Begin typing your search above and press return to search.

బీజేపీ ముద్రతో ఈసీ లేఖ.. కేరళలో కలకలం

ఈ లేఖపై బీజేపీ ముద్రను చూసిన రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంచేస్తూ ఎన్నికల సంఘం పనితీరును ఎండగడుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   24 March 2026 4:29 PM IST
బీజేపీ ముద్రతో ఈసీ లేఖ.. కేరళలో కలకలం
X

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలకు మేలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా కేరళలో ఓ ఘటన వెలుగు చూసింది. బీజేపీ ఎన్నికల గుర్తు ఉన్న రబ్బర్ స్టాంపుతో ఎన్నికల నిబంధనలను వివరిస్తూ రాష్ట్రంలోని పార్టీలకు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల సంఘం అధికారిక లేఖపై ఓ పార్టీ గుర్తు ఉండటాన్ని చూసిన ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఫైర్ అయ్యాయి.

కేరళలో ఎన్నికల కమిషన్ పత్రాలపై బీజేపీ కేరళ యూనిట్ సీలు కనిపించడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని ఈసీ "క్లరికల్ ఎర్రర్" అని కొట్టిపారేసినప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం తేలిగ్గా తీసుకోలేమని ఖరాఖండీగా తేల్చుచెబుతున్నాయి. ఈసీ పక్షపాత ధోరణికి ఇది నిదర్శనమంటూ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం లేఖపై బీజేపీ ముద్ర ఉండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అభ్యర్థుల నేర చరిత్ర, ఎన్నికల ప్రచార నిబంధనలు వివరిస్తూ ఈసీ రాజకీయ పార్టీలకు లేఖ రాసింది.

ఈ లేఖపై బీజేపీ ముద్రను చూసిన రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంచేస్తూ ఎన్నికల సంఘం పనితీరును ఎండగడుతున్నాయి. సీపీఎం కేరళశాఖ సోషల్ మీడియా వేదికగా బీజేపీ ముద్ర ఉన్న ఎన్నికల సంఘం లేఖను పోస్టు చేసి పలు ప్రశ్నలు సంధించింది. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటుందని ఎలా నమ్మగలమని సీపీఎం నిలదీసింది. ఇప్పటికే ఈసీ, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ప్రతిపక్షం కాంగ్రెస్ పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. ఓట్ చోరీ అంటూ బిహార్ లో ఉద్యమించిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అదే అంశాన్ని హైలెట్ చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అధికారిక లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం ఈసీని ఆత్మరక్షణలోకి నెట్టేసిందని అంటున్నారు. అయితే పొరపాటున క్లిరికల్ మిస్టేక్ వల్లే తమ లేఖపై బీజేపీ ముద్ర పడిందని ఈసీ వివరణ ఇస్తోంది. అయితే బీజేపీ మినహా మిగిలిన పార్టీలు ఈసీ వాదనకు విశ్వతనీయత లేదని ఆరోపిస్తున్నాయి. 2019 మార్గదర్శకాలపై వివరణ కోరుతూ కేరళ బీజేపీ శాఖ ఈసీకి లేఖ రాసిందని, ఆ లేఖకు వివరణ ఇస్తూ మిగిలిన పార్టీలకు వాటిని పంపడం వల్లే పొరపాటు జరిగిందని కేరళ ఎన్నికల ప్రధానాధికారి రతన్ యు.కెల్కర్ వివరణ ఇచ్చారు.

ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే మార్చి 21న ఆ లేఖను ఉపసంహరించుకున్నామని, సవరణ ఉత్తర్వులు కూడా జారీ చేశామని సీఈవో తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, ఇలాంటి కార్యాలయ స్థాయి పొరపాట్లను ఆధారంగా చేసుకుని తప్పుదారి పట్టించే ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఙప్తి చేశారు. ఇదిలా ఉండగా, కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల రాజకీయ వేడి మరింత పెరిగింది.