బీజేపీ ఎమర్జ్... సీనియర్ మోస్ట్‌ల 'సైద్ధాంతిక' సందేశం.. !
బీజేపీ ఏపీలో పుంజుకుంటుందా? అంటే.. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా కూటమితో బంధాన్ని కొనసాగిస్తున్నంత కాలం కమల నాథులకు ఇబ్బందులు లేవు.
By: Garuda Media | 5 Dec 2025 8:00 AM ISTబీజేపీ ఏపీలో పుంజుకుంటుందా? అంటే.. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా కూటమితో బంధాన్ని కొనసాగిస్తున్నంత కాలం కమల నాథులకు ఇబ్బందులు లేవు. ఉండవు. అన్నో ఇన్నోసీట్లను కూడా గెలుచుకుంటున్నారు. అయితే.. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా అతిరథులు అనదగిన నాయకులు.. భేటీ అయ్యారు. కార్యక్రమం పేరు ఏదైనా... వారి ఆలోచనలు పార్టీ ఎమర్జ్‌పైనే ఉన్నాయి.
``బీజేపీని ఒంటరిగా ముందుకు తీసుకువెళ్లడంపై దృష్టి పెట్టండి!`` అని ఓ సీనియర్ మోస్ట్ నాయకుడు వ్యాఖ్యానించారు. ఆయన గతంలో రాజ్యాంగ బద్ధమైన పదవిని కూడా చేశారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన మరో సీనియర్ నాయకుడు కూడా.. దాదాపు ఇదే వాదన చేశారు. పార్టీపరంగా ఒంటరిగా పుంజుకు నేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారు. అప్పుడే.. పార్టీకి ఒక దశ-దిశ ఉంటాయని కూడా చెప్పుకొచ్చా రు. ఇలా.. సీనియర్ మోస్టులు సూచించారు.
సహజంగానే ఒక పార్టీ పుంజుకోవడం తప్పుకాదు. పుంజుకోవాలని అనుకోవడమూ తప్పుకాదు. కానీ, దానికి ప్రాతిపదిక ఏంటి? అనేది ప్రశ్న. ఇప్పటికి పది సంవత్సరాలుగా తెలంగాణలో బీజేపీ ఒంటరిపోరు చేస్తు న్నా.. అక్కడ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. అధికారంలో వస్తామన్న ప్రతిసారీ.. పార్టీ వెనక్కి మళ్లుతోంది. దీనికి ప్రధాన కారణం.. ఐక్యత లోపించడం.. పార్టీపరమైన సిద్ధాంతం రాద్ధాంతం కావడమే. ఈ విషయం కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ భిన్నమైన వాదనలు, సెంటిమెంట్లు, కులాల రాజకీయాలకు పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో బీజేపీ పుంజుకోవడం అనేది సాధ్యమేనా? అది కూడా ఒంటరిగా అనేది ముఖ్య ప్రశ్న. ఇక, ఈ సీనియర్ మోస్టులు చెబుతున్న లెక్కల ప్రకారం.. ఎవరి భుజాలపైనో ఎక్కి.. తమ ఎత్తును చెప్పుకొనే విధంగా ఉంది!. ప్రస్తుతం కూటమిలో ఉండి.. ఒంటరిగా పార్టీని డెవలప్ చేసుకోవాలన్నది సూత్రీకరణ.
కానీ, ఇది ఏమేరకు సక్సెస్ అవుతుంది? అసలు ఎవరు చేస్తారు? ప్రజలు ఏమేరకు స్వాగతిస్తారు? అనేది సమాధానం లేని ప్రశ్నలు. మొత్తంగా.. ఒక వ్యూహమైతే.. వేస్తున్నారన్నది స్పష్టమవుతోంది.
