Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ టార్గెట్ అక్కడే !

ఏపీలో బీజేపీ తన బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా అధికారం ఉండగానే పార్టీని బలోపేతం చేసుకోవాలి.

By:  Satya P   |   20 Dec 2025 9:16 AM IST
ఏపీ బీజేపీ టార్గెట్ అక్కడే !
X

ఏపీలో బీజేపీ తన బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా అధికారం ఉండగానే పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఈ విషయంలో గతంలో సంగతి ఎలా ఉన్నా ఇపుడు మాత్రం జాతీయ నాయకత్వం నిర్దేశకత్వంతో బీజేపీ అడుగులు ముందుకు వేస్తోంది. ఏపీలో బీజేపీ 2024 ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యేలను మూడు ఎంపీలను గెలుచుకుంది. ఇక ఒక ఎమ్మెల్సీ పదవితో పాటు కొన్ని నామినేటెడ్ పోస్టులను ఆ పార్టీకి కూటమిలో పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించింది. అలాగే రెండు రాజ్యసభ సీట్లు లభించాయి. 2026 లో మరో సీటు కూడా దక్కబోతోంది. అయితే బీజేపీకి లభించిన ఈ విజయాలు కానీ పదవులు కానీ పొత్తు వల్లనే అన్నది వారితో పాటు అందరికీ తెలిసిందే.

ఓటు షేర్ చూస్తే :

బీజేపీ 2014 లో టీడీపీతో కలసి నాలుగు ఎంపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. కానీ 2019 లో ఒంటరిగా పోటీ చేసే సరికి ఓటు షేర్ ఒక్క శాతం కంటే పెద్దగా రాలేదు. 2024లో అదే పరిస్థితి ఉంటుందని భావించడం వల్లనే పొత్తులకు దిగింది అని చెబుతారు. ఓట్ల షేరింగ్ బాగా జరిగి ఉండడం వల్ల కమలం కలలు పండాయి. ఇంతకీ ఏపీలో బీజేపీకి పట్టున్న ప్రాంతం ఏదీ ఏ జిల్లాలో ఎంత బలం ఉంది అంటే ఈ రోజుకీ ఇదమిద్ధంగా చెప్పలేని పరిస్థితి ఉంది. పట్టణ ప్రాంతంలో కొన్ని వర్గాలలో బీజేపీ పట్ల అభిమానం ఉంది అన్నది మాట. అయితే ఆ ఓట్లు కూడా ఇపుడు ఇతర పార్టీలకు వెళ్తున్నాయా అన్న చర్చ కూడా ఉంది. దాంతో బీజేపీ గతంలో తమ పట్ల అభిమానం ఉన్న వారిని ఆకర్షించడమే కాకుండా ఎంతో కొంత కొత్త ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తోంది.

శతజయంతి సాక్షిగా :

ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత దివంగత ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా తటస్థ జనాలను విద్యావంతులను పట్టణ ప్రాంత వాసులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. దీంతో వాజ్ పేయి శత జయంతి పేరిట యాత్ర అనంతపురం నుంచి ప్రారంభం అయింది. ఉత్తరాంధ్రాలో ఈ నెల 20 నుంచి కొనసాగుతోంది. శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖ దాకా సాగనుంది. అలాగే గోదావరి జిల్లాలు క్రిష్ణా గుంటూరు లో కూడా ఈ యాత్ర నిర్వహించి 25న అమరావతిలో భారీ బహిరంగ సభ నిరహించడం ద్వారా ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు అని అంటున్నారు.

వాజ్ పేయి ఇమేజ్ తో :

వాజ్ పేయి అంటే చాలా మందికి అభిమానం ఉంది. దాంతో ఆయన విగ్రహాలను ఏపీలో ఊరూ వాడా ఏర్పాటు చేయడం ఆయన పాలన గురించి చాటి చెప్పడం పనిలో పనిగా మోడీ పాలన గురించి కూడా వివరించడం ద్వారా బీజేపీ పట్ల జనంలో మద్దతుని పొందేలా ఏపీ నాయకులు ఒక వ్యూహరచన చేశారు. దీనికి కేంద్ర మంత్రులను బీజేపీకి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకుని వస్తున్నారు. అలాగే పార్టీ జాతీయ నాయకులను కూడా ఏపీకి తీసుకుని వస్తూ బీజేపీ మోడీ నాయకత్వంలో అంతకు ముందు వాజ్ పేయి ఏలుబడిలో ఏమి చేసింది అన్నది వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

స్థానిక టార్గెట్ :

వచ్చే ఏడాది ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని బీజేపీ తనదైన శైలిలో కార్యాచరణను రూపొందిస్తోంది. ఎక్కువ సీట్లను తాము తీసుకోవడం ద్వారా గ్రౌండ్ లెవెల్ లో బలపడితే అది 2029 ఎన్నికల వేళకు ఉపయోగపడుతుందని అపుడు ఏకంగా 20 సీట్ల దాకా పొత్తులో భాగంగా తీసుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీకి మాస్ ఇమేజ్ తో కూడిన నాయకత్వం క్రౌడ్ పుల్లర్ గా ఉండే లీడర్ షిప్ అవసరం ఉందని అంటున్నారు. ఏపీలో చూస్తే టీడీపీ జనసేన వైసీపీకి ఆ రకమైన లీడర్ షిప్ ఉందని బీజేపీ మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి నేతలను తెస్తోంది కానీ తాము దూకుడుగా రాజకీయం చేస్తే మాస్ ఇమేజ్ ని పెంచుకుంటే తప్పకుండా జనాలు చూసే వీలు ఉంటుందని అంటున్నారు. అపుడే వాజ్ పేయి దీవిస్తారు మోడీ బలం కూడా జత కూడుతుందని అంటున్నారు.