బీహార్ ఎన్నికలు : భారీ షాక్ ఇవ్వబోతున్న బీజేపీ
అక్కడ కూడా విధేయత గెలుపు గుర్రాలు అన్న రెండు ప్రమాణాలు తప్ప మరో దానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వరాదని చెబుతున్నారు.
By: Satya P | 26 Sept 2025 6:00 PM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఇపుడు అతి పెద్ద పరీక్ష అన్నది తెలిసిందే. ఎందుకంటే 2024 లోక్ సభ ఎన్నికల తరువాత వరుసగా హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ అసెంబ్లీలను బీజేపీ మిత్రులు కలసి గెలుచుకున్నాయి. అదే ఊపులో ఇపుడు బీహార్ ని కూడా గెలవాల్సి ఉంది. పైగా 2024లో తగ్గిన సీట్ల కోత కి చెక్ పెట్టి హిందీ బెల్ట్ లో కాషాయ హవా ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేసుకోవాల్సి ఉంది. దాని కోసం బీజేపీ చేయాల్సింది అంతా చేస్తోంది అని అంటున్నారు.
ఆపరేషన్ స్టార్ట్ :
బీహార్ ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయి. ఇక అభ్యర్థుల ఎంపిక మీద బీజేపీ అపుడే ఫోకస్ పెట్టేసింది. 2020లో జేడీయూ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే 80 అసెంబ్లీ సీట్లు బీజేపీకి దక్కాయి. ఇపుడు ఆ సంఖ్యను మరింతగా పెంచుకోవాలన్నది బీజేపీ ఆలోచన. ఎందుకు అంటే ఈసారి బీహార్ పీఠం మీదనే బీజేపీ నేరుగా గురి పెట్టేసింది. త్యాగాలను పక్కన పెట్టి బీహార్ సీఎం అయిపోవాలని చూస్తోంది. దానికి అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే బీజేపీ మాట నెగ్గుతుంది దాంతో బీహార్ ఆపరేషన్ ని బీజేపీ స్టార్ట్ చేసింది అని అంటున్నారు.
వారిక ఇంటికే :
బీహార్ లో ఈసారి అన్ని విషయాలు ఆలోచించి టికెట్లు అభ్యర్ధులకు ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఒడ్డున పడిన వారికి ఈసారి టికెట్ కట్ అని అంటోంది. అలాగే 70 ఏళ్ళు నిండిన వారిని పార్టీలో నియోజకవర్గంలో అంతగా పాపులారిటీ లేని వారిని కూడా సైడ్ చేయాలని అనుకుంటోంది. అదే విధంగా గెలుపు డౌట్ అని కనుక తెలిస్తే ఇక రెండవ ఆలోచన లేకుండా టికెట్ ని నిరాకరించాలని చూస్తోంది అని అంటున్నారు. అంతే కాదు ఈసారి ఎన్నికలు హోరా హోరీగా జరగబోతున్నాయి. ఇండియా కూటమి కూడా గట్టిగానే ఉంది. రేపటి రోజున మెజారిటీ దగ్గర నంబర్ గేం కనుక స్టార్ట్ అయితే విధేయత అన్నది చాలా ముఖ్యం. దాంతో పార్టీకి ఎవరైతే విధేయతగా ఉంటారో వారికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది అని అంటున్నారు.
లాబీయింగ్ వద్దంటూ :
ఈసారి అభ్యర్ధులను జిల్లా స్థాయి నుంచి జాబితాలను కోరడం ద్వారా రాష్ట్ర జాతీయ నాయకత్వం తీసుకుంటుంది. అక్కడ కూడా విధేయత గెలుపు గుర్రాలు అన్న రెండు ప్రమాణాలు తప్ప మరో దానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వరాదని చెబుతున్నారు. అంతే కాదు అన్ని రకాలుగా జిల్లా నేతలతో అభిప్రాయ సేకరణ జరిపి మాత్రమే లిస్ట్ ని తీసుకుంటారు అంటున్నారు. ఈ ప్రక్రియలో ఆశావహులని దూరంగా ఉంచాలని చూస్తున్నారు. ఇక ప్రతీ నియోజకవర్గం నుంచి అయిదు నుంచి ఏడుగురు వంతున ఆశావహుల పేర్లను బలమైన అభ్యర్ధులుగా తీసుకుంటారు అని అంటున్నారు. ఆ మీదట అనేక వడపోతల అనంతరం తుది ఎంపిక ఉండొచ్చు అని చెబుతున్నారు.
బీజేపీ నంబర్ ఇదే :
ఇక జేడీయూతో పొత్తుతో బరిలోకి దిగుతున్న బీజేపీ మొత్తం 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో 103 సీట్లకు తాను స్వయంగా పోటీ చేయాలని చూస్తోంది. అంటే మిగిలిన 130 సీ ట్లనే మిత్రులకు వదిలేస్తుంది అన్న మాట. గతసారి కుటుంబ సభ్యులకు పలుకుబడి ఉంటే చాలు అనుకున్న వారికి టికెట్లు ఇచ్చింది కానీ ఈసారి కుటుంబ సభ్యులకు నో టికెట్ అని చెబుతోంది. దాంతో బీజేపీ లెక్క కూడా పక్కాగా ఉండబోతోంది. ఇదంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఆయన పర్యవేక్షణలో జరగబోతోంది అని అంటున్నారు.
వారికి భారీ షాక్ :
బీజేపీ ఎంచుకున్న ప్రమాణాలు వేసుకున్న లెక్కలు తీసుకున్న కొలతలు అన్నీ చూస్తే కనుక పెద్ద ఎత్తున సిట్టింగుల సీట్లకు కోత పడుతోంది అని అంటున్నారు. మొత్తం 80 మందిలో సగానికి సగం మందికి టికెట్లు దక్కకపోవచ్చు అని అంటున్నారు. అదే జరిగితే భారీ ప్రక్షాళన దిశగానే బీజేపీ వెళ్తోంది అని అంటున్నారు. అయితే అంత మందికి నో టికెట్ అంటే అసలుకే ఎసరు వస్తుంది అనుకుంటే గరిష్టంగా 20 మంది దాకా అయినా టికెట్లు కోల్పోవచ్చు అని అంటున్నారు.
