Begin typing your search above and press return to search.

బీజేపీకి ఉత్తరాది బెంగ ...దక్షిణాది లెక్క

ఇప్పటికి చూస్తే సొంతంగా రెండు సార్లు గెలిచి మిత్రుల ఆసరాతో 2024 తరువాత అధికారం చలాయిస్తున్న బీజేపీకి 2029 ఎన్నికలు అంటే ఒక సవాల్ గానే చూస్తున్నారు.

By:  Satya P   |   19 Dec 2025 9:14 AM IST
బీజేపీకి ఉత్తరాది బెంగ ...దక్షిణాది లెక్క
X

భారతీయ జనతా పార్టీ అంటే ఏపీకి చెందిన కొందరు సెటైరికల్ గా ఉత్తరాది జనతా పార్టీ అని అంటూంటారు అంటే బీజేపీ బలం అక్కడే ఉంది అని వారు విమర్శిస్తూంటారు అన్న మాట. నిజం చెప్పాలీ అంటే బీజేపీ బలం అంతా ఉత్తరాదినే ఉంది. ఆ పార్టీ ఎదిగేందుకు దక్షిణాదిన ఎపుడూ పెద్దగా చోటూ లేదు, స్కోపూ కనిపించడం లేదు. అది వాజ్ పేయి అద్వానీ హయాంలో అయినా లేక మోడీ అమిత్ షా సారధ్యంలో అయినా పెద్దగా మాత్రం వర్కౌట్ కావడం లేదు. అయినా అలుపూ సొలుపూ లేని విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ వస్తున్నారు.

జూనియర్ గానే :

బీజేపీకి మొత్తానికి ఒక విషయం అయితే అర్ధం అయింది. దక్షిణాదిన ఇప్పటప్పట్లో తాము అధికారంలోకి వచ్చేంత సీన్ అయితే లేదని, అందుకే 2021 తరువాత అన్నా డీఎంకేతో విభేదించి అన్నామలై అనే ఒక మాజీ పోలీసు అధికారితో కలసి తమిళనాడుతో సొంతంగా బలపడతామని బీజేపీ వేసిన ఎత్తులు అన్నీ 2024 లోక్ సభ ఎన్నికల్లో చిత్తు అయిపోయాయి. దాంతో 2026 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నా డీఎంకేతో కలసి పొత్తుతో ముందుకు వస్తోంది. ఏదో విధంగా పెద్ద పార్టీ అండగా ఉంటేనే జూనియర్ గా అయినా హవా చాటవచ్చు అన్నది బీజేపీ నయా వ్యూహంగా ఉంది.

ఏపీలో అదే థియరీ :

ఏపీలో కూడా చంద్రబాబుని తక్కువ అంచనా వేసి ఆ ప్లేస్ లోకి రావాలని 2014 తరువాత నుంచి బీజేపీ ప్రయత్నాలు చేసింది అని అంటారు. బాబు తరువాత టీడీపీకి నాయకత్వం ఉండదని దాంతో ఆ పార్టీ తగ్గిపోతుందని అలా ఏర్పడిన వ్యాక్యూంలోకి ప్రవేశించి ఏపీ అంతటా విస్తరించవచ్చు అని ప్లాన్ చేసింది. 2019 తరువాత జనసేనతో పొత్తు అందులో భాగమే. పవన్ ని ముందు పెట్టి ఏపీలో థర్డ్ ఫోర్స్ గా ఎదగాలని చూసినా అది కూడా అడియాసనే అయింది. దాంతో 2024 నాటికి టీడీపీ కూటమిలో చేరక తప్పింది కాదు. ఇక 2029 లోనూ టీడీపీతో చేతులు కలిపి ముందుకు సాగాలని బీజేపీ సీరియస్ గానే డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు.

మరోసారి పవర్ లోకి :

బీజేపీకి రాష్ట్రాలు చాలా ముఖ్యమే. కానీ దాని కంటే ఎక్కువగా కేంద్రంలోని అధికారం కూడా ముఖ్యం. ఇప్పటికి చూస్తే సొంతంగా రెండు సార్లు గెలిచి మిత్రుల ఆసరాతో 2024 తరువాత అధికారం చలాయిస్తున్న బీజేపీకి 2029 ఎన్నికలు అంటే ఒక సవాల్ గానే చూస్తున్నారు. అప్పటికి 15 ఏళ్ళ పాలన పూర్తి అవుతుంది. ఎంత కాదనుకున్నా యాంటీ ఇంకెంబెన్సీ పెరిగిపోతుంది. దాంతో ఉత్తరాదిన మళ్ళీ ఇబ్బందులు వస్తాయని సీట్లు ఎంతో కొంత తగ్గుతాయని బీజేపీ వ్యూహకర్తలకు బాగా తెలుసు అని అంటున్నారు. అందుకే దక్షిణాదిన అవసరమైన ఎంపీ సీట్లను గెలుచుకుంటే కనుక మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావచ్చు అన్నది బీజేపీ ఆలోచనగా ఉంది అంటున్నారు.

ఇదీ లెక్క :

తమిళనాడులో అన్నా డీఎంకే పొత్తుతో కనీసం రెండు మూడు సీట్లు సొంతంగా గెలుచుకోవచ్చు అని అంచనా కడుతున్నారు. కేరళలో ఇప్పటికే ఒక ఎంపీ సీటు దక్కింది తాజాగా తిరువనంతపురం కార్పోరేషన్ ని బీజేపీ గెలిచింది. దాంతో కాషాయ బీజం పడినట్లే అని భావిస్తున్నారు. ఈసారి ఎంపీ ఎన్నికల్లో తక్కువలో తక్కువ మూడు నాలుగు సీట్లు గెలుచుకుంటే బాగానే ఉంటుందని భావిస్తున్నారు. కర్ణాటకలో బీజేపీకి మంచి పట్టు ఉంది. 2028లో అధికారంలోకి వస్తామని ధీమా ఉంది పైగా జేడీయూతో పొత్తు ఉంది. దాంతో 2029లో కూడా ఇక్కడ ఉన్న 28 ఎంపీ సీట్లలో పాతికకు తక్కువ కాకుండా ఎంపీ సీట్లు దక్కుతాయని లెక్క వేస్తున్నారు.

దురాలోచనతో :

తెలంగాణాలో ఈసారి 8 ఎంపీ సీట్లు దక్కాయి. వచ్చే ఎన్నికల నాటికి వాటిని కనీసంగా పది చేసుకోవాలని చూస్తున్నారు. ఏపీలో కూడా మూడు గెలిచారు. దానిని ఆరు చేసుకోవాలని భావిస్తున్నారు. ఇలా చూసుకుంతే మొత్తం దక్షిణాది నుంచి సొంతంగా యాభై దాకా ఎంపీ సీట్లు 2029 ఎన్నికల నాటికి గెలుచుకుంటే ఉత్తరాదిన ఆ మేరకు కోత పడినా పూడ్చుకోవచ్చు అన్నది కమలనాధుల స్ట్రాటజీ గా చెబుతున్నారు. ఇక ఎటూ మిత్రులు కూడా అండగా ఉంటారు అన్న దురాలోచనతో 2024 పొత్తులను రిపీట్ చేయడానికి బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది అని అంటున్నారు.