Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ తో పొత్తుపై బీజేపీ క్లారిటీ: 'తండ్రీకొడుకుల మభ్యపెట్టే రాజకీయాలు'.. అసలు గుట్టు విప్పిన కమలం నేతలు!

తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న 'చీకటి పొత్తు'ల ప్రచారానికి బీజేపీ నేతలు తెరదించే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Political Desk   |   9 March 2026 1:53 PM IST
బీఆర్ఎస్ తో పొత్తుపై బీజేపీ క్లారిటీ: తండ్రీకొడుకుల మభ్యపెట్టే రాజకీయాలు.. అసలు గుట్టు విప్పిన కమలం నేతలు!
X

తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న 'చీకటి పొత్తు'ల ప్రచారానికి బీజేపీ నేతలు తెరదించే ప్రయత్నం చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలను పెద్దగా ఖండించని బీజేపీ, ఇప్పుడు ఒక్కసారిగా గొంతు సవరించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ నేతల్లో అయోమయం

బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత సంక్షోభంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కుటుంబ పాలన కోసమా లేక కాళేశ్వరం అవినీతి కోసమా.. అసలు దేనికోసం బీఆర్ఎస్ లో ఉండాలి?’ అన్న భావన ఆ పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయిందని విశ్లేషించారు. అందుకే ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఇలా తమ పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను ఆపుకోవడానికి, తమ 'మంద'ను కాపాడుకోవడం కోసం కేసీఆర్, కేటీఆర్ లు ఒక కొత్త ప్రచారానికి తెరలేపారని ఆయన ఆరోపించారు. ‘మేము బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాం, కాబట్టి మీరెవరూ పార్టీ వీడొద్దు, బీఆర్ఎస్ లోనే ఉండండి’ అని తండ్రీకొడుకులు తమ పార్టీ నేతలను మభ్యపెడుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే బీజేపీతో పొత్తు పేరుతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని, అందుకే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

విచ్ఛిన్నం భయమే కారణమా?

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.., బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం, కీలక నేతలు బీజేపీ వైపు చూస్తుండడంతో కేసీఆర్ లో ఆందోళన మొదలైంది. పార్టీ విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే కేడర్ లో నైతిక బలాన్ని నింపాలి, అందుకే బీజేపీతో తాము టచ్ లో ఉన్నామనే సంకేతాలను కేసీఆర్ ఇస్తున్నారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ఈ ప్రయత్నాలను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది, అందుకే ఏ స్థాయిలోనూ పొత్తు ఉండదనే విషయాన్ని గట్టిగా నొక్కి చెబుతోంది.

అవకాశం మాదే.. రామచందర్ రావు ధీమా!

మరోవైపు రామచందర్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే రెండు సార్లు బీఆర్ఎస్ కు, ఒకసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారని, కాబట్టి ఈ సారి కచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఇస్తారని జోస్యం చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీకి ధారాదత్తం చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలు తమ వైపే ఉన్నారని, భవిష్యత్తు బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ నేతల ఈ తాజా ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ కు కొంత వరకు తెరపడినట్లు అనిపిస్తోంది. బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న ప్రచారాన్ని బీజేపీ గట్టిగా తిప్పికొట్టడం ద్వారా, రాబోయే రోజుల్లో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామనే సంకేతాన్ని ఇచ్చింది. అటు తమ పార్టీ నేతలు జారిపోకుండా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, ఇటు తమ బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ మధ్య ఈ పోరు రానున్న ఎన్నికల్లో ఎటు దారితీస్తుందో చూడాలి.