పశ్చిమ బెంగాల్ కాదు...కొత్త పేరు అదే !
దేశంలో పశ్చిమ బెంగాల్ ఒక కీలకమైన రాష్ట్రం. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించిన క్షేత్రం.
By: Satya P | 7 Oct 2026 7:00 PM ISTదేశంలో పశ్చిమ బెంగాల్ ఒక కీలకమైన రాష్ట్రం. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించిన క్షేత్రం. ఇక దేశ విభజన సమయలో మొత్తం బెంగాల్ లో సగం భాగం పాకిస్థాన్ లో కలిసిపోయింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న బెంగాల్ తూర్పు భాగాన్ని తూర్పు బెంగాల్ గా పిలిచేవారు. ఇక రెండవ భాగంగా ఉన్న దానిని పశ్చిమ బెంగాల్ గా పిలుస్తున్నారు. గత ఎనభై ఏళ్ళుగా దేశంలో పెద్ద రాష్ట్రం గా ఉంటూ వస్తున్న పశ్చిమ బెంగాల్ పేరు మాత్రం అలాగే కొనసాగుతోంది. దీనిని మార్చాలని ప్రయత్నాలు గతంలో జరిగాయి. అయితే ఇపుడు పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. తొందరలోనే పశ్చిమ బెంగాల్ పేరుని మారుస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ప్రకటించారు.
కొత్త పేరు ఇదే :
వీలైనంత తొందరలోనే పశ్చిమ బెంగాల్ పేరుని పశ్చిమ బంగాగా మార్చనున్నట్లుగా ఆయన చెప్పారు. ఈ కొత్త పేరు రాష్ట్ర చారిత్రక గుర్తింపును ప్రతిబింబించేలా ఉండేలా చూసుకుంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక రాష్ట్రం పేరుని మారుస్తూ ఒక తీర్మానాన్ని బిల్లుగా చేసి త్వరలోనే అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ఇక మీదట రాష్ట్రం పేరు పశ్చిమ బంగా గానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి పేరు మార్చే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని ఆయన తెలిపారు. పశ్చిమ బంగా అన్న పేరుతో రాష్ట్ర చరిత్రతో దాని పేరుకు ఉన్న అనుబంధాన్ని కొనసాగించాలని అనుకుంటున్నామని వివరించారు.
సొంత గుర్తింపు కోసం :
ఒక రాష్ట్రానికి పేరు ఉండడం అన్నది ఆత్మ గౌరవం సొంత అస్తిత్వం చరిత్రను ప్రతిబింబించడం వంటివి అనుసంధానిస్తూ ఉంటుంది. పశ్చిమ బంగా పేరు కూడా అలాగే ఉంటుందనే నిర్ణయించామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య అంటున్నారు. అందుకే పశ్చిమ బంగా అని శాశ్వతమైన గుర్తింపుగా ఉండేలా కొత్త పేరుని పెట్టబోతున్నామని ఆయన చెప్పారు. బీజేపీ పట్టుదల చూస్తూంటే తొందరలోనే పశ్చిమ బంగా పేరు రాష్ట్రానికి పెట్టడం అనే ప్రక్రియ పూర్తి చేసేలా కనిపిస్తోంది అని అంటున్నారు.
గతంలో ప్రయత్నాలు :
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ పేరుని మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి అని గుర్తు చేస్తున్నారు. 1999ల్లో అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు హయాంలో పశ్చిమ్ బంగ అని పేరు మార్చాలని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారిగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. అయితే దీనికి కేంద్రం నుండి ఆమోదం లభించలేదు. ఆనాడు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఉంది. ఇక 2011లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పేరునుపశ్చిమ్ బాంగోగా మార్చాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఆనాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక 2016లో కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం మరోసారి పేరు మార్పుతో వినూత్న ప్రతిపాదన చేసింది. బెంగాలీలో బంగ్లా అని, ఇంగ్లీష్‌లో బెంగాల్ అని, హిందీలో బంగాల్ అని ప్రతిపాదించింది. అయితే ఒకే రాష్ట్రానికి వేర్వేరు భాషల్లో వేర్వేరు పేర్లు పెట్టడం కుదరదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను సైతం పక్కన పెట్టేసింది. ఇక 2018 జూలైలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ అన్ని భాషల్లోనూ ఒకే పేరుగా బంగ్లా అని మార్చాలని ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపింది. కానీ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఆ పేరుతో ఉండడంతో ఇది గందరగోళానికి దారితీస్తుందనే కారణంతో కేంద్రం దీనికి ఆమోదముద్ర వేయలేదు.
ఇది కీలక కారణం :
ఇంతకీ పేరు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు అన్నది చర్చగా ఉంది. ఒకటి సాంస్కృతిక చారిత్రక కారణంగా చెబుతున్నారు. మరొకటి చూస్తే అక్షర క్రమంలో తమ రాష్ట్రం ముందు ఉండాలన్నది ఆలోచన. భారత రాష్ట్రాల జాబితాలో డబ్య్లూ అన్న అక్షరంతో ప్రారంభం కావడం వల్ల ఢిల్లీలో జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారుల సమావేశాల్లో పశ్చిమ బెంగాల్ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం చిట్ట చివరిలో వస్తుంది. అదే రాష్ట్రం పేరును బంగ్లా లేదా పశ్చిమ బంగాగా అని మారిస్తే జాబితాలో పైకి వస్తారనేది ఒక ముఖ్య ఉద్దేశ్యంగా ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే దేశ విభజన తరువాత వలస వాద ముద్రను పూర్తిగా తొలగించేలా పశ్చిమ అన్న పేరుని తీసేయాలని డిమాండ్ కూడా ఉంది. కేవలం బంగా గా ఉంటే మేలు అని అనేకమంది సూచిస్తున్నారు.
