Begin typing your search above and press return to search.

కేంద్రంలో మరో బెర్త్...పవన్ డెసిషన్ కీలకం

బీహార్ ఎన్నికలు ముగిసాయి. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా పాలించబోతున్నారు

By:  Satya P   |   20 Nov 2025 11:00 AM IST
కేంద్రంలో మరో బెర్త్...పవన్ డెసిషన్ కీలకం
X

బీహార్ ఎన్నికలు ముగిసాయి. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా పాలించబోతున్నారు. ఇక వచ్చే ఏడాదే దేశంలో ఎన్నికలు ఉన్నాయి. అవి కూడా ఒకటి కాదు ఏకంగా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలలో ఒక్క అసోం తప్ప మిగిలిన మూడూ బీజేపీకి బద్ధ వ్యతిరేకమైన ఇండియా కూటమి పార్టీల ఏలుబడిలో ఉన్నవే. అందుకే బీహార్ ఎన్నికలు పూర్తి అవుతూనే మోడీ అమిత్ షా ఇద్దరూ ఈ నాలుగు రాష్ట్రాల మీద ఫుల్ ఫోకస్ పెట్టేసారు అని ప్రచారం సాగుతోంది.

మార్పులు చేర్పులు :

ఇక బీహార్ లో మంత్రివర్గం కూర్పుని చూసుకుని అక్కడ నుంచి కూడా కొందరికి కేంద్రంలో చోటు కల్పించాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే విధంగా తమిళనాడు నుంచి రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి కేంద్ర కేబినెట్ లో బెర్త్ ఖాయమని ప్రచారం సాగుతోంది. ఆయనకు అధికారం ఇస్తే డీఎంకే సర్కార్ మీద మరింత దూకుడు చేస్తారు అని అది వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎన్డీయే కూటమికి ఎంతో ఉపయోగపడుతుందని కమలనాధులు భావిస్తున్నారు.

బెంగాల్ టార్గెట్ :

అదే విధంగా బెంగాల్ ని ఈసారి గట్టిగా టార్గెట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది మేలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి. చూస్తే సమయం గట్టిగా ఆరు నెలలు లేదు, దాంతో అక్కడ నుంచి కూడా ఒకరిద్దరు గట్టి నేతలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి మమతా బెనర్జీ సర్కార్ మీద రాజకీయ యుద్ధం చేయించాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది అని అంటున్నారు. ఇక కేరళలో బీజేపీకి ఒక్కరే ఎంపీ ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేశారు. కానీ సురేష్ గోపీ పదవి వద్దు అని అంటున్నారు. దీంతో రాజ్యసభ సీట్లు రానున్న కాలంలో బీజేపీకి వచ్చేవి చూసుకుని అక్కడ నుంచి మరో కీలక నేతకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం ద్వారా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలని పక్కా ప్లాన్ లో బీజేపీ ఉందని అంటున్నారు.

అసోం లో రిపీట్ :

అసోం లో బీజేపీకి ముఖ్యమంత్రి శర్మ రూపంలో గట్టి నేత సీఎం గా ఉన్నారు. మరోసారి అక్కడ నుంచి గెలవాలని బీజేపీ చూస్తోంది. దాంతో అసోం లో కూడా కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నది ఆలోచనగా చెబుతున్నారు. వీటితో పాటు దేశంలో మిగిలిన రాష్ట్రాలలో అవసరాలకు తగినట్లుగా మార్పులు చేస్తారు అని అంటున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే మరో బెర్త్ ఇవ్వడానికి మోడీ సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఇదంతా మిత్రులను మంచి చేసుకునేందుకే అని చెబుతున్నారు అయితే ఆ బెర్త్ ఎవరికి దక్కుతుంది అన్నదే చర్చగా ఉంది.

కోటా జనసేనదే :

ఏపీ నుంచి బీజేపీకి ఒకరు, టీడీపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి ఒక్కరూ లేరు, ఆ పార్టీకి లోక్ సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు అందులో సీనియర్ నేతగా వల్లభనేని బాలశౌరి ఉన్నారు. చాన్స్ అంటూ దక్కితే ఆయనకే అని అంటున్నారు. అయితే కోస్తా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. గోదావరి జిల్లాల నుంచి బీజేపీ తరఫున శ్రీనివాసవర్మ ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సో ఈసారి చాన్స్ రాయలసీమకు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. జనసేన కోటా వాటాగా ఏపీ కేబినెట్ లో నాగబాబుని తీసుకుని టీడీపీ నుంచి సీమ ప్రాంతానికి చెందిన వారిని ఎంపిక చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.