మార్షల్ ఆర్ట్స్ మాస్టర్...మణిపూర్ చీఫ్ మినిస్టర్
ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్ పెర్ట్. అంతే కాదు, మాస్టర్ కూడా. ఆయన ప్రవృత్తి గురించి తెలుసుకోవాలంటే చాలానే ఉంటుంది.
By: Satya P | 4 Feb 2026 8:54 AM ISTఆయన మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్ పెర్ట్. అంతే కాదు, మాస్టర్ కూడా. ఆయన ప్రవృత్తి గురించి తెలుసుకోవాలంటే చాలానే ఉంటుంది. ఆయన ఇపుడు మణిపూర్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన పేరు యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్. గత ఏడాది వరకూ మణిపూర్ కి చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన బీరేన్ సింగ్ కి వారసుడిగా ఆయనను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్పీకర్ నుంచి సీఎంగా :
ఇక యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ విషయానికి వస్తే ఆయన అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. ఇపుడు ఏకంగా సీఎం కాబోతున్నారు. ఇక యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ గురించి చెప్పుకోవాలి అంటే ఆయన ట్రెడిషనల్ టేక్వాండో క్రీడలో అయిదవ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి భారతీయుడిగా చాలా అరుదైన గుర్తింపునే సొంతం చేసుకున్నారు. దాంతో ఆయనను మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ గా చెబుతారు. ఇంతటి మార్షల్ ఆర్ట్స్ నేర్పరి మణిపూర్ హింసకు చలించిపోయారు. అందుకే ఆయన హింస చెలరేగిన తరువాత ఈ మధ్య కాలంలో గిరిజన ప్రాబల్యం ఉన్న ఉఖ్రుల్ కమ్‌జోంగ్ జిల్లాలలో పర్యటించి వచ్చారు. ఆ విధంగా అక్కడ పర్యటన చేసిన తొలి మెయితీ నేతగా నిలిచారు. అదే ఈ రోజు ఆయనను కీలక స్థానానికి చేర్చింది.
అనుభవం చాలానే :
గతంలో చూస్తే యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అంతే కాదు బీజేపీ టికెట్ మీద ఆయన 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సింగ్జమీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మణిపూర్ లో గత ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలన ఉంది. 2025 ఫిబ్రవరి 13 నుంచి అక్కడ దానిని విధించారు. మణిపూర్ లో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో కేంద్రం ఈ చర్యను తీసుకుంది. ఇక ఇపుడు పరిస్థితి అదుపులోకి రావడంతో యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ కి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన మెజారిటీ మెయితీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఆయన సీఎం గా ఎంపిక కావడంతో మణిపూర్ లో రాజకీయ అస్థిరతకు చెక్ పడినట్లే అని అంటున్నారు.
మంచి భక్తుడిగానూ :
ఒక వైపు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణుడిగా ఉన్న యుమ్నామ్ ఖేమ్‌చంద్ మరో వైపు ఆస్థికవాదిగా కూడా ఉన్నారు. ఆయన భగవాన్ శ్రీకృష్ణుడు భక్తుడు. ఆయనలో ఈ ఆధ్యాత్మిక భావనలు చాలా హెచ్చు. అందుకు కూడా ఆయన బీజేపీ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక కావడానికి కారణం అని విశ్లేషణలు ఉన్నాయని అంటున్నారు. ఇక బీజేపీకి మణిపూర్ లో బలం చూస్తే మొత్తం 60 మంది ఉన్న అసెంబ్లీలో బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇక మిత్రులు అయిన ఎన్పీపీ నుంచి ఆరుగురు, ఎన్పీఎఫ్‌కు ఐదుగురు ఎమ్మెల్యేల ఫుల్ సపోర్టు ఉంది. దాంతో ప్రభుత్వానికి ఏ రకమైన ఢోకా అయితే లేదు.
బరువైన బాధ్యత :
మార్షల్ ఆర్ట్స్ లో నిపుణత ఎన్నికల్లో కూడా చూపించాల్సి ఉందని అంటున్నారు. 2027లో మణిపూర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత యుమ్నామ్ ఖేమ్‌చంద్ దే అని అంటున్నారు. ఆయన మీద అధినాయకత్వం గురుతరమైన బాధ్యత ఉంచింది. మరి ఈ ఏడాదిలో పాలనను గాడిలో పెట్టాలి. లా అండ్ ఆర్డర్ ని చూసుకోవాలి. అంతే కాకుండా బీజేపీ మరోసారి గెలిచేలా చూడాలి. మరి ఈ సీనియర్ నేతకు ఇది బరువైన బాధ్యత. చూడాలి మరి ఏ విధంగా నెగ్గుకుని వస్తారో.
