్నాక ఏపీ అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. తమ శాఖకు సంబంధించి కేంద్రం నుంచి కూడా నిధులను తీసుకుని వస్తున్నారు. ఉద్ధానం వంటి చోట్ల కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అన్న దాని మీద ఏకంగా నిపుణులు అయిన వైద్య బృందం తో పరిశోధనలు కూడా చేయిస్తున్నారు. ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ మరింత మెరుగుపడాలని ఆయన చూస్తున్నారు. అయితే ఆయనకు వ్యవస్థలో సరిగ్గా సహకరించని తీరు అయితే కొంత కనిపిస్తోంది. దానికి విశాఖ కేజీహెచ్ ఒక ఉదాహారణగా ఉంది. అలాగే కొన్ని చోట్ల ఇంకా అలసత్వంలో ఉన్న అధికార యంత్రాంగం. దాంతో మూడవ కన్ను తెరిస్తే తప్ప ఇవన్నీ సర్దుకోవని అంటున్నారు.

సర్జికల్ బ్లేడు లోపలే ఉంచి శస్త్రచికిత్స :

ఇదిలా ఉండగా ఏపీలోని కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడును లోపలే పెట్టి కుట్టేసిన ఘటన వెలుగు చూసింది. ఆర్థోపెడిక్ వైద్యుడుతో పాటు స్టాఫ్ నర్సు దీనికి కారకులు అని తేలడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారిని సస్పెండ్ చేసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు సస్పెండ్ ఉత్తర్వులు జారీచేశారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స ద్వారా స్టీలు రాడ్డు వేయించుకున్నాడు. ఆ మీదట నొప్పిగా ఎక్కువగా ఉందని ఆసుపత్రికి వచ్చాడు. దాంతో తుని ఆసుపత్రి వైద్యుడు అతని స్టీల్ రాడ్డులో స్క్రూను ఈ నెల 27న తొలగించారు. అయితే శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించిన సర్జికల్ బ్లేడును అలాగే లోపలే ఉంచి కుట్లు వేశారు. దాంతో యువకుడికి మళ్ళీ నొప్పి ఎక్కువైంది.

ఎక్స్ రే ద్వారా తేలింది :

అయితే తన కడుపులో బ్లేడ్ ఉన్నట్లుగా ఎక్స్ రేలో తేలింది. దీంతో ఈ వార్త వెలుగు చూడడంతో విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మీద విచారణ జరిపి నివేదించాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగాన్ని ఆదేశించారు. ఈ మేరకు అయన విచారణ జరిపించారు. తద్వారా వైద్యుడు స్టాఫ్ నర్సు శస్త్రచికిత్స సమయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు తేలింది అని నివేదిక వచ్చింది. ఈ క్రమంలో వారి మీద సస్పెన్షన్ వేటు పడింది.

అలక్ష్యాన్ని సహించను :

ఇక మీదట విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి సత్య కుమార్ యాదవ్ హెచ్చరించారు. |ఇదిలా ఉంటే విశాఖ కేజీహెచ్ లో కూడా వరస తప్పులు జరుగుతున్నాయని వాటి మీద మంత్రి సీరియస్ గా దృష్టి సారించాలని అంతా కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడి కోట్లాదిమంది ప్రజానీకం ఉన్నారని అంటున్నారు.