Begin typing your search above and press return to search.

కర్ణాటక కాంగ్రెస్ ను వణికిస్తున్న బీజేపీ !

కర్ణాటకలో ఏ ముహూర్తాన సీఎం సిద్దరామయ్య స్థానంలో డీకె శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో గానీ అన్నీ వివాదాలు, నిరసనలు, అసంతృప్తులు, రాజీనామాలే నెలకొంటున్నాయి.

By:  Garuda Media   |   26 Aug 2026 1:30 PM IST
కర్ణాటక కాంగ్రెస్ ను వణికిస్తున్న బీజేపీ !
X

కర్ణాటకలో ఏ ముహూర్తాన సీఎం సిద్దరామయ్య స్థానంలో డీకె శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో గానీ అన్నీ వివాదాలు, నిరసనలు, అసంతృప్తులు, రాజీనామాలే నెలకొంటున్నాయి. జూన్ 3న డీకె శివకుమార్ సీఎంగా మొదటి దశలో ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరతో సహా 13 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశాడు. బెంగుళూరు డెవలప్ మెంట్ ఫోర్ట్ ఫోలియో ఇస్తానని హామీ ఇచ్చి ఇరిగేషన్ శాఖ ఇచ్చారని సీనియర్ మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశాడు. అనంతరం ఆయనను బుజ్జగించి ఇతర శాఖలను కేటాయించారు.

ఇక ఆహార, పౌరసరఫరాలు ఇచ్చారని మరో మంత్రి మునియప్ప అసంతృప్తి వ్యక్తం చేయగా ఆయన కోరుకున్న సాంఘీక సంక్షేమ శాఖ ఇచ్చారు. అనంతరం రెండు నెలల తరువాత ఈ నెల 3న 19 మంది మంత్రులను కొత్తగా ప్రమాణం చేయించారు. దీంతో మంత్రి పదవి రాలేదని యశ్వంత రాయగౌడ వి.పాటిల్ రాజీనామా లేఖ ఇచ్చారు. ఆయన మద్దతుదారులు నిరసన తెలిపారు.

ఇక మంత్రి పదవి రాలేదని ఎమ్మెల్యే బేలూర్ గోపాలకృష్ణ ఎమ్మెల్యే, కార్పోరేషన్ పదవికి రాజీనామా ప్రకటించాడు. వీరితో పాటు దినేష్ గుండురావు, టీబీ జయచంద్ర, బీకే సంగమేశ్వర, తన్వీర్ సైత్, హెచ్.కె.పాటిల్, లక్ష్మి హెబ్బాల్కర్ తదితరులు రాజీనామా చేస్తామని హెచ్చరికలు చేసిన వారిలో ఉన్నారు. పార్టీలో ఈ వ్యవహారం ఇలా ఉంటే మంత్రి నాగేంద్ర వ్యవహారం డీకేకు తలనొప్పిగా మారింది.

బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర 2023లో షెడ్యూల్డ్ ట్రైబ్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపు వంద కోట్ల నిధులు అక్రమ బదలాయింపు కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పోరేషన్ అధికారి పి.చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకుని తన సూసైడ్ నోట్ లో మంత్రి వత్తిళ్లే అక్రమ బదలాయింపుకు కారణం అని పేర్కొన్నాడు.

దీనిపై సీబీై, ఈడీ, లోకాయుక్త కేసులు, సీబీై చార్జ్ షీట్, మనీలాండరింగ్ దర్యాప్తు నడుస్తుంది. 1.2 కోట్లు అక్రమ ప్రయోజనం అని, కొన్ని నిధులు తెలంగాణకు ఎన్నికల ఖర్చుల కోసం మల్లించారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఈ వ్యవహారంలో 31 కేసులు పెండింగులో ఉన్నాయని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో 2024లో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర అరెస్టు అనంతరం బెయిలు మీద విడుదలయ్యాడు.

తాజాగా మంత్రివర్గంలోకి డీకే శివకుమార్ నాగేంద్రను తీసుకుని ప్లానింగ్ మరియు స్టాటిస్టిక్స్, యూత్ ఎంపవర్ మెంట్, స్పోర్ట్స్ శాఖను అప్పగించారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దళితుల నిదులు దోచుకున్నందుకు మంత్రి పదవి నుండి తొలగించిన వ్యక్తిని తిరిగి ఎందుకు తీసుకున్నారు అన్నది బీజేపీ సంధిస్తున్న ప్రశ్న.

ఈ మేరకు బీజేపీ శాసనసభలో నినాదాలు చేయడం, నల్ల కండువాలతో నిరసన తెలపడంతో పాటు, శాసనసభ నడవకుండా అడ్డుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా డీసీ కార్యాలయాల ముందు నిరసనలు, విధానసౌధ నుండి వాల్మీకి విగ్ర: వరకు నిరసన, గవర్నర్ కు లేఖ రాసి జోక్యం చేసుకోవాలని కోరడం చేస్తున్నది.

అయినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో సెప్టెంబరు 1 నుండి 10 వరకు పాదయాత్ర చేస్తామని ప్రకటించింది. రాయచూరు నుండి 200 కిలోమీటర్ల దూరం ఉన్న మంత్రి నాగేంద్ర సొంత నియోజకవర్గం బళ్లారికి బీజేపీ పాదయాత్ర షెడ్యూలు ప్రకటించింది. మంత్రి రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెబుతంది. శాసనసభ లోపలా, బయటా బీజేపీ వత్తిడి పెంచుతున్న నేపథ్యంలో డీకె శివకుమార్ ను కలిసి తాను రాజీనామా చేస్తానని మంత్రి నాగేంద్ర ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది.

అయితే ఈ విషయంలో మంత్రి నాగేంద్రకు సీఐడీ క్లీన్ చిట్ ఇచ్చిందని, కోర్టు దోషిగా నిర్దారించలేదని, కొంత డబ్బు తిరిగి వచ్చిందని ప్రభుత్వం వాదిస్తున్నది. తాను దళితుడిని అయినందునే బీజేపీ, కేంద్ర ఏజెన్సీలు కుట్ర చేశాయని, పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం సువేందు అధికారి మీద కూడా 29 కేసులు ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తున్నాడు.

‘నేను నిందితున్ని మాత్రమే. దోషిని కాదు. శాసనసభలో చర్చిద్దాం అంటున్నాం. పార్టీకి ఇబ్బంది కలగకుండా రాజీనామా చేసేందుకు సిద్దం అని చెబుతున్నాను. కోర్టు నుండి క్లీన్ చిట్ వచ్చాకే తిరిగి మంత్రి వర్గంలోకి వస్తాను’ అని నాగేంద్ర అంటున్నాడు. అయితే ఆరోపణలు ఉన్నంత మాత్రాన మంత్రి కాకూడదని లేదు. శాసనసభలో చర్చకు నోటీసు ఇచ్చి చర్చలో పాల్గొనాలని సీఎం డీకె శివకుమార్ బీజేపీకి సూచిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? మంత్రి రాజీనామా చేస్తాడా ? బీజేపీ డిమాండ్ నెరవేరుతుందా ? వేచిచూడాలి.